రబీకి రెడీ

26 Sep, 2019 04:03 IST|Sakshi

సాగు లక్ష్యం 22.77 లక్షల హెక్టార్లు

విత్తనాలను సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ

సాక్షి, అమరావతి: వచ్చే నెల నుంచి ప్రారంభమయ్యే రబీ సాగు కోసం వ్యవసాయ శాఖ సన్నద్ధమైంది. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు, సూక్ష్మ నీటి పారుదల సదుపాయాలు సహా అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 22,77,407 హెక్టార్లలో రబీ పంటలు సాగు చేయించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ చెప్పారు. ఇందులో ఆహార పంటల సాగు 19,91,326 హెక్టార్లుగా ఉండనుంది.

పెరిగిన అంచనాలు: గత ఏడాది కనీసం 25 లక్షల హెక్టార్లలో రబీ సాగు లక్ష్యంగా నిర్దేశించగా..  22 లక్షల హెక్టార్లకు మించలేదు. ఈ ఏడాది రబీకి అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. నైరుతి రుతు పవనాలు, అల్పపీడనాల ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రిజర్వాయర్లు నిండుకుండల్లా మారాయి. ఈ పరిస్థితుల్లో సాగుపై అంచనాలు పెరిగాయి. ఈసారి అన్ని రిజర్వాయర్ల కింద పెద్దఎత్తున వరి సాగు చేయవచ్చని భావిస్తున్నారు. నాగార్జున సాగర్‌ రిజర్వాయర్‌ కుడి కాల్వకు నాలుగేళ్ల తరువాత పూర్తిస్థాయిలో నీరు విడుదల చేస్తుండటంతో దాని పరిధిలోని 11 లక్షల ఎకరాలు పూర్తిగా సాగులోకి రానున్నాయి. ఇప్పటికే కుడి కాల్వ కింద గల ప్రధాన కాలువలన్నిటికీ నీరు వదిలారు. రైతులు నార్లు కూడా పోసుకున్నారు. వచ్చే నెల రెండు వారం నుంచే నాట్లు పడనున్నాయి.

విత్తన ప్రణాళిక ఖరారు
ఖరీఫ్‌ అనుభవాలను దృష్టిలో వ్యవసాయాధికారులు వచ్చే రబీకి ముందే విత్తన ప్రణాళిక ఖరారు చేశారు. ఆయా జిల్లాలకు అవసరమైన విత్తనాలను ముందే పంపించారు. 14,180 క్వింటాళ్ల వరి, 29,438 క్వింటాళ్ల వేరుశనగ, 36,250 క్వింటాళ్ల పప్పు శనగ, 9,545 క్వింటాళ్ల మినుము, 3,550 క్వింటాళ్ల పెసలు, 140 క్వింటాళ్ల కందులు, 6,940 క్వింటాళ్ల మొక్కజొన్న, 150 క్వింటాళ్ల జొన్న విత్తనాలను సిద్ధంగా ఉంచారు. వీటితో పాటు 647 క్వింటాళ్ల రాగులు, 450 క్వింటాళ్ల నువ్వులు, 105 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు, 732 క్వింటాళ్ల ఉలవలు, 2,225 క్వింటాళ్ల రాజ్మా, 600 క్వింటాళ్ల ధనియాలు, పిల్లిపెసర, జనుము తదితర విత్తనాలను కూడా సిద్ధం చేశారు. వీటిని అర్హులైన రైతులకు సబ్సిడీపై సరఫరా చేస్తారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు