ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగిస్తే చర్యలు

7 Dec, 2013 00:49 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఓటర్ల తొల గింపులో పొరపాట్లు జరిగితే సరిదిద్దుతామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా జాబితా నుంచి ఓటర్లను గల్లంతు చేసినట్లు తేలితే.. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో దురుద్దేశంతో ఓటర్ల పేర్లను తొలగించినట్లు ఫిర్యాదులందాయని, వీటిపై విచారణ జరిపేందుకు డి ప్యూటీ కలెక్టర్ల స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా సవరణ తీరుపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్‌తో కలిసి భన్వర్‌లాల్ మాట్లాడారు.
 
 ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై అభ్యంతరాలుంటే తెలపాలని రాజకీయపార్టీలకు లేఖలు రాసినప్పటికీ, ఏ ఒక్క రాజకీయ పార్టీ ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయపక్షాలు చొరవ చూపితే ఈ సమస్య ఉత్పన్నం కాదన్నారు.  ప్రతి ఓటరు విధిగా జాబితా పరిశీలించి తమ పేరు ఉందా? లేదా? అనేది గమనించాలన్నారు. పేరు లేకున్నా, నమోదు కాకున్నా, మార్పులు, చేర్పులు కావాల్సివున్నా సంబంధిత బూత్‌స్థాయి అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 10, 15వ తేదీల్లో స్థానిక పోలింగ్ కేంద్రాల్లో, వార్డు కార్యాలయం/ చౌక ధరల దుకాణంలో ఓటర్ల జాబితాలను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. అంతేగాకుండా వెబ్‌సైట్‌లోను జాబితాలను పరిశీలించుకోవచ్చని తెలిపారు. రాష్ర్టంలో చోటుచేసుకున్న తుపాన్లు, ఇతర కారణాలతో ఓటర్ల నమోదు గడువును ఈ నెల 17వ తేదీవరకు పొడిగించినట్లు భన్వర్‌లాల్ వెల్లడించారు. అర్హులైన ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
 
 గ్రేటర్‌లో 1.50 లక్షల మంది డూప్లికేట్ లు
 వేర్వేరు చోట్ల నమోదైన ఓటర్ల ఏరివేత ప్రక్రియను పూర్తి చేస్తున్నామని భన్వర్‌లాల్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 1,50,802 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందన్నారు. రాష్ర్టవ్యాప్తంగా వివిధ చోట్ల నమోదైన డూప్లికేట్(ఒకే వ్యక్తి పేరిట) ఓటర్లను ఏరివేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సాంకేతికంగా కొన్ని సమస్యలు  ఉత్పన్నంకావడంతో తొలివిడతగా ఐదారు సరిహద్దు జిల్లాలను ఎంచుకొని డూప్లికేట్ ఓటర్లను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. తాజాగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణలో సుమారు 6 లక్షల ఓటర్లను ఏరివేసినట్లు చెప్పారు. చనిపోయిన 54,179, పలుచోట్ల నమోదైన 1,58,914 మందితోపాటు వేర్వేరు పోలింగ్ బూత్‌లలో నమోదైన 4,08,946 పేర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. ముంబై మహానగరంలో పదిలక్షల ఓటర్లు తొలగించారని, మన దగ్గర కూడా పలు ప్రాంతాల్లో నమోదైన ఓటర్ల వివరాలను తొలగించే ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా డూప్లికేట్ రహిత ఓటర్ల జాబితాను రూపొందించాలని భావిస్తున్నామని చెప్పారు.
 
 సరి‘కొత్త’ కార్డులు
 ఓటరు గుర్తింపు కార్డుల(ఎపిక్) డిజైన్‌ను మార్చుతున్నట్లు భన్వర్‌లాల్ తెలిపారు. పాత కార్డుల స్థానే ‘స్మార్ట్’ కార్డులను ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. తొలి దశలో కొత్త ఓటర్లకు వీటిని పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 25న వీటిని అందజేయనున్నట్లు పేర్కొన్నారు. సవరణలు జరిగిన పాత ఓటర్లకు కూడా వీటిని ఇవ్వనున్నట్లు వివరించారు.
 
 ఓటరు దరఖాస్తులను నిశితంగా పరిశీలించండి
 ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులను ఈనెల 31లోగా పరిశీలించి పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి బన్వర్‌లాల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జీహెచ్‌ఎంసీలోని 24 నియోజకవర్గాల పరిధిలోని ఈఆర్‌ఓలు, ఏఆర్‌ఓలు, బీఎల్‌ఓలతో సమీక్షించారు. ఓటరు నమోదు గడువును పెంచి నందున ఈఆర్‌ఓలు ప్రతి దరఖాస్తును పరిశీలించేందుకు మరింత సమయం దొరికిం దన్నారు. చిన్నపాటి కారణాలతో దరఖాస్తులను తిరస్కరించడం తగదన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా నియమించిన బీఎల్‌ఓల వివరాలను అందుబాటులో ఉంచాలన్నారు. జీహెచ్‌ఎంసీ ప్రత్యేక కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో 1.07లక్షల ఫారమ్-6 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో 97శాతం ఈ-రిజిస్ట్రేషన్ల ద్వారా, 3శాతం మాన్యువల్‌గా వచ్చాయన్నారు. గ్రామీణ ప్రాంతంలో డూప్లికేట్ ఓటర్ల సమస్య లేదని, అయితే పట్టణ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో సమస్యను అధిగమించేందుకు బీఎల్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్ బి.శ్రీధర్ తెలిపారు. ఈ సమావేశంలో ఓఎస్‌డీ సాద్రి, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ రఘు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు