మరో నాలుగు రోజులు నిప్పులే!

25 May, 2020 02:44 IST|Sakshi
ఆదివారం విజయవాడలోని భవానీపురంలో మండుటెండలో కుండలు అమ్ముతున్న ఓ మహిళ

అప్రమత్తంగా ఉండాలన్న విపత్తు నిర్వహణ శాఖ

నేటి నుంచి ‘రోహిణి’ 

నేటి నుంచి రోహిణి కార్తె ప్రవేశిస్తున్న తరుణంలో వడగాడ్పుల ముప్పు పొంచి ఉన్నందున నాలుగు రోజుల పాటు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 28 వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ప్రజల్ని అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులకు సూచించింది. గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో 47.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

సాక్షి, అమరావతి: నేటి నుంచి రోహిణి కార్తె ప్రవేశిస్తున్న తరుణంలో వడగాడ్పుల ముప్పు పొంచి ఉన్నందున నాలుగు రోజుల పాటు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖ అన్ని జిల్లాల అధికారులకు సూచించింది. ‘రాబోయే నాలుగు రోజులే కాదు. నైరుతి రుతు పవనాలు వచ్చే వరకూ చాలా రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే’ అని వాతావరణ నిపుణులు సూచించారు. ఆదివారం గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో నిప్పుల కొలిమిని తలపిస్తూ గరిష్ట ఉష్ణోగ్రత 47.3 డిగ్రీలు నమోదైంది.   

3 రోజులు ఉష్ణోగ్రతలు ఇలా.. 
► మే 25న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల 44 నుంచి 46 డిగ్రీలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. 
► మే 26న విజయనగరంతోపాటు దక్షిణ కోస్తా జిల్లాలు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీలు, శ్రీకాకుళం, విశాఖ
పట్నం, చిత్తూరు జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. 
► మే 27న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా 44 నుంచి 45 డిగ్రీలు, ఉత్తరాంధ్రలో 38 నుంచి 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. 
► రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. 
► ఛత్తీస్‌గఢ్‌ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.

వడదెబ్బ లక్షణాలు 
► తలనొప్పి, తల తిరిగినట్లు అనిపించడం 
► తీవ్రమైన జ్వరం 
► ఒళ్లంతా చెమటతో తడిసిపోవడం 
► మూర్ఛ (ఫిట్స్‌)తో గిలగిలా కొట్టుకోవడం 
► కొద్దిగా లేదా పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లడం. 

వడదెబ్బకు చికిత్స 
► నీడ ఉన్న చల్లని ప్రాంతానికి చేరవేయాలి. 
► శరీరమంతా చల్లని తడి వస్త్రంతో తుడవాలి.   
► శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారెన్‌ హీట్‌ కంటే దిగువకు వచ్చే వరకూ చల్లటి వస్త్రంతో తుడవాలి.  
► బాగా గాలి అందేలా చూడాలి.  
► సాధారణ స్థితికి చేరుకోని పక్షంలో వెంటనే ఆస్పత్రికి తరలించాలి. 

మరిన్ని వార్తలు