పురాతన వంతెనతో ప్రమాదమే

7 Apr, 2018 11:52 IST|Sakshi
కూలడానికి సిద్ధంగా ఉన్న సమిశ్రగూడెం వంతెన

సమిశ్రగూడెం వంతెనను పరిశీలించి తేల్చిచెప్పిన అధికారులు

9 నుంచి భారీవాహనాల రాకపోకలు నిషేధం

నిడదవోలు :నిడదవోలు మండలం సమిశ్రగూడెం వద్ద  పశ్చిమడెల్టా ప్రధాన కాలువపై బ్రిటీష్‌ హయాంలో 1932లో నిర్మించిన పురాతన వంతెన ప్రమాదకరంగా ఉందని నిపుణులు తేల్చిచెప్పారు. దీంతో ఈ నెల 9 నుంచి ఆ వంతెనపై 10 టన్నులకు మించిన భారీ వాహనాల రాకపోకలను అధికారులు నిషేధం విధించారు. భారీ వాహనాలను అనుమతించేది లేదని ఆర్‌అండ్‌బీ కొవ్వూరు డీఈఈ ఎ.శ్రీకాంత్‌ స్పష్టం చేశారు. వంతెనపై పది టన్నుల లోడు వాహనాలను మాత్రమే వెళ్లాలని, 24 కిలోమీటర్ల వేగం మించి రాకపోకలు సాగించరాదని తెలిపారు.

ఇదే వంతెనకు కూతవేటు దూరంలో ఉన్న గడ్డర్‌ బ్రిడ్జి ఇటీవల కుప్పకూలింది. ఈ రెండు వంతెనలూ ఒకేసారి నిర్మించారు. దీంతో సమిశ్రగూడెం వంతెనపై ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. ఇదే అంశంపై మార్చి 20న ‘సాక్షి’ కథనాన్ని ప్రచురించింది. దానికి స్పందించిన ఆర్‌అండ్‌బీ చీఫ్‌ ఇంజినీర్‌ పి.సుబ్బారావు తన సిబ్బందితో మార్చి 24న సమిశ్రగూడెం వంతెనను పరిశీలించారు. మార్చి 31న హైదరాబాద్‌ నుంచి స్రైయోరంట్‌ సంస్థకు చెందిన నలుగురు బృందం కూడా వచ్చి వంతెనను పరిశీలించి వంతెన ప్రమాదకరంగా ఉందని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.

వివిధ శాఖల అధికారుల సమీక్ష
పురాతన వంతెన రక్షణపై గురువారం రాత్రి నిడదవోలు సీఐ ఎం.బాలకృష్ణ ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌ బీ, ఆర్టీసీ, అగ్ని మాపక అధికారులు, లారీ యూనియన్‌ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిపుణులు తేల్చి చెప్పిన ఆంశాల ప్రకారం ఆర్‌అండ్‌బీ అధికారులు వంతెన సామర్థ్యం, లోడు నియంత్రణ అంశాలను వివరించారు. భారీ వాహనాలు వెళ్లకుండా ఉండేందుకు ఐరన్‌ గడ్డర్‌ స్టాపర్లను ఏర్పాటు చేస్తామన్నారు.

ఆర్టీసీ బస్సులకూ అనుమతి నిల్‌
10 టన్నులకు మించి బరువున్న వాహనాలు వెళితే ప్రమాదమని అధికారులుతేల్చడంతో ఆర్టీసీ బస్సులు కూడా ప్రయాణించలేని పరిస్థితి. దీంతో ఆర్టీసీ సర్వీసులను కూడా వంతెనపై నిషేధించారు. బస్సుల దారి మళ్లింపుపై ఆర్టీసీ అధికారులు సమీక్షిస్తున్నారు.

మరిన్ని వార్తలు