జ్వరం.. జరభద్రం

21 Aug, 2015 02:47 IST|Sakshi

డెంగీ ప్రాణాలు తోడేస్తోంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. తీవ్రత బయటపడితే.. ఎక్కడ తమ పదవికి ఎసరువస్తుందోనని నాయకులు, అధికారులు తేలు కుట్టిన దొంగల్లాఉన్నారు. ఇక్కడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులుపక్క జిల్లాల వారనే సాకుతో సరిపెడుతున్నారు.వాస్తవానికి.. చాపకింద నీరులా వ్యాపిస్తున్నఈ మహమ్మారి జిల్లాను వణికిస్తోంది.
 
 కర్నూలు(జిల్లా పరిషత్):నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల చిన్నపిల్లల విభాగంతో పాటు మెడికల్ వార్డులో వైరల్ ఫీవర్ల సంఖ్య పెరిగింది. ఈ విభాగాలకు రోజూ వచ్చే ఓపీ కేసుల్లో సగం జ్వర పీడితులే ఉంటున్నారు. పట్టణం, గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా ఈ వ్యాధి బారిన విలవిల్లాడుతున్నారు. గత మూడు నెలల్లో జిల్లాలో 235 మంది డెంగీ లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. వీరిలో 18 మందికి డెంగీ ఉన్నట్లు నిర్ధారించారు. ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని చిన్నపిల్లల విభాగంలో 50 మంది చిన్నారులు విషజ్వరాలతో చికిత్స పొందుతున్నారు. మెడికల్ విభాగాల్లోనూ 20 మందికి పైగా జ్వరపీడితులు ఉన్నారు. నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సగానికి పైగా డెంగీ అనుమానిత రోగులు చికిత్స పొందుతున్నారు.
 
 మలేరియా మాసోత్సవం, దోమల నివారణ మాసోత్సవం పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తున్నా.. వైద్య ఆరోగ్యశాఖతో మున్సిపల్, పంచాయతీ శాఖల సమన్వయ లోపమే ఈ పరిస్థితికి కారణంగా తెలుస్తోంది. కర్నూలులోడెంగీ లక్షణాలతో చికిత్స పొందుతున్న వారిలో వైఎస్‌ఆర్ జిల్లా వాసులే అధికంగా ఉన్నారు. కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్లతో పాటు అనంతపురం, తాడిపత్రి నుంచి అధికంగా డెంగీ బాధితులు చికిత్స నిమిత్తం కర్నూలుకు వస్తున్నారు. ఆయా ఆసుపత్రుల్లో వీరికి ముందుగా ర్యాపిడ్ టెస్ట్‌లో భాగంగా ఎన్‌ఎస్ 1 యాంటిజెంట్ పరీక్ష నిర్వహిస్తారు. దీంతో పాటు సిరాలజిలో ఐజిజి, ఐజీఎం కిట్ ద్వారా డెంగీ నిర్ధారణ పరీక్ష చేస్తున్నారు. ప్రాథమికంగా డెంగీ నిర్ధారణ అయితే ఆ మేరకు లక్షణాలను బట్టి చికిత్స నిర్వహిస్తున్నారు.
 
 అధికంగా పాజిటివ్ కేసులు
 కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజి విభాగంలో డెంగీ నిర్ధారణకు ఎలీసా టెస్ట్ నిర్వహిస్తారు. ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వెలెన్స్ ప్రాజెక్టు(ఐడీఎస్‌పీ) ద్వారా కేంద్ర ప్రభుత్వం డెంగీ నిర్ధారణ ఎలీసా కిట్లను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజి(పూణే) నుంచి పంపిణీ చేస్తోంది. వైద్య ఆరోగ్యశాఖాధికారులు సైతం ఇక్కడ పరీక్ష చేస్తేనే సరైన ఫలితంగా నమ్ముతారు. జిల్లాతో పాటు పక్కనున్న కడప, అనంతపురం జిల్లాల నుంచి సైతం మైక్రోబయాలజి విభాగానికి డెంగీ నిర్ధారణకు రక్త నమూనాలను పంపుతున్నారు. గత యేడాది ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 781 డెంగీ అనుమానిత కేసులకు పరీక్షలు నిర్వహించగా.. 189 డెంగీ పాజిటివ్‌గా నిర్ధారించారు. ఈ యేడాది జనవరి 20న 92 మంది రక్తపరీక్షలు నిర్వహించగా నలుగురికి, ఏప్రిల్ 29న 92 మందికి గాను 14 మందికి, మే ఒకటిన 92 మందికి గాను ఏడుగురికి, ఈ నెల 6న 92 మందికి గాను 29 మందికి డెంగీ పాజిటివ్ వచ్చింది.
 
 92 మంది పోగైతేనే ఎలీసా టెస్ట్
 డెంగీ నిర్ధారణలో కీలకంగా భావిస్తున్న ఎలీసా టెస్ట్ ఒకరో ఇద్దరో వెళితే చేయని పరిస్థితి. మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజీలో ఈ పరీక్ష చేయాలంటే 92 మంది రోగులు పోగవ్వాలి. డెంగీ నిర్ధారణ కిట్ తెరిస్తే ఒకేసారి పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఒక కిట్‌తో 92 మందికి ఒకేసారి పరీక్ష చేసే వీలుంది. అందుకే 92 మంది రోగుల శ్యాంపిల్స్ వచ్చే వరకు ఇక్కడ డెంగీ పరీక్ష నిర్వహించడం లేదు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే 20 నుంచి 60 కేసులకూ పరీక్ష నిర్వహిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు