సీజ్ చేసే హక్కు మీకెక్కడిది?

10 Jan, 2014 04:13 IST|Sakshi

చింతూరు, న్యూస్‌లైన్: అటవీశాఖ, ఐటీడీఏల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. పీఓ ఆదేశాల మేరకు బుధవారం వెదురు డిపోలను సీజ్ చేసేందుకు రెవెన్యూ అధికారులు యత్నించగా లిఖితపూర్వక పత్రాలు చూపాలని అటవీశాఖ లాగింగ్ అధికారులు డిమాండ్ చేసిన విష యం విదితమే. దీంతో పీఓ నుంచి వచ్చిన లిఖితపూర్వక ఆదేశాలతో గురువారం చింతూ రు తహశీల్దార్ తాతారావు, డిప్యూటీ తహశీ ల్దార్ మాధవరావులు సిబ్బందితో కలిసి వెదురు డిపో చేసేందుకు యత్నించారు. అదే సమయానికి అక్కడికి చేరుకున్న లాగింగ్ రేంజర్ ఆనందబాబు రెవెన్యూ అధికారులను ఎందుకు లోపలికి రానిచ్చావంటూ డిపో వాచర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో తహశీల్దార్ కలుగజేసుకుని తమ వద్ద పీఓ జారీ చేసిన లిఖిత పూర్వక ఆధారం ఉందని, దీని ఆధారంగా డిపోని సీజ్ చేస్తామని చెప్పారు.
 
 అందుకు రేంజర్ అసహనం వ్యక్తం చేస్తూ డిపోను సీజ్ చేసే హక్కు మీకెక్కడిది, పత్రంలో ఉన్నట్లు తామేమీ గ్రామాల్లో వెదురు నరికి డిపోకు తరలించడం లేదని, రిజర్వ్ ఫారెస్ట్‌లో వెదురును నరుకుతున్నామని, మీరు తెచ్చిన పత్రంలో రిజర్వ్ ఫారెస్ట్‌లో నరికిన వెదురును సీజ్ చేయాలని ఎక్కడా లేదని అన్నారు. రెండు రోజులుగా తమ కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నారని ఇది మంచి పధ్ధతి కాదంటూ రేంజర్ వారిపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. అనంతరం లాగింగ్ రేంజర్ చింతూరు అటవీ రేంజ్ అధికారి మాధవరావు, సిబ్బంది ని డిపో వద్దకు పిలిపించారు. ఇద్దరు రేంజర్లు కలిసి తహశీల్దార్‌తో చర్చించారు. రిజర్వ్ ఫారెస్టుకు, పీసా చట్టానికి సంబంధం లేదని, తాము గ్రామాల్లో గానీ, వీఎస్‌ఎస్‌లో గానీ వెదురు నరకలేదని, అటవీ శాఖ చట్టాలకు అనుగుణంగా రిజర్వ్ ఫారెస్ట్‌లోని కూపుల్లో మాత్రమే వెదురు నరికామని అన్నారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో నరికిన వెదురుకు సంబంధించి గ్రామ సభల అనుమతి అవసరం లేదని, పీసా చట్టం వర్తించదని, ఒకవేళ ప్రస్తుతం డిపోలో వున్న వెదురుపై అనుమానాలుంటే పూర్తిస్థాయిలో విచారణ జరుపుకోవచ్చని అప్పటివరకు డిపోను సీజ్ చేయడానికి వీలులేదని వారు తేల్చిచెప్పారు. దీంతో డిపోలో ఉన్న వెదురు ఎక్కడెక్కడ సేకరించారో ఆ వివరాలు తమకు ఇవ్వాలంటూ తహశీల్దార్ లిఖితపూర్వకంగా కోరడంతో అందుకు అటవీశాఖ అధికారులు అంగీకరించారు. ఆ వివరాలను పీఓకు అందజేసి తదుపరి చర్యలకు కార్యాచరణ ఉంటుందని చెప్పి తహశీల్దార్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.  
 
 పీఓ లేఖలో ఏముందంటే...:
 పీసా చట్టం ప్రకారం గ్రామాల సరిహద్దుల్లోని అటవీప్రాంతంలో ఉన్న వెదురు, తునికాకును వ్యక్తిగతంగా కానీ, అటవీశాఖ కానీ సేకరించాలంటే సంబంధిత గ్రామానికి చెందిన గ్రామసభ తీర్మానం అవసరముంది. అనంతరం పీసా కమిటీ చైర్మన్ అయిన ఐటీడీఏ పీఓ అనుమతి తప్పనిసరి. వీటిని పాటించకుండా అటవీ ఉత్పత్తులను సేకరించిన ట్లయితే వాటిని నేరుగా సీజ్ చేసే అధికారం చింతూరు తహశీల్దార్‌కు ఇస్తున్నామని, సీజ్ చేసిన సరుకును తదుపరి ఆదేశాల వరకు తహశీల్దార్ కార్యాలయంలో భద్రపరచాలని ఐటీడీఏ కార్యాలయం నుంచి వచ్చిన లేఖలో ఉంది. కానీ రిజర్వ్ ఫారెస్ట్‌లో అటవీ ఉత్పత్తుల సేకరణ అనే అంశం ఎక్కడా లేకపోవడంతో అటవీ అధికారులకు ఇదొక ఆయుధంగా మారింది.
 
 ఐటీడీఏ వర్సెస్ అటవీశాఖ: వెదురు డిపోల సీజ్ వ్యవహారంలో ఐటీడీఏ, అటవీశాఖల మధ్య వివాదం జరుగుతోంది. ఎన్నో ఏళ్లుగా ఏజెన్సీ ప్రాంతంలో వెదురును సేకరిస్తున్నా ఇనాళ్లకు గుర్తురాని చట్టాలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా..? అంటూ అటవీ శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కొండరెడ్లను వెదురు సేకరించకుండా అడ్డుకుంటుండడంతో ఐటీడీఏ అధికారులు తమపై కక్షసాధింపుచర్యలకు పాల్పడుతున్నారని అటవీ శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీలో అభివృద్ధి పనులకు చట్టాల పేరుతో అటవీశాఖ అధికారులు అడ్డుపుల్ల వేస్తున్నందున ఐటీడీఏ అధికారులు ఇలా వ్యవహరిస్తున్నారని రెవెన్యూ అధికారులు అంటున్నారు. రెండు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడి వివాదాలు చోటు చేసుకోవడం శోచనీయం.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు