కరాసవలసలో ఆగని మరణాలు

29 Aug, 2018 14:25 IST|Sakshi
 వైద్య శిబిరంలో రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ 

పది రోజుల్లో ఏడుగురు మృతి

భయాందోళనలో గ్రామస్తులు

కరాసవలసలో మృత్యు ఘంటికలు మోగుతూనే ఉన్నాయి. ఓ వైపు గ్రామంలో జ్వరాల బారిన పడి మంచమెక్కిన వారి సంఖ్య పెరుగుతుండగా...మరోవైపు మృత్యు ఘంటికలూ ఆగడం లేదు. దీంతో గ్రామంలో సర్వత్రా ఆందోళన నెలకొంది. వివరాల్లోకి వెళ్తే...

సాలూరు రూరల్‌ విజయనగరం : మండలంలోని కరాసవలస గ్రామంలో మరణాలు కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన పలువురు పదుల సంఖ్యలో జ్వరాలతో మంచమెక్కుతుంటూ మరోవైపు అదే స్థాయిలో మరణాలు కూడా కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన రామజన్ని పోలమ్మ(65) పట్టణంలోని సీహెచ్‌సీలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో గడిచిన పది రోజుల వ్యవధిలో మృతి చెందిన వారి సంఖ్య ఏడుకు చేరింది. ఇప్పటికీ గ్రామంలో అనారోగ్యం బారిన పడి మంచమెక్కుతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.

మంగళవారమే సాక్షిలో మంచం పట్టిన కరాసవలస శీర్షికన కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. సోమవారం పోలమ్మ పరిస్థితి విషమంగా ఉండడం సాలూరు పట్టణంలోని సీహెచ్‌సీకి తరలించినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో మృత్యువాత పడడంతో గ్రామస్తులు మరింత ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పది రోజుల వ్యవధిలో మృతి చెందిన వారి వివరాలు పరిశీలిస్తే చింతాడ పద్మ(28) ఈ నెల 19న మృత్యువాత పడింది.  

జమ్ము గున్నమ్మ(60), చీకటి మైండ్రు(75), కె.సీతారాం(50), ప్రేమావతి(42), చీకటి లచ్చయ్య(65) కూడా మృతి చెందారు. సోమవారం అర్ధరాత్రి మృతి చెందిన పోలమ్మతో కలసి మృతుల సంఖ్య ఏడుకు చేరింది. వరుస మరణాలతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించాలని మరణాలకు అడ్డుకట్ట వేసేలా వైద్య సిబ్బంది, జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

ఎవరి కారణాలు వారివి....

గ్రామానికి చెందిన ఏడుగురు మృతికి జ్వరాలే కారణమని గ్రామస్తులు ఓ వైపు చెబుతుంటే... వైద్యాధికారులు మాత్రం జ్వరాలతో పాటు వేరే కారణాలు కూడా ఉన్నాయని పేర్కొంటున్నారు. ఇలా రకరకాల వాదనలు వినిపిస్తుండడంతో గ్రామస్తుల్లో అయోమయం నెలకొంది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి దీని లెక్కలు తేల్చితే తప్ప వీరిని భయాందోళనలు వీడేలా లేదు. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రజారోగ్యంపై అశ్రద్ధ వద్దు

సాలూరు రూరల్‌: ప్రజారోగ్యంపై అధికారులు అశ్రద్ధ వహించరాదని కలెక్టర్‌ హరిజవహర్‌ లాల్‌ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన మండలంలోని కరాసవలస గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పారిశుద్ధ్య నిర్వహణ, వైద్య శిబిరాలను తనిఖీ చేశారు. అనంతరం వైద్య శిబిరంలోని రికార్డులను పరిశీలించారు. ప్రజల ఆరోగ్యం విషయంలో పూర్తి శ్రద్ధతో పని చేయాలని, పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

గ్రామంలో రోడ్లు ఉన్నా కాలువలు లేకపోవడాన్ని గుర్తించి వెంటనే కాలువలు నిర్మించాలని, శ్మశానవాటిక దారి లేదని తెలుసుకుని ప్రతిపాదనలు పంపించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. గ్రామంలో పందుల సంచారం లేకుండా చూడాలని, జ్వరాలు తగ్గేవరకు వైద్య శిబిరాన్ని కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ ఇటీవల గ్రామంలో చనిపోయిన వారు జ్వరాలతో చనిపోలేదని, ఇతర కారణాల వల్లే మరణించారని తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు