జోరువానల్లోనూ విద్యుత్‌ వెలుగులు

18 Jul, 2020 04:35 IST|Sakshi

క్షేత్రస్థాయి అధికారులతో ఇంధనశాఖ టెలికాన్ఫరెన్స్‌

సాక్షి, అమరావతి: వర్షాకాలంలోనూ ఎలాంటి అంతరాయాలు లేకుండా కరెంట్‌ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి ఆదేశించారు. విద్యుత్‌ లైన్లు, టవర్లు, సబ్‌ స్టేషన్లను తరచూ పరిశీలించాలని సూచించారు. క్షేత్రస్థాయి విద్యుత్తు అధికారులతో శ్రీకాంత్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలను విద్యుత్‌శాఖ శుక్రవారం మీడియాకు వెల్లడించింది. 

ఏఈలు అప్రమత్తం కావాలి...
► గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్‌ సరఫరాకు ఇబ్బందులు తలెత్తే ప్రాంతాల్లో అసిస్టెంట్‌ ఇంజనీర్లు తక్షణమే అప్రమత్తం కావాలి. ట్రాన్స్‌ఫార్మర్లు, స్తంభాలు, కండక్టర్లు తెప్పించుకోవాలి. ఏఈల పనితీరును ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. 
► ఉత్తరాంధ్రలో వాగులు వంకలు ఉప్పొంగే అవకాశం ఉన్నందున లైన్‌ మెటీరియల్స్, టవర్‌ భాగాలు,  కండక్టర్లు, ఇన్సులేటర్లను అదనంగా సమకూరుస్తున్నారు. 
► డీజిల్‌ జనరేటర్లు, శాటిలైట్‌ ఫోన్లు, వాకీటాకీలు సిద్ధంగా ఉంచారు. 
► ప్రతి సర్కిల్‌లోనూ కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 

వ్యవసాయ విద్యుత్‌కు అత్యధిక ప్రాధాన్యం: మంత్రి బాలినేని
పొలం పనులు ప్రారంభమైన నేపథ్యంలో వ్యవసాయ విద్యుత్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి సరఫరాలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చూడాలని విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. రబీ నాటికి నూటికి నూరుశాతం ఫీడర్ల ద్వారా 9 గంటల విద్యుత్‌ అందించాలన్నారు. ఈ దిశగా జరుగుతున్న చర్యలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ శాఖ తీసుకుంటున్న చర్యలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. 

మరిన్ని వార్తలు