చక్కెర..ఓ చేదు నిజం

28 Mar, 2019 10:28 IST|Sakshi
డెల్టా షుగర్‌ ఫ్యాక్టరీ, హనుమాన్‌జంక్షన్‌

సాక్షి,గన్నవరం :  జిల్లా వాసులకు హనుమాన్‌జంక్షన్‌ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది మొదట ప్రసిద్ధ అభయాంజనేయ స్వామి దేవస్థానం కాగా రెండవది అంతే పేరున్న షుగర్‌ ఫ్యాక్టరీ. నిజంగా ఈ ప్రాంత ప్రజలకు చక్కెర కార్మాగారంతో అంత అవినాభవ సంబంధం ఉంది. జంక్షన్‌ పరిసరాల ప్రాంతాల్లో వేలాది మంది చెరకు రైతులు, కూలీలు, వందలాది మంది కార్మికులు ఈ ఫ్యాక్టరీని నమ్ముకుని ఉన్నారు.

డెల్టా షుగర్‌ ఫ్యాక్టరీకి 2017 అక్టోబర్‌లో లాకౌట్‌ ప్రకటించడం జంక్షన్‌ వాసులను తీవ్రంగా కలిచివేసింది. ఫ్యాక్టరీపై ఆధారపడిన దాదాపు 10 వేల మంది చెరకు రైతులు, 400 మందికిపైగా కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. హనుమాన్‌జంక్షన్‌కు ఓ తలమానికంగా ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీ కనుమగురు కానుందనే చేదు నిజాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు పాలనలో తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.    

ముగిసిన షుగర్‌ ఫ్యాక్టరీ ప్రస్థానం..
హనుమాన్‌ జంక్షన్, నూజివీడు, గన్నవరం ప్రాంతాల్లో చెరకు సాగు విస్తీర్ణం అధికంగా ఉండటంతో గతంలో ప్రైవేట్‌ వ్యక్తులకు చెందిన చిన్న, చిన్న ఖండసారి చక్కెర మిల్లులు ఆరేడు ఉండేవి. క్రమేణా చెరకు సాగు విస్తీర్ణం పెరగటంతో వీటి సామర్థ్యం సరిపోకపోవటంతో 1977లో షుగర్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు తొలి బీజం పడింది. అప్పటి నూజివీడు ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎంఆర్‌ అప్పారావు సారధ్యంలో ప్రభుత్వ, రైతుల భాగస్వామ్యంతో కో–ఆపరేటివ్‌ షుగర్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు విశేష కృషి చేశారు.

చంద్రబాబు పాలనలోనే ప్రైవేట్‌పరం..
షుగర్స్‌ ఫ్యాక్టరీలో 1982–83 సీజన్‌లో ప్రారంభమైన చెరకు క్రషింగ్‌ 17 ఏళ్లు పాటు సహకార రంగంలో కొనసాగింది. 2001లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరీ నష్టాలను సాకుగా చూపి వేలం ద్వారా హనుమాన్‌ కోఆపరేటివ్‌ షుగర్స్‌ను లైలా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ అధినేత గోకరాజు గంగరాజుకు రూ.11.40 కోట్లకు విక్రయించేశారు. అప్పట్లో సుమారు రూ. 300 కోట్లు విలువ చేసే సహకార రంగంలోని ఫ్యాక్టరీని, 90 ఎకరాల విలువైన భూమిని కారుచౌకగా తెలుగుదేశం ప్రభుత్వం విక్రయించటం రైతుల ఆగ్రహానికి కారణమైంది.

కనీసం సహకార చెక్కర కార్మాగారంలో రైతుల 49 శాతం షేర్‌ వాటాను కూడా ఆనాటి సీఎం చంద్రబాబు చెల్లించకుండా మొండిచేయి చూపించారు. లైలా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ సారధ్యంలో ‘డెల్టా షుగర్స్‌’గా రూపాంతరం చెంది 2001–02 సీజన్‌లో రోజుకు 2500 టన్నుల క్రషింగ్‌ సామర్థ్యంతో ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభమైంది. 2015–16 నాటికి ఫ్యాక్టరీ క్రషింగ్‌ సామర్థ్యం 3500 టన్నులు కాగా, లక్షన్నర టన్నుల చెరకును క్రషింగ్‌ చేసి చక్కెర ఉత్పిత్తి చేశారు.

ఫ్యాక్టరీ మూసివేత వ్యూహాత్మకమేనా? 
మూడేళ్లుగా డెల్టా షుగర్స్‌ యాజమాన్య వైఖరి పరిశీలిస్తే వ్యూహాత్మకంగానే మూసివేతకు ప్రణాళికతో ఉన్నారనిపిస్తోంది. చెరకు సాగు విస్తీర్ణంపై సరిగ్గా దృష్టి పెట్టకపోవటం, రైతులకు సకాలంలో చెరకు తోలిన డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేయటం వంటి ఆంశాలు యాజమాన్యం తీరుపై పలు అనుమానాలను రేకేత్తించాయి.

జాతీయ రహదారికి ఆనుకుని 100 ఎకరాల స్థలంలో ఫ్యాక్టరీ ఉండటంతో ఇతరత్రా వ్యాపార అవసరాలకు స్థలం వినియోగించుకునే దురుద్దేశంతోనే లాకౌట్‌ దిశగా అడుగులు వేశారని ప్రచారం. విలువైన  స్థలంపై యాజమాన్యం దృష్టి పెట్టడంతోనే క్రమంగా ఫ్యాక్టరీని నిర్వీర్యం చేసిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు