ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: వైఎస్ జగన్

13 Feb, 2014 16:28 IST|Sakshi
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు: వైఎస్ జగన్

పట్టపగలు పార్లమెంటు సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ''ప్రజాస్వామ్యం బతికుందా లేదా అని ప్రశ్నిస్తున్నాను. హిట్లర్ కూడా ఇంత అన్యాయంగా చేస్తాడో లేదో నాకు తెలీదు. మన దేశంలో.. సాక్షాత్తు సోనియా గాంధీ గారు హిట్లర్లా ప్రవర్తిస్తుంటే, వీళ్లు మనుషులా, రాక్షసులా అనిపిస్తోంది. అందరం కలిసికట్టుగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. రేప్పొద్దున్న తమిళనాడుకైనా, కర్ణాటకకైనా, ఉత్తరప్రదేశ్కైనా ఇలాగే చేస్తారు. ఇది చాలా చాలా అన్యాయం. దీన్ని ప్రతి ఒక్కరూ ప్రతిఘటించాలి. రేపు వైఎస్ఆర్సీపీ తరఫున రాష్ట్రవ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నాం.

ఎంపీలు కొట్టుకోవడం ఇంతవరకు ఎప్పుడూ లేదు. వీడియో క్లిప్పింగులు ఒక్కసారి చూస్తే తెలుస్తుంది. చంద్రబాబు తెలంగాణ, సీమాంద్ర ప్రతినిధులతో మాట్లాడారు. ఇద్దరూ కలిసి ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అన్నారు. అక్కడ కొట్టుకున్నది వేణు, రాథోడ్. ఇద్దరూ టీడీపీ వాళ్లే. వాళ్లలో వాళ్లే కొట్టుకున్నట్లు చిత్రీకరించారు. ఈ వ్యవస్థ మారాలి. సమైక్యం అంటే దానర్థం తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్ర. మూడు ప్రాంతాల వారు అన్నదమ్ముల్లా వెళ్లాలి. లేకపోతే బంగారం లాంటి రాష్ట్రం రెండువైపులా దెబ్బతింటుంది. బీజేపీ మాతో కలిసొస్తుందన్న నమ్మకం చాలా ఉంది. జరుగుతున్న అన్యాయం చూసి ప్రతిపక్షాలన్నీ కూడా కలిసొస్తాయన్న నమ్మకముంది. ప్రతి ఒక్కరినీ కలిసి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తాం. నేనొక్కడినే కాదు.. అందరూ కలిసి ఆపుదాం. చంద్రబాబు ఇప్పటికైనా తన నోటి నుంచి 'జై సమైక్యాంధ్ర' అనే ఒక్క మాట అని, రెండు ప్రాంతాలకు మేలు చేసేలా ఆయన ప్రవర్తన, మనసు మారాలని దేవుడిని ప్రార్థిస్తున్నా'' అని ఆయన అన్నారు.

మరిన్ని వార్తలు