తూర్పుగోదావరిలో ఢిల్లీ కలకలం  

1 Apr, 2020 08:39 IST|Sakshi
పెద్దాపురంలో పరిస్థితిపై ఆరా తీస్తున్న జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ తదితరులు

నీడతో యుద్ధం చేయడమంటే అదో హాస్యాస్పద పదం. కానీ ఇప్పుడు ప్రపంచమంతా నీడతోనే యుద్ధం చేస్తోంది. శత్రువు ఎక్కడ ఉన్నాడో ... ఎలా ఉన్నాడో తెలియకపోయినా జిల్లా యంత్రాంగం, పాలకులంతా ఒక్కటై నిరంతర పోరు చేస్తున్నారు. పాజిటివ్‌ కేసులు గత రెండు రోజులుగా నమోదుకాకపోవడంతో ఊపిరిపీల్చుకున్న యంత్రాంగం తాజా పరిణామంతో అప్రమత్తమైంది.

సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాలో కరోనా కల్లోలం ఢిల్లీ చుట్టూ తిరుగుతోంది. బుధవారం జిల్లాలో మరో పాజిటివ్‌ కేసు నమోదు కావడంతో ప్రజలు భయపడుతున్నారు. దీంతో జిల్లాలో కరోనా కేసులు నాలుగుకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పెద్దాపురం కవాడీవీధికి చెందిన 65 ఏళ్ల వ్యక్తిని గత ఆదివారం అనుమానిత కేసుగా కాకినాడ జీజీహెచ్‌కు తీసుకురాగా బుధవారం పాజిటివ్‌గా నిర్థారించారు. ఈ క్రమంలో ఆ వీధిలో జిల్లా యంత్రాంగం విస్తృతమైన చర్యలు తీసుకుంది. కోవిడ్‌–19 జిల్లా ప్రత్యేకాధికారి బుడితి రాజశేఖర్, జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి, ఎస్పీ నయీం అస్మి పరిస్థితిని సమీక్షించి పటిష్టమైన చర్యలకు ఆదేశించారు.

మంగళ, బుధవారాల్లో నమోదైన మూడు పాజిటివ్‌ కేసులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారే కావడంతో జిల్లా వాసుల దృష్టంతా ఢిల్లీ వెళ్లి వచ్చినవారిపైనే పడింది. లండన్‌ నుంచి రాజమహేంద్రవరం వచ్చిన 23 ఏళ్ల యువకుడితో తొలి పాజిటివ్‌ కేసు నమోదు కాగా కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆ యువకుడు ప్రస్తుతం కోలుకుని రెండు మూడు రోజుల్లో డిశ్చార్జి అయ్యే పరిస్థితి ఉంది. ఈ నేపధ్యంలో ఢిల్లీ నిజాముద్దీన్‌ వద్ద జరిగిన ప్రార్థనల్లో పాల్గొని జిల్లాకు తిరిగొచ్చిన వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు తేలడంతో జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.  

కలెక్టరేట్‌లో గుబులు..
ఈ అంశంపై వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, సామాజిక మాధ్యమాల సమాచారాన్ని క్రోడీకరించి పరిశీలిస్తే రాజమహేంద్రవరం, కాకినాడ నగరాల్లో రెండు పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. కాకినాడ బ్యాంకు పేటలోని పాజిటివ్‌ కేసు వచ్చిన 49 ఏళ్ల వ్యక్తి ఢిల్లీ నుంచి జిల్లాకు తిరిగొచ్చాక ఎక్కడెక్కడకు తిరిగారు. ఎవరెవరిని కలిశారనేది ఆరా తీసిన యంత్రాంగానికి గుండెలు గుభేల్‌మన్నాయి. రవాణా అనుమతి పనిపై కాకినాడ పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి కాకినాడ కలెక్టరేట్‌లోని డీఆర్వో చాంబర్‌ సహా పలు సెక్షన్లతోపాటు కోవిడ్‌–19 అత్యవసర విభాగంలో కూడా కలియ తిరిగినట్టు కలెక్టరేట్‌ సీసీ పుటేజీ ఆధారంగా గుర్తించారు.  దీంతో జిల్లా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి డీఎంహెచ్‌ఒ కార్యాలయంలో కోవిడ్‌–19 పర్యవేక్షిస్తున్న డాక్టర్‌ మల్లిక్‌ సూచనలతో కలెక్టరేట్‌లో పలు సెక్షన్లను ఐసోలేషన్‌ చేయడంతో కలెక్టరేట్‌ యంత్రాంగం కాస్త ఊపిరిపీల్చుకుంది. ఆ వ్యక్తితోపాటు రాజమహేంద్రవరం పాజిటివ్‌ కేసు వ్యక్తి కూడా రాజమహేంద్రవరంలోని జాంపేటలో స్నేహితుడిని కలిసేందుకు వెళ్లడం, ఇటు కాకినాడ వ్యక్తి పిఠాపురం, ప్రత్తిపాడు మండలాల్లో  ప్రార్థనలకు వెళ్లడంతో ఆయా ప్రాంతాల ప్రజలు హడలిపోతున్నారు. పెద్దాపురంలో పాజిటివ్‌గా నమోదైన 65 సంవత్సరాల వ్యక్తి ఢిల్లీలోని మతపరమైన ప్రార్థనలకు వెళ్లి ఈ నెల 18న జిల్లాకు తిరిగొచ్చాడు. 

జిల్లా అంతటా జల్లెడ..
మూడు పాజిటివ్‌ కేసులు ఢిల్లీ వెళ్లి వచ్చిన వారికే సోకడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం జిల్లా అంతటా జల్లెడ పడుతోంది. జిల్లా నుంచి ఢిల్లీ వెళ్లి వచ్చిన 27 మందితోపాటు వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువుల కోసం వలంటీర్లు ద్వారా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన పరిసర ప్రాంతాల్లో ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లి జిల్లాకు తిరిగొచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారు ఎక్కడెక్కడ ఉన్నారు, వారితోపాటు కలిసిన వారెవరు అనేది ఒక కొలిక్కి తీసుకురాగలిగారు. జిల్లావ్యాప్తంగా ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులు, వారితో సన్నిహితంగా ఉన్న వారిని ప్రాథమికంగా గుర్తించి 108 శాంపిళ్లను సేకరించారు. వారందర్నీ క్వారంటైన్‌ సెంటర్‌లకు తరలించారు. కొత్తపేట, గోకవరం, మండపేట, కాజులూరు, రామచంద్రాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, పి.గన్నవరం తదితర ప్రాంతాలకు చెందిన వారిని ఢిల్లీ వెళ్లి వచ్చిన వారితో సన్నిహితంగా ఉన్నారనే కారణంతో ఆస్పత్రులకు, క్వారంటైన్‌ సెంటర్‌లకు తరలించడంతో స్థానికులలో ఆందోళన నెలకొంది. వచ్చే రెండు వారాలు స్వీయ నిర్బంధంలో ఉంటే భయమేమీ లేదని కలెక్టర్‌ భరోసానిస్తున్నారు.


కాతేరు శాంతినగర్‌లో రెడ్‌జోన్‌
రాజమహేంద్రవరం రూరల్‌: కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి నివశిస్తున్న కాతేరు గ్రామంలోని శాంతినగర్‌ ప్రాంతంలో కిలోమీటరు మేర రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. శాంతినగర్‌ మొత్తాన్ని ఆధీనంలోనికి తీసుకున్న అధికారులు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ డాక్టర్‌ ఆర్‌.మహే‹Ùకుమార్‌ నేతృత్వంలో డీఎల్‌పీవో జె.సత్యనారాయణ, ధవళేశ్వరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ సుధాకర్, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. శాంతినగర్‌లో కరోనా బాధితుడి ఇంటి నుంచి కిలో మీటర్‌ మేర బ్లీచింగ్, హైపోక్లోరైట్‌ను స్ప్రే చేయించారు. వైద్యసిబ్బంది, గ్రామ వలంటీర్లు తొమ్మిది బృందాలుగా ఏర్పడి ఆయా కుటుంబాల ఆరోగ్య పరిస్థితిపై సర్వే నిర్వహించారు.

ఐసోలేషన్‌లో కవాడీ ప్రాంతం
పెద్దాపురం: జిల్లాలోని పెద్దాపురం పట్టణంలో కరోనా కలవరపెడుతోంది. జిల్లా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసినప్పటికీ సుమారు 67 ఏళ్ల వద్ధుడికి కరోనా లక్షణాలున్నాయని తెలియడంతో మంగళవారం అధికార యంత్రంగా ఆ ప్రాంతాన్ని గుర్తించి ఐసోలెటేడ్‌ ప్రాంతంగా ప్రకటించారు. పట్టణ ప్రజల ఆరోగ్యంపై వలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించాలని ఆర్డీఓ మల్లిబాబుకు çకలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి సూచించారు. అనంతరం స్థానిక బీసీ సంక్షేమ శాఖ బాలికల వసతిగహం, వరహాలయ్యపేట యాసలపు సూర్యారావు భవనంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌ను కలెక్టర్, ఎస్పీలు పరిశీలించారు. పట్టణంలోని 16.17 వార్డుల్లో మున్సిపల్‌ కమిషనర్‌ జి.శేఖర్‌ ఆ«ధ్వర్యంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ దావీదురాజు పారిశుధ్య సిబ్బందితో ప్రత్యేక శానిటేషషన్‌ డ్రైవ్‌ను నిర్వహింపజేశారు. కలెక్టర్‌  వెంట డీఎంఅండ్‌హెచ్‌ఓ బి.సత్యసుశీల,  డీఎస్పీ శ్రీనివాసరావు ఉన్నారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు