వాస్తు కోసం పోలీస్‌ స్టేషన్‌ గది కూల్చివేత

4 Dec, 2019 10:40 IST|Sakshi
బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌ భవనంపై గదిని కూల్చేస్తున్న కూలీలు

బి.కొత్తకోట :  వాస్తు దెబ్బకు బి.కొత్తకోట పోలీస్‌ స్టేషన్‌ భవనంపై గది కూలిపోయింది. మండల పరిధిలో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలతో ఏదో వాస్తులోపం ఉందని భావించారు. వాస్తు రీత్యా స్టేషన్‌ భవనంపై ఉన్న గది ఉండకూదని గ్రహించారు. మంగళవారం ఆ గదిని  కూల్చేశారు. వాస్తవంగా ఈ గది పోలీస్‌స్టేషన్‌ భవన నిర్మాణంలో భాగం కాదు. 1980లో పోలీస్‌స్టేషన్‌ను నిర్మించగా, 1992లో గది నిర్మించారు. 1980 దశాబ్దంలో పీపుల్స్‌వార్‌ (ప్రస్తుత మావోయిస్టు పార్టీ) చరిత్రలో  తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఉన్న గుర్తింపు ఏ ప్రాంతానికీ లేదు. పీపుల్స్‌వార్‌ వెలుగు వెలిగిన కాలంలో తంబళ్లపల్లె కార్యకలాపాలతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంతోపాటు ఉద్రిక్తతలు, సంచలన సంఘటనలు జరిగాయి. వార్‌ కదలికలు అధికంగా ఉండటం, తీవ్రమైన సంఘటనలు చోటు చేసుకోవడంతో నియోజకవర్గంలోని పోలీస్‌స్టేషన్లకూ భద్రత కలి్పంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో మదనపల్లె నియోజకవర్గం పరిధిలో ఉన్న బి.కొత్తకోట, ముదివేడు, తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం పోలీస్‌స్టేషన్లపై పీపుల్స్‌వార్‌ దళాలు దాడులు చేస్తే తిప్పికొట్టడం కోసం రక్షణ చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్‌ భవనంపై ఓ గదిని నిర్మించి అందులో ఇసుక బస్తాలు వేసి, సాయిధ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. 24 గంటలు గది నుంచి పహారా ఉండేది. స్టేషన్ల చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఎవరైనా నేరుగా స్టేషన్‌లోకి వచ్చే వీలులేకుండా కంచెతో పలు వలయాలను నిర్మించారు. ఇలా చేయడం ద్వారా నక్సల్స్‌ను స్టేషన్లలోకి దూసుకురాకుండా నివారించడం, పై గదిలో పహారా కాస్తున్న సాయుధ బలగాలు నిలువరించడం సాధ్యమవుతుందని ఇలా చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో అంటే 1992–93లో బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌పై ఈ గది నిర్మించారు. అప్పుడు నిర్మించిన గది 2000 వరకు ఉపయోగంలో ఉండగా, అనంతర పరిణామాలతో పీపుల్స్‌వార్‌ కనుమరుగు కావడంతో నిఘా, కంచెను తొలగించారు. అప్పటి నుంచి వృథాగా ఉన్న ఈ గది ఇప్పుడిలా వాస్తు దెబ్బకు కూలిపోయింది.   

మరిన్ని వార్తలు