మహా నేత... జన నేత

18 Mar, 2019 07:36 IST|Sakshi
బొంతలకోడూరులో తమ దుస్థితిపై చర్చించుకుంటున్న చేనేతలు

సాక్షి, శ్రీకాకుళం : పడుగు.. పేకలా అల్లుకున్న బంధం వారిది. నిజానికి వాళ్లు కార్మికులు కాదు.. కళాకారులు. చితికిపోయిన చేనేత రంగం వారి బతుకుల్ని ఛిద్రం చేసింది. చేనేత కార్మికులంటూ ప్రభుత్వాలు వారిని చులకన చేశాయి. ‘ఆదుకోండి బాబూ’ అంటున్నా ఆకలి కేకలు సర్కారు చెవిన పడటం లేదు. వారి బతుకులు బాగుపడటం లేదు.  

‘ఆ దేవుడు (వైఎస్‌ రాజశేఖరరెడ్డి) మా కట్టాలు తెల్సుకున్నాడు. సేనేత పని తప్ప మాకేమీ సేతగాదు. ఈ పని కూడెట్టడం నేదు. రోజంతా కట్టపడ్డా యాభై, అరవై కూడా రావటం నేదు. మా బాధలన్నీ ఇన్న వైఎస్‌ బాబు పింఛనీ వయసు 65 నుంచి 50 ఏల్లకి తగ్గించాడు. మాలాటోళ్లందరికీ పింఛనీలిచ్చి పున్నుం గట్టుకున్నాడు. సెంద్రబాబొచ్చి ఇంట్లో ఇద్దరికి పెన్షన్లుంటే ఈల్లేదని ఒకరికి తీసేశాడు.

వైఎస్‌లాగా అతని కొడుకు జగన్‌బాబే కనపడతన్నాడు. ఆయన అధికారంలోకొత్తే ఇంట్లో ఎంతమంది ముసలోళ్లున్నా పింఛనీలిత్తానని సెప్పాడు. తండ్రిలాగే మాట తప్పడు. ఆ బాబు ముఖ్యమంత్రి ఎప్పుడవుతాడా.. మా కట్టాలెప్పుడు గట్టెక్కుతాయా అని ఎదురు సూత్తనామయ్యా..!’ అని సిక్కోలు చేనేత కార్మికులు ముక్తకంఠంతో చెప్పారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు, బొంతలకోడూరు గ్రామాలను ‘సాక్షి’ సందర్శించింది. బొంతలకోడూరులో వృత్తినే దైవంగా నమ్ముకుని.. కూలిపోయే ఇంట్లో ఒంటరిగా బతుకీడుస్తున్న 85 ఏళ్ల బొల్ల జగన్నాథమ్మ రోజంతా కష్టపడితే వచ్చేది 20 రూపాయలే.

ఈ వయసులో ఇంత కష్టమేంటమ్మా.. అని అడిగితే ‘గాంధీ మహాత్ముడు సృష్టించిన ఈ రాట్నమే నాకు ఇంకా బతుకునిస్తోంది బాబూ’ అని సమాధానం ఇచ్చింది. ఇంతలో అక్కడకు ఓ పదిమంది వయసు మళ్లిన చేనేత కళాకారులు చేరుకున్నారు. వారిని కదిలిస్తే.. ‘ఈ ఐదేళ్లలో మమ్మల్ని సెంద్రబాబు పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు పెన్షను వయసు 65 నుంచి 50కి తగ్గించి పుణ్యం గట్టుకున్నారు. మా శరీరం సహకరించకపోయినా ఆ దేవుడు దయవల్లే  50 ఏళ్లకే పెన్షన్లు అందుకుంటున్నాం’ అని పోలిశెట్టి రాంబాబు (80) చెప్పాడు.

‘జగన్‌ వత్తే భార్యాభర్తలిద్దరికీ పెన్షనిత్తాడంట. తెలుగుదేశం ప్రభుత్వంలో మొగుడికో, పెళ్లానికో ఒక్కరికే ఇత్తన్నారు. నా పెన్షన్‌ పీకేశారు’ అని  సాంబశివరావు అనే కార్మికుడు చెప్పారు. తండ్రిలాగే జగన్‌ ఇచ్చిన మాట తప్పడని అంటున్నారు. జగన్‌ బాబు త్వరగా సీఎం అయితే చేనేతల బతుకులు మారతాయన్న నమ్మకం ఉంది. పెన్షన్లు అందరికీ వస్తాయి’ అని మరికొందరు చేనేత కార్మికులు తమ నమ్మకాన్ని వెల్లడించారు.  

- బొల్లం కోటేశ్వరరావు, సాక్షి, శ్రీకాకుళం
 

మరిన్ని వార్తలు