కృష్ణా జిల్లాకు ‘ఢిల్లీ’ దడ 

1 Apr, 2020 09:18 IST|Sakshi
అంతటా నిశ్శబ్దం.. రామవరప్పాడు వద్ద నిర్మానుష్యంగా దర్శనమిస్తున్న జాతీయ రహదారి

బెజవాడ, జగ్గయ్యపేట, నూజివీడు పట్టణాల్లో ఉలికిపాటు 

ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 40 మంది బృందం 

 వీరిలో కొంతమందికి కరోనా లక్షణాలు కనిపించడంతో హైరానా 

వీరంతా ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరిని కలిశారన్న దానిపై యంత్రాంగం ఆరా 

కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు 

సాక్షి, అమరావతి: ఢిల్లీలో ఈనెల 14న జరిగిన మత ప్రార్థనలకు జిల్లా నుంచి 40 మంది వెళ్లారు. వీరంతా రెండు వారాల కిందట విజయవాడకు చేరుకున్నారు. స్వస్థలాలకు చేరుకున్న వీరందరూ తమ పర్యటనను రహస్యంగా ఉంచడమే కాకుండా.. స్థానికంగా ఉన్న ప్రార్థన మందిరాలకు వెళ్లి ప్రార్థనలు చేయడం గమనార్హం. అయితే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల అక్కడికి వెళ్లి వచ్చిన కొందరిలో కరోనా లక్షణాలు బయటపడడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరించి అందరినీ క్వారంటైన్‌కు తరలించడంతో ప్రస్తుతం వారుంటున్న ప్రాంతాల్లో కలకలం రేగుతోంది. (కొంపముచ్చిన మొక్కుబడి హెచ్చరికలు)

ఎక్కడెక్కడ తిరిగారు..? 
ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనల కార్యక్రమానికి విజయవాడ నగరం నుంచి 28 మంది, జగ్గయ్యపేట మండలం నుంచి 9 మంది, నూజివీడు నుంచి ఇద్దరు, నందిగామ మండలం నుంచి ఒక్కరు చొప్పున వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వీరంతా ఏపీ ఎక్స్‌ప్రెస్‌తోపాటు మరో రెండు రైళ్లలో ఈ నెల 18 తేదీల్లో జిల్లాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. వీరంతా ఎక్కడెక్కడ తిరిగారు? ఎవరెవరిని కలిశారన్నది ఆరా తీసి.. ముందస్తు చర్యగా వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ పర్యటన అనంతరం విజయవాడ నగరం, జగ్గయ్యపేట, నూజివీడు, నందిగామ మండలాలకు చెందిన వీరంతా ఈ నెల 18న వారివారి స్వస్థలాలకు చేరుకున్నారు. 20న వారి నివాసాలకు సమీపంలోనే ప్రార్థనలు చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఆ సమయంలో అక్కడ ఎంతమంది ప్రార్థనల్లో పాల్గొన్నారు? వారితో సన్నిహితంగా ఎంతమంది మెలిగారు? ఏ ప్రాంతాల్లో సంచరించారు? అన్న వివరాలను గుర్తించారు. ప్రస్తుతం వీరు కలిసిన వారందరి ఆరోగ్య పరిస్థితిపైనా వాకబు చేస్తున్నారు.(కరోనా బారిన పడి 13 ఏళ్ల బాలుడి మృతి)

వివరాల సేకరణలో అధికారులు.. 
దేశ రాజధాని ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో జగ్గయ్యపేట పట్టణంలో ఏడుగురు ఉన్నారు. మరో ఇద్దరు పేట మండలంలోని గౌరవరం  గ్రామానికి చెందిన వారు. వీరిని అధికారులు విజయవాడ, గన్నవరం క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. అనంతరం వారందరు ఎవరిని కలిశారు? ఎక్కడెక్కడ తిరిగారు? అన్న వివరాలు సేకరిస్తున్నారు. కాగా.. వారి కుటుంబ సభ్యులకు మాత్రం మంగళవారం సాయంత్రానికి కూడా ఎలాంటి పరీక్షలు జరపకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని ‘సాక్షి’ రెవెన్యూ అధికారులకు దృష్టికి తీసుకెళ్లగా.. వారందరికి ప్రత్యేక వైద్య బృందం బుధవారం వచ్చి పరీక్షలు నిర్వహిస్తుందని సమాధానం చెప్పారు.  

క్వారంటైన్‌లో 88 మంది..  
జిల్లా వ్యాప్తంగా 40 మంది ఢిల్లీకి వెళ్లిరాగా.. వారిలో విజయవాడ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం మృతి చెందాడు. మిగిలిన 39 మందిని రెవెన్యూ, పోలీసు అధికారులు సోమవారం క్వారంటైన్‌కు తరలించారు. అలాగే వీరితోపాటు కరోనా లక్షణాలు ఉన్న వారి కుటుంబసభ్యులను కూడా క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ విజయవాడ నగరంలోని రైల్వే ఆస్పత్రిలో 35 మంది, సెంటిని, గంగూరు, వెటర్నరీ కళాశాల తదితర చోట్ల మొత్తం 88 మందికి చికిత్సలు అందజేస్తున్నారు.

మరిన్ని వార్తలు