అమ్మో.. డెంగీ!

19 Jul, 2015 02:46 IST|Sakshi
అమ్మో.. డెంగీ!

చిత్తూరు (అర్బన్) : జ్వరంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. అయితే ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా కనిపిస్తున్న డెంగీ జ్వరాలు ప్రస్తుతం పట్టణాలు, నగరాలకు పాకాయి. దీంతో ఒక్కసారిగా జిల్లాలోని ప్రజల్లో తీవ్ర ఆందోళనలు నెలకొంటున్నాయి. దీనికితోడు జిల్లావ్యాప్తంగా ఆరు మునిసిపాలిటీలు, రెండు కార్పొరేషన్లలో పారిశుద్ధ్య కార్మికులు నిరవధిక సమ్మె చేపట్టడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. పట్టణాల్లో పేరుకుపోయిన చెత్త, కాలువల్లో నిలిచిపోయిన మురుగునీటి నుంచి దోమలు ఉత్పత్తి అవుతున్నాయి.

 పగలు డెంగీ.. రాత్రి మలేరియా...
 డెంగీ జ్వరం ఈడిన్ ఎడిఫై అనే దోమ కాటు ద్వారా వస్తుంది. ఈ దోమ పగటి పూట మాత్రమే ఇళ్లలో సంచరిస్తూ మనుషుల్ని కుడుతుంది. నివాస ప్రాంతాల్లో నిల్వ చేసే మంచినీళ్లలో ఎడిఫై దోమలు ఉత్పత్తి అవుతూ డెంగీని వ్యాప్తి చేస్తున్నాయి. ఇక మలేరియాను కలిగించే అనాఫిలస్ దోమలు చీకటి పడితే వచ్చేస్తున్నాయి. మురుగునీటి కుంటలు, కాలువల్లో ఉంటే దోమలు కుట్టడం వల్ల మలేరియా వ్యాప్తి చెందుతోంది. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం గత ఏడు నెలల్లో 159 డెంగీ కేసులు నమోదయ్యాయి. అయితే అధికారుల లెక్కల్లోకి రానివి 300లకు పైగానే ఉన్నాయి.  జిల్లాలోని పుంగనూరు, మదనపల్లె, చిత్తూరు మునిసిపాలిటీలతో పాటు గుర్రంకొండ, గంగాధరనెల్లూరు, పలమనేరు ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.

 నిర్ధారణ కిట్ల కొరత
 ప్రభుత్వం నుంచి డెంగీ నిర్ధారణ కిట్లు సరఫరా కావడంలేదు. జిల్లాలోని 15 వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో మాత్రమే డెంగీని రెండో దశలో నిర్ధారించే కిట్లు ఉన్నాయి. మిలిగిన 94 పీహెచ్‌సీలు, 644 ఆరోగ్య ఉప కేంద్రాల్లో ఇవి లేవు. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో డెంగీ నిర్ధారణ చేసే కిట్లు అందుబాటులో ఉన్నాయి. డెంగీ జ్వరాలపై విస్తృత ప్రచారం కోసం జిల్లా వైద్యశాఖలో ఎలాంటి నిధులు లేకపోవడంతో ప్రజల్లో అవగాహన రాహిత్యం నెలకొంది.
 
  అప్రమత్తంగా ఉండండి : జిల్లా కలెక్టర్
 డెంగీ జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు విష జ్వరాల బారిన పడకుండా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. ఎవరికైనా జ్వరాలు వస్తే అశ్రద్ధచేయకుండా వెంటనే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ వైద్య శాలలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఏపీవీవీపీ అధికారులు జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లాలోని 15 ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఫీవర్‌సెల్స్ ఏర్పాటుచేసి, వైద్యులు 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. డెంగీ లక్షణాలు కనిపిస్తే వాటిని నిర్ధారించే పరీక్షలు చేయాలని తెలిపారు. రోగుల పరిస్థితి విషమిస్తే ఉన్నత వైద్యశాలలకు పంపి మెరుగైన వైద్య సేవలు అందించడానికి వైద్యశాఖ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
 
 చైతన్యంతో నివారించండి
 ఇది ఏ ఒక్కరి వల్ల నివారించే వ్యాధికాదు. ప్రజలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అందరూ ముందుకురావాలి. ఇళ్లలో పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేస్తున్నారు. వీటి నుంచి ఎడిఫై దోమలు ఉత్పత్తి అవుతున్నాయి. గత మూడు రోజుల్లో చేసిన తనిఖీల్లో స్వయంగా నేనే చూసి, స్థానికులకు చూపించాను. ప్రతి శుక్రవారం నీళ్లను నిల్వ చేసుకోకుండా డ్రైడేను పాటించండి. జ్వరం వచ్చిన వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలి. వ్యాధిపై ఎలాంటి సందేహాలున్నా 24 గంటలు పనిచేసే ఫోన్-9849902379 కాల్ సెంటర్‌కు సంప్రదించండి.
 - డాక్టర్ కోటీశ్వరి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి
 
 నివారణ చర్యలు
 డెంగీ జ్వరం నివారణకు ఇంటిలోపల, వెలుపల నీటి నిల్వలు లేకుండా చూడాలి. పనికిరాని కూలర్లు, టైర్లు, పాత్రలు, డ్రమ్ములు, పూల కుండీలు తొలగించాలి. నీటి ట్యాంక్‌కు మూతలుపెట్టాలి. జనవాసాల్లో సమష్టిగా నివారణ చర్యలు తీసుకోవాలి. దోమ తెరలు, వాడాలి. పొడుగు ప్యాంట్లు, చేదులు కనపడకుండా చొక్కాలు వేసుకోవాలి. చిన్న పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పేలా దుస్తులు వేయాలి. డెంగీ లక్షణాలు కనబడితే  సొంత చికిత్సలు చేసుకోరాదు. ఆస్ప్రిన్, బ్రూఫిన్, కాంబిప్లామ్, అనాలజిన్ లాంటి మాత్రలు తీసుకోరాదు.
 - డాక్టర్ పవన్‌కుమార్, రేగళ్లు పీహెచ్‌సీ వైదాధికారి

>
మరిన్ని వార్తలు