నేటి నుంచి రిజిస్ట్రేషన్లు

5 May, 2020 03:05 IST|Sakshi

కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల ఉన్న ఆఫీసులన్నీ ‘ఓపెన్‌’ 

కోవిడ్‌–19 వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు 

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదేశాలు జారీ  

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల రిజిస్ట్రేషన్‌ సేవలను  పునరుద్ధరించాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో మార్చి 23 నుంచి రిజిస్ట్రేషన్లను పూర్తిగా నిలిపివేయడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు తెరవాలని ప్రభుత్వం ఆదేశించింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల ప్రభుత్వ కార్యాలయాలతోపాటు వివిధ రకాల కార్యక్రమాల నిర్వహణకు లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్రంలో చాలామంది సబ్‌ రిజిస్ట్రార్లు సోమవారమే కార్యాలయాలు తెరిచారు.

సమాచార లోపం వల్ల సోమవారం రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు తెరవకపోయినా మంగళవారం నుంచి అన్ని సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయాలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు కోవిడ్‌–19 వ్యాప్తికి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. కంటైన్మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న సబ్‌ రిజిస్ట్రార్‌ (ఎస్‌ఆర్‌ఓ), జిల్లా రిజిస్ట్రార్‌ (డీఆర్‌), డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ) కార్యాలయాలన్నీ తెరవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నింటినీ పేర్కొన్నారు.   

తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ.. 
► కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించడంతోపాటు, రిజిస్ట్రేషన్‌ కా ర్యాలయాల సిబ్బంది, అక్కడికి వచ్చే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. 
► ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన అవసరమైతే టోకెన్లు జారీ చేయాలి. 
► పబ్లిక్‌ డేటా ఎంట్రీ (పీడీఈ) దస్తావేజులకు ప్రాధాన్యం ఇవ్వాలి. 
► కంప్యూటర్లు, స్కానర్లు వంటి వాటిని డిస్‌ఇన్‌ఫెక్టెడ్‌ రసాయనాలతో శుభ్రపరచాలి. 
► బయోమెట్రిక్‌ యంత్రాలను వినియోగించిన ప్రతిసారీ శుభ్రం చేయాలి. 
► వేలిముద్రలు, స్టాంపు పేపర్లు తీసుకునేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. 
► రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల ప్రవేశ, వెలుపలకు వెళ్లే ప్రాంతాల్లో శానిటైజర్లు ఏర్పాట్లు చేయాలి.  
► అవసరంలేని వారిని ఆఫీసులోకి రాకుండా నిషేధాజ్ఞలు అమలు చేయాలి.   

మరిన్ని వార్తలు