గళం విప్పిన ‘ప్రత్యేక కోనసీమ’

12 Aug, 2014 00:10 IST|Sakshi
గళం విప్పిన ‘ప్రత్యేక కోనసీమ’

 అమలాపురం : కోనసీమ ప్రత్యేక జిల్లా డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు రాజకీయ నేతలకు మాత్రమే పరిమితమైన ఈ డిమాండ్ జనబాహుళ్యంలోకి చొచ్చుకు వెళుతోంది. అన్నివర్గాల వారు కోనసీమను ‘ప్రత్యేక’ జిల్లా చేయాలని గళం విప్పుతున్నారు. ఉద్యమానికీ సై అంటున్నారు. మన్యసీమ పేరుతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దీని తరువాత కోనసీమ జిల్లాను ఏర్పాటు చేయాలనే నినాదం మరింత విస్తృతమవుతోంది.  తూర్పుగోదావరి జిల్లాను రాజకీయంగా, ఆర్థికంగా శాసించే స్థాయిలో ఉన్న కోనసీమను ప్రత్యేక జిల్లా చేయాలనేది ఈ ప్రాంతవాసుల దశాబ్దాల నాటి కల. ప్రత్యేక జిల్లాగా ఏర్పడితేనే రైల్వేలైన్ వస్తుందని, పారిశ్రామికాభివృద్ధి జరిగి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని స్థానికులు భావిస్తున్నారు.
 
 అయితే ఈ డిమాండ్‌ను గత ప్రభుత్వాలు  చెవికెక్కించుకోలేదు. రాష్ట్ర విభజన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటు తెరపైకి రావడంతో కోనసీమ జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ పెరిగింది. వ్యవసాయ, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు, ఇసుక రీచ్‌ల వల్ల జిల్లాకు వస్తున్న ఆదాయంలో కోనసీమ వాటా 40 శాతం వరకు ఉంటుందని అంచనా. కృష్ణా గోదావరి బేసిన్ (కేజీ) బేసిన్ ద్వారా ప్రముఖ చమురు సంస్థల కార్యకలాపాలు కోనసీమ కేంద్రంగానే జరుగుతున్నాయి. ఈ ప్రాంతం నుంచి రూ.1250 కోట్ల విలువైన ఆక్వా ఎగుమతులు విదేశాలకు జరుగుతాయి. ఇదే కాకుండా రూ.250 కోట్ల విలువైన వరి, కొబ్బరి, ఇతర వాణిజ్య పంటల ఎగుమతి జరుగుతోంది. ఇవి కాకుండా ఇసుక రీచ్‌ల ద్వారా కూడా ఇబ్బుడిముబ్బడిగా ఆదాయం వస్తోంది.
 
 జిల్లాలో సుమారు 51 లక్షల మంది జనాభా ఉండగా, కోనసీమలో సుమారు 15 లక్షల మంది వరకు  ఉన్నారు. గతంలో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, నియోజకవర్గ పునర్విభజనలో ఇవి ఐదుకు పరిమితయ్యాయి. ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో మండలమైన తాళ్లరేవు, కొత్తపేట నియోజకవర్గంలో భాగంగా ఉన్న ఆలమూరు కోనసీమ ఆవలివైపు ఉన్నాయి. ప్రత్యేక దీవిగా ఉన్న ఈ ప్రాంతాన్ని జిల్లా చేయాలనే డిమాండ్ చాలా కాలంగా  ఉంది. అయితే పూర్తిగా ఒక పార్లమెంట్ నియోజకవర్గం కూడా కాని ఈ ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లా చేయలేమని ఇతర ప్రాంత నేతలు వాదిస్తున్నారు.  దీని వెనుక  ఆదాయం కోల్పోతామనే భయమే ఎక్కువుగా ఉందని కోనసీమవాసుల వాదన. విభజన నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయని, జిల్లాకు 25 వరకు స్థానాలు పెరిగే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. అంటే జిల్లాలో ఇప్పుడున్నదానికన్నా అదనంగా ఆరు పెరుగుతాయి.
 
 ఈ విధంగా చూస్తే కోనసీమలో మరో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు కొత్తగా వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో కోనసీమను ప్రత్యేక జిల్లా చేసే అవకాశాలున్నాయని కోనసీమ వాసులు చెబుతున్నారు. మన్యసీమతో... ప్రత్యేక కోనసీమకు ఊపురాష్ట్ర పునర్విభజ చట్ట సవరణ ద్వారా పోలవరం ముంపు ప్రాంతమైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఉభయ గోదావరి జిల్లాల్లో కలిపిన విషయం తెలిసిందే.
 
 ఈ మండలాలను తూర్పులోని రంపచోడవరం డివిజన్, పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం డివిజన్ కలిపి మన్యసీమగా కొత్త జిల్లా ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం దాదాపుగా నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రత్యేక కోనసీమ డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. దశాబ్దాలుగా ఉన్న కోనసీమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అవసరమైతే ఉద్యమించాలని నిర్ణయానికి వచ్చారు. ఇప్పటివరకు రాజకీయ నేతల ప్రకటనలకే పరిమితమైన ఈ డిమాండ్ ఇప్పుడు ఉద్యమం రూపం దాలుస్తోంది. అన్నివర్గాలవారు దీనిపై గళమెత్తుతున్నారు. అమలాపురంలో ఆదివారం కోనసీమ ప్రత్యేక జిల్లా సాధనా సమితి ఆవిర్భవించింది. ఇప్పటి వరకు దీనిపై విడివిడిగా ఉద్యమిస్తున్న సంఘా లు ఏకతాటిపైకి వస్తున్నాయి.  మన్యసీమ ఏర్పడిన తరువాత ఈ ఉద్యమం ఉద్ధృతమయ్యే అవకాశముంది.
 

మరిన్ని వార్తలు