అబద్ధాలతో కాలయాపన

16 Mar, 2015 03:38 IST|Sakshi

డోన్‌టౌన్: ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక అబద్ధాలతో ముఖ్యంత్రి చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. డోన్‌లోని ఆయన స్వగృహంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి.. ఆ మాటకు కట్టుబడి ఉండలేక కట్టుకథలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. డ్వాక్రా మహిళలను మరింత దారుణంగా మోసం చేసిన ఘనతను చంద్రబాబు మూటగట్టుకున్నారని ఆరోపించారు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి నేడు ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నారన్నారు.

ఇక నిరుద్యోగ భృతి 1.75 లక్షల ఇళ్లకు ఇవ్వాల్సి ఉందని, అయితే ఆ ప్రస్తావనే ముఖ్యమంత్రి తీసుకరావడం లేదని విమర్శించారు. రైతుల పై వడ్డీ భారం మోపడమే కాకుండా, ఇన్‌పుట్ సబ్సిడీని కూడా వర్తింపజేయకుండా వ్యవస్థనే నిర్వీర్యం చేశారని ఆరోపించారు. జీవో నంబర్ ఎంస్ 13ను ను రాద్ధాంతం చేసిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అదే జీవోను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారన్నారు.  

పోలవరం ప్రాజెక్టు కార్యాలయ, ఇతర అవసరాల నిమిత్తం కేంద్రం 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తే, దాన్ని కూడా తప్పుబట్టి నిధులు లేనట్లు ప్రజల ముందు డ్రామా ఆడటం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఇక పట్టిసీమ ప్రాజెక్టు ఎత్తిపోతల నిర్మాణం.. అవినీతికి నిలయంగా మారడం ఖాయమన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు వివాదం ముదిరి రైతుల ఆందోళన ఉద్ధృతంగా మారకముందే ప్రభుత్వం తీరు మార్చుకోవాలని సూచించారు.
 
స్వతంత్ర రాజకీయాలే మాకు తెలుసు..:

 రావుబహుదూర్ శేషారెడ్డి స్వతంత్రంగానే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, ఆ నాడు డోన్, వెల్దుర్తి, బేతంచెర్ల, ప్యాపిలి మండలాలు మాత్రమే నియోజకవర్గంగా ఉండేదన్నారు. ఇటీవల అసెంబ్లీలో  ఉపముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి  చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తనకు కానీ, తన కుటుంబానికి ఎక్కడా కూడా టీడీపీ సభ్యత్వం లేదన్నారు. తాను వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో కాంగ్రెస్‌లో చేరానని, నేడు జగన్ నాయకత్వంలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానన్నారు. తనను ఎన్నికల ముందు మూడేళ్ల క్రితమే అభ్యర్థిగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారన్నారు. ప్రజల ఆశీస్సులతోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానన్నారు.

1978లో కాంగ్రెస్ పార్టీలో పెద్దమనిషిగా ప్రస్తుత ఉపముఖ్యమంతి కేఈ క్రిష్ణమూర్తి, తదుపరి 1985లో విబేధాలు తలెత్తడంతో తెలుగునాడు పార్టీ పెట్టడం, ఆ తరువాత ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ కోసం విబేధాలు పొడచూపిన వాస్తవాలు ప్రజలకు తెలుసన్నారు. వాటిని కాదని నిజాయితీ గల రాజకీయాల పై విమర్శించడం పెద్ద మనుషుల విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. డోన్ పట్టణంలో నత్తనడకన నడుస్తున్న ఫ్లై ఓవర్ పనులను  పురోగతిలో తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నానన్నారు.

ఇక పక్షపాత ధోరణితో ఎంపిక చేసిన జన్మభూమి కమిటీలపై కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు. అనంతరం ప్యాపిలి మండలంలో బూర్గుల గ్రామంలో గడ్డి వామి దగ్ధమై నష్టపోయిన రైతు ఓబులేసుకు రూ. 5వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు శ్రీరాములు,మాజీ ఎంపీపీ రామక్రిష్ణారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు వలసలరామక్రిష్ణ,వ్యక్తిగత సహాయకులు అంకిరెడ్డి,మాజీ సర్పంచ్ మల్లెంపల్లె రామచంద్రుడు,కోట్రాయి వెంకటేశ్వర్‌రెడ్డి, బోరెడ్డి శ్రీరామిరెడ్డి, మెట్టుపల్లె వెంకటేశ్వర్‌రెడ్డి, మల్లికార్జునరెడ్డి,గార్లదిన్నె రామసుబ్బయ్య, ఎస్టీ సెల్ జిల్లాకార్యదర్శి శివ, తిరుపతయ్య, మైనార్టీ నాయకులు రఫి, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు