పై-లీన్.. టెన్షన్

12 Oct, 2013 03:30 IST|Sakshi

నెల్లూరు (కలెక్టరేట్), న్యూస్‌లైన్: బంగాళఖాతం ఏర్పడిన పెనుతుపాన్ ైపై-లీన్ తీరంవైపు దూసుకొస్తోంది. శ్రీకాకుళం జిల్లాలోని కళింగపట్నం, ఒడిశాలోని పారా దీప్ మధ్య శనివారం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి లోపు తుపాన్ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.  జిల్లాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ క్రమంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాన్ తీరం దాటే సమయంలో 200 నుంచి 225 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో నష్టతీవ్రతను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
 
 ఇప్పటికే కృష్ణపట్నం పోర్టులో మూడో ప్రమాదసూచిక ఎగురవేశారు. జిల్లాలో తుపాన్ తీవ్రత ఎక్కువగా ఉండే మండలాల అధికారులతో కలెక్టర్ శ్రీకాంత్ తరచూ సంప్రదిస్తున్నారు. మండలాల వారీగా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సెట్ ద్వారా తెలుసుకుంటున్నారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా వారికి సూచనలు ఇస్తున్నారు. తుపాన్ ప్రభావం ఉండే 21 మండలాల్లో 23 మంది ప్రత్యేక అధికారులను నియమించారు. కావలి, విడవలూరుకు ఇద్దరు చొప్పున అధికారులు నియమితులయ్యారు. 21 మండలాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు.
 
 పత్యేక అధికారులు రాత్రి వేళలో మండలాల్లోనే ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. మత్స్యకారులు చేపల వేటకెళ్లకుండా చర్యలు చేపట్టారు. తీరప్రాంత గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కలెక్టరేట్‌లో కంట్రోలు రూం(0861-2331477) ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన నిత్యావసర సరుకులు సిద్ధమయ్యాయి. తుపాన్ ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూంకు తెలియచేయాలని అధికారులు సూచించారు.
 
 విధుల్లో రెవెన్యూ సిబ్బంది
 సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఇప్పటివరకు సమ్మెలో ఉన్న రెవెన్యూ అధికారులు, సిబ్బంది తుపాన్ నేపథ్యంలో విధులకు హాజరయ్యారు. ఏజేసీ పెంచలరెడ్డి, డీఆర్వో రామిరెడ్డి, ఆర్డీఓలు, తహశీల్దార్లు, సిబ్బంది శుక్రవారం విధుల్లో చేరారు.
 
 తీరంలో అప్రమత్తం
 ముత్తుకూరు: పై-లీన్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో తీరప్రాంతంలో అధికారులు అప్రమత్తమయ్యారు. విశాఖపట్టణంలోని వాతావరణ పరిశోధన స్థానం అధికారుల సూచన మేరకు కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాదసూచికను ఎగురవేశారు. తుపాన్ కారణంగా ఈదురు గాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఈ సూచిక సారాంశం. మరోవైపు సముద్రంలో వేటకు వెళ్లిన మరపడవలు పోర్టుకు చేరాయి. కొన్ని ఫైబర్‌బోట్లను బకింగ్‌హాం కాలువలో కట్టేశారు.
 

మరిన్ని వార్తలు