అవినీతి డీఈఓను జైలుకు పంపాలి : విఠపు

19 Apr, 2014 02:40 IST|Sakshi

నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: అవినీతిపరుడైన డీఈఓ మువ్వా రామలింగాన్ని ఉద్యోగం నుంచి తొలగించడంతో పాటు వెంటనే జైలుకు పంపాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. డీఈఓ అక్రమాలకు వ్య తిరేకంగా ఉపాధ్యాయులు టెన్త్ స్పాట్ జరుగుతున్న దర్గామిట్టలోని సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాల వద్దకు శుక్రవారం ఉదయం 8 గంటలకే  చేరుకుని యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
 
 విద్యాశాఖలో భారీ కుంభకోణాలకు కారకుడైన డీఈఓకు స్పాట్ నిర్వహించే అర్హత లేదంటూ నినాదాలతో హోరెత్తించారు. రామలింగాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని ధర్నాకు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. ఆ ప్రాంతాన్ని వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరించినా ఉపాధ్యాయులు ఖాతరు చేయకుండా నిరసన కొనసాగించారు. దీంతో సిటీ డీఎస్పీ వెంకటనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిం చారు. ఈ క్రమంలో పోలీసులు, ఉపాధ్యాయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఉపాధ్యాయులను బలవంతంగా అరెస్ట్ చేసి ఒకటో నగర పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై వదిలిపెట్టారు.
 
 విద్యాశాఖకు చీడపురుగు
 ఉపాధ్యాయుల అరెస్ట్ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ మువ్వా రామలింగాన్ని విద్యాశాఖలో చీడపురుగుగా అభివర్ణించారు. పనిచేసిన ప్రతి జిల్లాలోనూ ఉపాధ్యాయులు ఆయనను తన్ని తరిమేశారన్నారు. ఆయనతో వేగలేక గతంలో చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేశారని, గుం టూరు జిల్లాలో ఏసీబీ కేసులో జైలుకెళ్లాడని, కర్నూలులో ఉపాధ్యాయులు తరి మితరిమి కొట్టినా సిగ్గు రాలేదన్నారు. నెల్లూరులో కార్పొరేట్ విద్యాసంస్థలకు తొత్తుగా మారి పదో తరగతి పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడ్డాడని ఆరోపించారు.  గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రైవేటు పాఠశాలల నుంచి లక్షలకు లక్షలు గుంజుతున్నాడన్నారు. అడిగినంత ఇవ్వకపోతే వేధించడం ఆయనకు పరిపాటిగా మారిందన్నారు.
 
 
 ఆరు నెలలుగా సస్పెన్షన్‌లో ఉన్న శేషాద్రివాసుకు పరీక్షల విధులు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. మహిళా టీచర్లతో వ్యంగ్యంగా మాట్లాడే ఆయనను త్వరలో వారే బుద్ధిచెబుతారన్నారు.
 
 ఈ ప్రబుద్ధుడిని సస్పెండ్ చేసేందుకు గతం లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రెండుమార్లు ఫైలు నడిపారని, అయితే అప్పటి ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కాపాడారన్నారు. ఈ విషయాన్ని ఆ అధికారే స్వయంగా తనకు తెలిపారని విఠపు వివరించారు. ఏసీబీ కేసు కారణంగా ఉద్యోగం పోతుందని భయపడి రాజకీయ పలుకుబడి, ధనబలంతో కేసును శాఖాపరమైన విచారణకు మార్పించుకున్నాడని తెలిపారు. ఇప్పుడు కాపాడేదానికి కాంగ్రెస్ నాయకులు, ఆనం సోదరులు లేరనే విషయాన్ని డీఈఓ గుర్తించుకోవాలన్నారు.
 
 గవర్నర్ ఆర్డర్‌తో పచ్చి వెలక్కాయ
 ఏసీబీ కేసుపై మళ్లీ విచారణ జరిపించాలని గవర్నర్ ఉత్తర్వులివ్వడంతో డీఈఓ గొంతులో పచ్చివెలగకాయ పడినట్టయిందని విఠపు ఎద్దేవా చేశారు. ఇక ఆయన శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయమన్నారు. ఒక వేళ తమకు న్యాయం జరగకపోతే చట్టాన్ని ధిక్కరించేదానికి సిద్ధంగా ఉండామన్నారు.
 
 వేసవి సెలవులంతా డీఈఓకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటామన్నారు. ఇప్పటివరకు ఉపాధ్యాయులను వేధించే మువ్వా ఇప్పుడు విలేకరులపై దాడులు మొదలుపెట్టారని, ఆయన ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే పోలీసులపైనా దాడి చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. డీఈఓకు తొత్తులుగా మారిన శేషాద్రివాసులాంటి ఒకరిద్దరు ఇకనైనా మారాలని హితవుపలికారు. లేదంటే డీఈఓకు పట్టిన గతే పడుతుందన్నారు. నిరసన కార్యక్రమానికి ఏపీటీఎఫ్(1938) కార్యదర్శి వెంకటేశ్వరరావు మ ద్దతు తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.బాబురెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శ్రీహరి, పరంధామయ్య, సుబ్బారావు, ఖాదర్‌మస్తాన్, రమ, టి.స్వర్ణలత పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు