బోదను మరిచారా?

22 Jan, 2014 01:56 IST|Sakshi

రాయవరం, న్యూస్‌లైన్ : తాము చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ శాపగ్రస్థులుగా మారుతున్నారు ఫైలేరియా వ్యాధి గ్రస్థులు. దోమకాటుతో సోకే ఈ వ్యాధితో శరీరంలో భాగాలు బాగా వాచిపోతాయి. ఆభాగంలో బరువు అధికంగా ఉంటుంది. దాంతో కురూపులవుతుంటారు. ఈ వ్యాధి నివారణకు ప్రభుత్వం ప్రతీ ఏటా నవంబర్ 11న ఫైలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

 ఆ సందర్భంగా డీఈసీ మాత్రల పంపిణీని నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటి వరకు 13 విడతలుగా ఫైలేరియా దినోత్సవాన్ని నిర్వహించిన జిల్లా యంత్రాంగం గతేడాది 14వ విడత ఫైలేరియా దినోత్సవాన్ని నిర్వహించలేదు. బోదవ్యాధిని నిర్లక్ష్యం చేస్తున్నారనడానికి ఇదే ప్రత్యక్ష తార్కాణం.

 ఫైలేరియా వస్తుందిలా...
 ప్రపంచ వ్యాప్తంగా దీన్ని లింఫాటిక్, సబ్ క్యూటినస్, సీరస్ క్యావిటీ ఫైలేరియాలుగా విభజించగా మన దేశంలో  లింఫాటిక్ ఫైలేరియా వ్యాధిగ్రస్థులు మాత్రమే ఉన్నారు. దీనినే బ్రాంకఫ్టిన్ ఫైలేరియగా కూడా పిలుస్తారు. క్యూలెక్స్ ఆడదోమ కుట్టడం వలన ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది.

 దోమల నియంత్రణ ఏదీ..
     దోమల నిర్మూలన కేంద్రాలు రామచంద్రపురం, మండపేట, అమలాపురం, పెద్దాపురం, పిఠాపురం మున్సిపాల్టీల్లో ఒక్కొక్కటి, రాజమండ్రిలో రెండు, కాకినాడలో మూడు ఉన్నాయి.
     పల్లెల్లో దోమల నిర్మూలన కేంద్రాలు లేకపోవడంతో దోమలు దారుణంగా ప్రబలుతున్నాయి.

  ఫైలేరియా శాఖకు సిబ్బంది కొరత
ఫైలేరియా శాఖ సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. పట్టణాల్లో దోమల నియంత్రణకు ఎబేట్ అనే దోమల మందును స్ప్రేచేసేందుకు జిల్లా వ్యాప్తంగా ఫీల్డ్ స్టాఫ్ 96మంది ఉండాల్సి ఉండగా కేవలం 36మంది మాత్రమే ఉన్నారు.

     రామచంద్రపురం, అమలాపురం యూనిట్లలో రెండేళ్లుగా ఫీల్డ్ వర్కర్లు ఒక్కరూ లేరు.
     హెల్త్ ఇనస్పెక్టర్లు పూర్తిస్థాయిలో ఉన్నా సుపీరియర్ ఫీల్డ్ వర్కర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇన్‌సెక్ట్ కలెక్టర్లు తగినంతమంది లేరు.  

 28 నుంచి 30 వరకు డీఈసీ మాత్రల పంపిణీ
   బోధ వ్యాధి నియంత్రణలో భాగంగా జిల్లాలో ఈనెల 28 నుంచి 30వ తేదీవరకు మూడురోజులపాటు 1.20 కోట్ల డీఈసీ మాత్రల పంపిణీకి చర్యలు చేపట్టినట్టు జిల్లా ఫైలేరియా అధికారిణి డాక్టర్ జక్కంశెట్టి శశికళ తెలిపారు. రెండేళ్లు పైబడి, 65 సంవత్సరాల లోపు ఉన్న 50 లక్షల జనాభాకు ఈ మాత్రలు అందజేస్తామన్నారు.

అదేవిధంగా 54 లక్షల ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నామన్నారు. ఆ మూడురోజుల్లో ఆరోగ్య కార్యకర్తలు, అంగన్‌వాడీ వర్కర్లు, ఆశ కార్యకర్తలు, పారామెడికల్ సిబ్బంది డీఈసీ మాత్రల పంణీలో పాల్గొంటారన్నారు. ఫైలేరియా శాఖలో సిబ్బంది కొరత ఉన్న విషయం వాస్తవమేనన్నారు.
 
 జిల్లాలో ఫైలేరియా తీరు
     1972లో మన జిల్లాలో 11 శాతం మంది ఫైలేరియా వ్యాధి క్రిమి కలిగిన వారు ఉండేవారు.
     కేంద్ర ప్రభుత్వం జాతీయ బోధ వ్యాధి నివారణను పైలట్ ప్రాజెక్టుగా మన జిల్లాలో 1999 నవంబర్ 11న ప్రారంభించింది.

     1999లో వ్యాధికారక క్రిమి రేటు జిల్లాలో 4 శాతం ఉండేది. 2010 నాటికి 0.14 శాతానికి తగ్గినట్టు జిల్లా ఫైలేరియా అధికారిణి డాక్టర్ శశికళ తెలిపారు.
     {పస్తుతం జిల్లాలో 15,533మంది బోధ వ్యాధిగ్రస్థులు ఉన్నట్టు సీనియర్ ఎంటమాలజిస్ట్ ప్రసాద్ తెలిపారు.

     రాయవరం, మాచవరం, రామచంద్రపురం, మండపేట, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, నేలటూరు, అంగర, పిఠాపురం ప్రాంతాలలో ఈ వ్యాధిగ్రస్థులు ఎక్కువగా ఉన్నారు.  1999 నుంచి 2012 వరకు ప్రతీ ఏటా ఫైలేరియా దినోత్సవం జరిగింది.

మరిన్ని వార్తలు