ఉద్యోగ భద్రతపై తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి

7 Aug, 2019 19:26 IST|Sakshi

ఏఎన్‌ఎంలకు ఎలాంటి ఆందోళన అవసరం లేదు

డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెల్లడి

సాక్షి, అమరావతి : ఉద్యోగ భద్రత విషయంలో గ్రామీణ స్థాయి మహిళా నర్స్ వర్కర్ల (ఏఎన్‌ఎం)కు ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఉద్యోగ భద్రతపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని ఆయన ఏఎన్‌ఎంలకు సూచించారు. తమ ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కూడా పూర్తికాకముందే.. విష ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారని ఆయన తప్పుబట్టారు. ఏఎన్‌ఎంల ఆందోళనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయన తన శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఏఎన్‌ఎంలను ఉద్యోగాల నుంచి తీసివేస్తారన్న ప్రచారం ఎందుకు జరుగుతోందని అధికారులను ఆయన ఆరా తీశారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ తనకు చెప్పారని పేర్కొన్న ఆళ్ల నాని.. ఈ అంశంపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు.

ఏఎన్‌ఎంల ఉద్యోగ భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరంలేదని, రాష్ట్రవ్యాప్తంగా 7,418 మంది ఏఎన్‌ఎంలు.. కాంట్రాక్టు, సెకండ్‌ ఏఎన్‌ఎం, ఈసీ ఏఎన్‌ఎం తదితర కేటగిరీల్లో ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు.
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల్లో భాగంగా 13,540 మంది ఏఎన్‌ఎంలను నియమిస్తున్నామని, ఈ పోస్టుల కోసం పైమూడు పద్ధతుల్లో పనిచేస్తున్న ఏఎన్‌ఎంలు కూడా దరఖాస్తు చేసుకొని.. పరీక్షలకు హాజరుకావొచ్చునని వెల్లడించారు. ఇలా పరీక్షలు రాసేవారికి 10శాతం వెయిటేజీ కూడా ఇస్తున్నామని తెలిపారు. సచివాలయ పోస్టులకు ఎంపిక కాకపోయినా ఇప్పుడున్న ఉద్యోగాల్లో ఏఎన్‌ఎంలను యథావిధిగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. సచివాలయ పోస్టులకు ఎంపికైన వారికి వేతన అంతరంపై ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంటుందని, ఎవ్వరికీ ఎలాంటి నష్టం రాకుండా చూడాలన్నదే తమ ప్రభుత్వం ఉద్దేశమని తెలిపారు.

మరిన్ని వార్తలు