ప్రమాదంలో ప్రజాస్వామ్యం : రాజా

30 Jun, 2014 02:23 IST|Sakshi

విజయవాడ : దేశంలో మతతత్వశక్తులు రాజ్యమేలుతున్నాయని, ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యవ్యవస్థకు నష్టం చేకూరుస్తుందని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా అన్నారు. విజయవాడలో కామ్రెడ్ దాసరి నాగభూషణరావు పేరిట నిర్మించిన సీపీఐ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేశారు.   

ఆయన మాట్లాడుతూ  భవిష్యత్తులో ప్రజాస్వామ్యం పెద్దసవాళ్లను ఎదుర్కొబోతోందన్నారు. కార్పొరేట్ శక్తుల విస్తృత ప్రచారంతోనే మోడీ అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైల్వే చార్జీలు పెంచి ప్రజలపై మోయలేని  భారం మోపారన్నారు. కార్పొరేట్ కంపెనీలకు పెద్ద ఎత్తున లాభాలు చేకూర్చి పేదల ప్రయోజనాలను కాలరాసే కార్యక్రమాలను  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపడతుందన్నారు. అధికారంలోకి రాగేనే సెన్సెక్స్ పెరడగం వెనుక రహస్యం  ఇదేనన్నారు. ఈ విషయాన్ని మేధావులు గమనించాలని ఆయన కోరారు.
 
గడ్డపార నానబెట్టేందుకే విధివిధానాల కమిటీ : నారాయణ
 
గడ్డపార నానబెట్టేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవసాయ రుణమాఫీ విధివిధానాల కమిటీని నియమిస్తూ ఫైలుపై తొలిసంతకం పెట్టారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ కార్యదర్శి కె.నారాయణ ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు వ్యవసాయ రుణమాఫీపై తొలిసంతకం పెడతానని ప్రకటించిన చంద్రబాబు ఎవర్ని మోసం చేసేందుకు కమిటీ ఏర్పాటుకు సంబంధించి సంతకం చేశారని ప్రశ్నించారు.

బంగారంపై తీసుకున్న రుణాలతోపాటు అన్ని రుణాలు మాఫీ చేయాల్సిందేనన్నారు. దీనిపై సీపీఐ రెండు రకాలుగా పోరాటం చేస్తుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయకపోతే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి కేసు వేస్తామన్నారు. మేనిఫెస్టోను అమలు చేయని టీడీపీ. పార్టీని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టేవరకు వత్తిడి తెస్తామన్నారు.  ప్రభుత్వ హామీల పట్ల కమ్యూనిస్టుపార్టీలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పి.రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ఎం.నాగేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు సి.రాఘవాచారి, జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, సీపీఎం నగర కార్యదర్శి సీహెచ్.బాబూరావు  పాల్గొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు