అంచనాలకు మించి పంటల సాగు

3 Nov, 2019 03:31 IST|Sakshi

రబీలో ఈసారి ఆశించిన దాని కన్నా అధికంగా పంటల సాగు

వరిసాగు 6.98 లక్షల హెక్టార్ల నుంచి 7.40 లక్షల

హెక్టార్లకు పెరగవచ్చని వ్యవసాయ శాఖ అంచనా

కలిసొచ్చిన వైఎస్సార్‌ రైతుభరోసా సాయం

పుష్కలంగా వర్షాలతో జలాశయాలన్నీ కళకళ

సాగర్‌ కుడి కాల్వ కింద ఇప్పటికే వరినాట్లు ముమ్మరం..

సాక్షి, అమరావతి: ఈ ఏడాది రబీ సీజన్‌ ఆశించిన దానికన్నా గొప్పగా ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. సుదీర్ఘ విరామం తర్వాత ముమ్మరంగా వర్షాలు కురుస్తుండడం.. వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, రిజర్వాయర్లన్నీ పొంగిపొర్లుతుండడం.. సాగర్‌ కుడికాల్వకు ఇప్పటికే నీళ్లు వదలడం వంటివన్నీ ఇందుకు శుభసూచనలేనని అటు రైతులు ఇటు వ్యవసాయాధికారులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు మిగిల్చిన స్వల్ప లోటును ఈశాన్య రుతుపవనాలు అధిగమించడంతో పాటు ఇప్పటి వరకు 1.2% మిగులు వర్షాలు కురిసినట్లు నమోదైంది. ఇటీవలి కాలంలో ఇదే పెద్ద రికార్డు. ఫలితంగా ఖరీఫ్‌లో సాగులోకి రాని విస్తీర్ణాన్ని ప్రస్తుత రబీ భర్తీచేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

నీటి సౌకర్యం బాగా ఉండడంతో ప్రత్యేకించి దాళ్వా వరిసాగు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం 22.77లక్షల హెక్టార్లు కాగా.. ఈసారి లక్ష్యం 25.84 లక్షల హెక్టార్లు. ఇందులో 7.40 లక్షల హెక్టార్లలో వరి, 3.96 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న, చిరుధాన్యాలు.. 11.53 లక్షల హెక్టార్లలో పప్పు ధాన్యాలు, 1.63 లక్షల హెక్టార్లలో నూనె గింజలు, పొగాకు 91 వేల హెక్టార్లు, మిర్చి 23 వేల హెక్టార్లు, ఉల్లి 800 హెక్టార్లు, కొత్తిమీర 700 హెక్టార్లు, 300 హెక్టార్లలో పత్తి సాగుచేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. కాగా, సాధారణంగా రబీ సీజన్‌లో వరి సాగు 6.98లక్షల హెక్టార్లకు మించదు. కానీ, ఈసారి 7.40లక్షల హెక్టార్లలలో సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఈ ఏడాది రిజర్వాయర్లనీ నిండుగా తొణికలాడుతుండడమే ఇందుకు కారణం. 

ఎట్టకేలకు సాగర్‌ కుడికాల్వకు జలకళ
నాలుగైదేళ్లుగా నాగార్జునసాగర్‌ కుడి కాల్వ కింద నాట్లు పడలేదు. తాగునీటికి కూడా కటకటలాడాల్సిన దుస్థితి. అందుకు భిన్నంగా ఈసారి సెప్టెంబర్‌ నుంచే కాలువకు నీళ్లు వదిలారు. ఫలితంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు ముందుగానే నార్లు పోసుకుని ప్రస్తుతం ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. అలాగే, గుండ్లకమ్మ రిజర్వాయర్‌ కింద కూడా ఈసారి వరి వేస్తున్నారు. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప, అనంతపురం, కర్నూలు, కృష్ణా జిల్లాలలో నాట్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఆయాచోట్ల 12వేల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ఉభయ గోదావరి జిల్లాలలో పునాస పంటగా పిలిచే ఖరీఫ్‌ వరి కోతలు పూర్తయిన తర్వాత నాట్లు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఈ జిల్లాలలో వరి పొట్టదశ దాటి గింజ పోసుకుంటోంది. ఈ నెలాఖరు నుంచి కోతలు మొదలవుతాయి. మరోవైపు.. ప్రస్తుత రబీకి 14,180 క్వింటాళ్ల వరి వంగడాలను వ్యవసాయ శాఖ సబ్సిడీపై పంపిణీ చేసింది. 

ఆశాజనకంగా ఖరీఫ్‌ వరి
ఇదిలా ఉంటే.. ఖరీఫ్‌లో సాగవుతున్న వరి పరిస్థితి ఆశాజనకంగానే ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 15.19 లక్షల హెక్టార్లయితే 14.67 లక్షల హెక్టార్లలో నాట్లు పడ్డాయి. ఇటీవలి వర్షాలు, వరదలకు రాష్ట్రంలో అక్కడక్కడా కొంత ముంపునకు గురైనా ఇప్పుడు అంతా తేరుకుని పరిస్థితి సజావుగా ఉందని తెలిపారు. పలు ప్రాంతాలలో పంట గింజ పోసుకుంటోందని వివరించారు. 

కలిసొచ్చిన వైఎస్సార్‌ రైతుభరోసా
పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఈ రబీ సీజన్‌ నుంచి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వైఎస్సార్‌ రైతుభరోసా పథకం అన్నదాతలకు కలిసొచ్చింది. చిన్న, సన్నకారు, మధ్య తరహా, కౌలు రైతుల మొదలు పెద్ద రైతుల వరకు.. అందరికీ అమలవుతున్న ఈ పెట్టుబడి సాయం.. రైతులు బ్యాంకులను, ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించకుండా చేసింది. రైతుల ఖాతాలకే నేరుగా నగదు జమ కావడం.. ఆ మొత్తాన్ని వేరే అప్పుల కోసం బ్యాంకులు సర్దుబాటు చేసుకోకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలివ్వడంతో రైతులు ఆ మొత్తాన్ని సాగుకు వినియోగించుకోగలుగుతున్నారు.  

మరిన్ని వార్తలు