చరిత్రలో మరో ఘట్టం.. ఫలించిన ఎంపీ ప్రయత్నాలు

23 Feb, 2020 12:04 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ విమానయాన చరిత్రలో మరో గొప్ప ఘట్టం మొదలుకాబోతోంది. విశాఖ నుంచి కార్గో విమానం రాకపోకలు సాగించడానికి ఎట్టకేలకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. విశాఖ నుంచి ఈనెల 25 నాడు తొలిసారిగా కార్గో విమానం నడపడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిసారిగా విశాఖ నుంచి కార్గో విమానాలు చెన్నై, కోల్‌కొతా, సూరత్‌ తదితర ప్రాంతాలకు నడపడానికి స్పైస్‌ జెట్‌ సంసిద్ధత వ్యక్తం చేసింది. మరోవైపు ఆ సంస్థ కార్గో విమానాలు కొనసాగించడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది.  ముందుగా అనుకున్న ప్రకారం ఈనెల 15 నుంచి కార్గో విమానాలు విశాఖ నుంచి వివిధ ప్రాంతాలకు నడవవలసి ఉంది. కాని రక్షణ శాఖ మోకాలడ్డడంతో కార్గో విమాన సర్వీసుల ప్రతిపాదనకు ఆటంకం ఎదురైంది.

విశాఖ నుంచి కార్గో విమాన సర్వీసులు ప్రారంభం కావాలని కొంతమంది వ్యాపారులు ఎప్పటినుంచో కోరుతున్నారు. దీనిపై ఆంధ్రప్రదేశ్‌  విమాన ప్రయాణికుల సంఘం వివిధ విమాన సంస్థల ప్రతినిధులతో చర్చించి ఒప్పించింది. అందులో భాగంగా ఈనెల 15 నుంచి స్పైస్‌ జెట్‌ ఆధ్వర్యంలో కార్గో విమానాల సర్వీసుల నిర్వహణకు ఏర్పాట్లు చేసింది. అయితే విశాఖలోని రక్షణ శాఖ అధికారుల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీంతో కార్గో విమాన సర్వీసుకు బ్రేక్‌ పడింది. దాంతో కార్గో సర్వీసుల నిర్వహణపై స్పైస్‌ జెట్‌ సంస్థ రక్షణశాఖ అధికారులకు లేఖ లేఖ రాసింది. స్పైస్‌ జెట్‌ కోరిన సమయాలను కేటాయించలేమని రక్షణ శాఖ అధికారులు స్పైస్‌ జెట్‌కు లేఖ రాసినట్టు విమాన ప్రయాణికుల సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 21న “సాక్షి’ పత్రికలో కార్గో సర్వీసుల ప్రతిపాదన నిలిచిపోయినట్టు వార్త వచ్చింది. దాంతో సమస్యను సంఘ ప్రతినిధులు కొందరు విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ దృష్టికి తీసుకొని వెళ్లారు.
  
కల నిజమాయెగా.. 
ప్రస్తుతం కార్గో విమానాలు లేక వ్యాపారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు ,రైల్వే రవాణా ద్వారా సరకులు నడుపుతున్నారు. కార్గో విమానాల కోసం ఫార్మాకంపెనీల దృష్టీ కేంద్రీకృతమైంది. కార్గో విమానాల రాకపోకల వల్ల ఆదాయం పెరుగుతుందని, దేశంలో ఇతర ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి సరకులు విశాఖకు తరలివచ్చే వీలుందన్న వాస్తవం కనిపిస్తోంది. విదేశీ మారక ద్రవ్యం కూడ వచ్చేఅవకాశం ఉందని, కార్గో విమానాల వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. విశాఖ కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న నేపథ్యంలో ఇలాంటి కార్గో విమానాలు రావాల్సిన అవసరం వుందని చెబుతున్నారు.. కాని ప్రయాణికుల సంఘం ప్రతినిధులు కె.కుమార్‌ రాజా, డి.ఎస్‌.వర్మ, ఒ.నరేష్‌కుమార్‌ పట్టువదలని విక్రమార్కుడి స్పూర్తితో అంతా కృషి చేశారు. ఈ విమానం నడపడానికి సహకారం అందించిన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు ఇతర విమాన సంస్థలకు నరేష్‌కుమార్‌ కృతజ్ఙతలు తెలిపారు.
 
ఫలించిన ఎంపీ ప్రయత్నం 
విశాఖ నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు కార్గో విమానాలు నడపాలని విశాఖ ఎంపీగా ఎన్నికైన తర్వాత ఎంవివి సత్యనారాయణ కేంద్ర రక్షణ శాఖ మంత్రికి గతంలో లేఖ రాశారు. అనంతరం కేంద్రమంత్రులను ఆయన కలిసి విమానాల కోసం చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖ కేంద్రంగా కార్యనిర్వహక రాజధాని ఏర్పాట్లు చేయడానికి పలు చర్యలు చేపట్టిందని, అలాగే దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఎయిర్‌ ట్రాఫిక్‌ 50 శాతం మేర పెరిగే అవకాశం ఉందని తెలిపారు. నిర్దేశించిన సమయాల్లో తప్ప ఇతర సమయాల్లో విమానాలు రాకపోకలకు రక్షణ శాఖ అభ్యంతరం చెబుతుందని, దీనివల్ల అనేక విమాన సంస్ధలు సర్వీసులు నడపడానికి ఆసక్తి చూపడం లేదని ఎంపి లేఖలో పేర్కొన్నారు.  సమాంతర టాక్సీ ట్రాక్‌ నిర్మించడానికి చర్యలు తీసుకోవాలని,అలాగే కొత్తగా నిర్మించిన ఎన్‌5 టాక్సీ ట్రాక్‌ను అందుబాటులోకి తేవాలనికోరారు.  

ఇవీ వేళలు 
కార్గో విమానాలు విశాఖ నుంచి దేశంలో ముఖ్యమైన పట్టాణాలకు నడుపుతున్నారు. చెన్నై, కోల్‌కతా, సూరత్‌ తదితర ప్రాంతాలకు ఈనెల 25 నుంచి నడుపుతున్నారు. రోజు తప్పించి రోజు ఈ విమానాలు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 11.50 గంటలకు విశాఖ వచ్చే విమానం, విశాఖ నుంచి మధ్యాహ్నం 1.10 గంటలకు బయలు దేరుతుంది. చెన్నై–వైజాగ్‌– కోల్‌కతా ఒక రూటు, చెన్నై– విశాఖ–సూరత్‌కు విమానాలు నడుపుతున్నట్టు సంఘం ప్రతినిధి నరేష్‌కుమార్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు