మంత్రి పేరిట మట్టి అక్రమ తరలింపు!

18 Nov, 2014 00:35 IST|Sakshi
మంత్రి పేరిట మట్టి అక్రమ తరలింపు!

అయినవిల్లి :డీప్యూటీ సీఎం, హో మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేరుతో కొందరు అక్రమార్కులు లంక మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన కొందరు ఈ వ్యవహారాన్ని నడుపుతున్నట్టు తెలిసింది. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మద్దాల సుబ్బారావు అయినవిల్లిలంక వీఆర్‌ఓ పట్టెం నాగేశ్వరరావును సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో తహశీల్దార్ కె.చంద్రశేఖర్‌రావు సమక్షంలో నిలదీయగా ఈ విషయం బయట పడింది.
 
 డీప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అమలాపురంలోని తన నివాసంలో పూలమొక్కలు పెంచుకునేందుకు గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారని, అందుకోసం మట్టి కావాలని కొందరు వ్యక్తులు తన వద్దకు వచ్చారని వీఆర్‌ఓ బదులిచ్చారు. తొత్తరమూడికి చెందిన అమరా పెద్దబ్బులు పొక్లైయిన్, నాలుగు ట్రాక్టర్ల సాయంతో మట్టిని తరలించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని చెప్పారు. మంత్రికి మట్టి కావాలనడంతో తాను పట్టించుకోలేదన్నారు. మంత్రి పేరిట పెద్దబ్బులు కొందరి ప్రోద్బలంతో లంక మట్టిని అక్రమంగా తరలించి, సొమ్ము చేసుకున్నారని మద్దాల సుబ్బారావు ఆరోపించారు. రెండు రోజులుగా మట్టి అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయన్నారు. అయినవిల్లిలంక, మాగాం, ముక్తేశ్వరం తదితర గ్రామాల్లో సుమారు 50 ట్రాక్టర్ల మట్టిని ఇటుక బట్టీలకు, కొబ్బరి తోటల్లో తరలించారని తహశీల్దార్ కె.చంద్రశేఖర్‌రావుకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కోరారు.
 

మరిన్ని వార్తలు