పోస్టల్‌ బ్యాలెట్‌ల తిరస్కరణ రాజ్యాంగ విరుద్ధం

2 Jul, 2019 05:24 IST|Sakshi

సీరియల్‌ నెంబర్‌ లేని వాటిని తిరస్కరించాలని ఏ నిబంధనల్లోనూ లేదు

గుంటూరు పార్లమెంటరీ పరిధిలో 9,782 పోస్టల్‌ బ్యాలెట్‌ల తిరస్కరణ

హైకోర్టులో పలువురు ఉద్యోగుల పిటిషన్‌

సాక్షి, అమరావతి: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున పోస్టల్‌ బ్యాలెట్‌లను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ పలువురు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఉంచే ఎన్వలప్‌ కవర్‌ (ఫామ్‌ 13బీ)పై సీరియల్‌ నెంబర్‌ వేయలేదన్న కారణంతో తిరస్కరించిన 9,782 పోస్టల్‌ బ్యాలెట్‌లను పరిగణనలోకి తీసుకునేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరుతూ వారు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచడంతోపాటు ఈ వ్యాజ్యానికి విచారణార్హత ఉందో, లేదో తెలియచేయాలని ఎన్నికల సంఘాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

ఆ బాధ్యత ఎన్నికల అధికారులదే..
అంతకుముందు పిటిషనర్ల తరఫు న్యాయవాది వీఆర్‌ఎన్‌ ప్రశాంత్‌ వాదనలు వినిపిస్తూ.. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు ఉందన్నారు. దీని ప్రకారం.. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల సంఘం అధికారులు పిటిషనర్లతో కలిపి మొత్తం 15,289 పోస్టల్‌ బ్యాలెట్‌లను జారీ చేశారని తెలిపారు. ఇదే సమయంలో ఫామ్‌లు 13ఏ, బీ, సీ, డీలు ఇచ్చారని, వీటి ద్వారా పోస్టల్‌ బ్యాలెట్‌ను ఎన్నికల సంఘం అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అధికారులు తమకు అందిన పోస్టల్‌ బ్యాలెట్లలో 9,782 ఓట్లను తిరస్కరించారన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఉంచే ఎన్వలప్‌ కవర్‌పై సీరియల్‌ నెంబర్‌ వేయలేదన్న కారణంతో వీటిని తిరస్కరించారని, వాస్తవానికి ఈ సీరియల్‌ నెంబర్‌ వేయాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులదే తప్ప, ఓటర్లది కాదన్నారు.

సీరియల్‌ నెంబర్‌ వేయని పోస్టల్‌ బ్యాలెట్‌లను తిరస్కరించాలని ఏ నిబంధన కూడా చెప్పడం లేదన్నారు. అయినా కూడా ఏకంగా 9,782 పోస్టల్‌ బ్యాలెట్‌లను తిరస్కరించారని, ఇది ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు. అంతేకాకుండా పిటిషనర్ల ఓటు హక్కును సైతం హరించినట్లయిందని తెలిపారు. రిటర్నింగ్‌ అధికారుల హ్యాండ్‌ బుక్‌లో కూడా ఈ విషయానికి సంబంధించి ఎటువంటి నిబంధనలు లేవన్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ తిరస్కరణకు సీరియల్‌ నెంబర్‌ వేయకపోవడం ఎంత మాత్రం సహేతుక కారణం కాజాలదన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పూర్తి వివరాలను తమ ముందుంచడంతోపాటు, ఈ వ్యాజ్యం విచారణార్హత గురించి కూడా తెలియచేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు