ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశాలు

4 Jul, 2019 12:18 IST|Sakshi
అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్న మంత్రి ఆళ్ల నాని

ఏలూరు(పశ్చిమగోదావరి) : పేదల ఇళ్ల స్థలాలు కాజేసి అమ్ముకున్న కబ్జాదారుల భరతం పట్టాలని ఉపముఖ్యమంత్రి, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. అవసరమైతే కబ్జా వ్యవహారంపై విజిలెన్స్‌ ఎంక్వైరీకి ఆదేశిస్తామన్నారు. బుధవారం ఆయన ఏలూరు మండలం వెంకటాపురం, కొమడవోలు, మాదేపల్లిరోడ్డులో ఇందిరమ్మ ఇళ్ల కాలనీలను ఆకస్మిక తనిఖీ చేశారు. కాలనీల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లు, ఖాళీ స్థలాలు, కామన్‌ సైట్లను పరిశీలించారు. కాలనీ ప్రజల సమస్యలపై ఆరా తీశారు. అనంతరం అక్కడే హౌసింగ్, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌తో పాటు స్థానిక తహసీల్దార్‌తో కాలనీల స్థితిగతులు, ప్రజల సమస్యల గూర్చి చర్చించారు. 

కబ్జాదారులపై చర్యలు..
కొందరు టీడీపీ నాయకులు ఖాళీస్థలాలు అమ్ముకున్నారని కాలనీవాసులు మంత్రికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసి పేదలకు పంపిణీ చేసిన స్థలాలను కబ్జా చేసి అమ్ముకున్న వారిని గుర్తించాలన్నారు. అవసరమైతే వీరిపై క్రిమినల్‌ చర్యలు చేపట్టాలన్నారు. స్థలాలు కొనుక్కుని ఇళ్లు నిర్మించుకున్న వారు అర్హులైతే న్యాయం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. కాగా కొత్తూరు కాలనీలో ఉన్న 900 ఇళ్ల స్థలాల్లో 640 ఇళ్లు పూర్తయ్యాయని అధికారులు మంత్రికి చెప్పారు. 

కామన్‌ సైట్ల చుట్టూ కంచె వేయండి..
కాలనీల్లో కామన్‌సైట్లను గుర్తించి పంచాయతీ కార్యదర్శికి అప్పగించాలని తహసీల్దార్‌ సూర్యనారాయణను ఆదేశించారు. కామన్‌సైట్లు ఆక్రమణకు గురికాకుండా తక్షణం కంచె నిర్మాణం చేపట్టాలని కార్యదర్శి సాయికృష్ణకు చెప్పారు. కాలనీలో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పలువురు మహిళలు మంత్రి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఏలూరు డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావును పిలిచి రోజూ రాత్రి వేళల్లో కాలనీల్లో గస్తీ తిరగాలని సూచించారు. పోలీసులు చర్యలు చేపట్టకపోతే నాకు ఫోన్‌ చేయండి అంటూ మహిళలకు తెలిపారు. 

బాధితుడికి చేయూత : అనారోగ్యంతో మంచాన పడిన కాలనీవాసుడు దత్తి రవికుమార్‌ అనే వ్యక్తిని మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి పర్యటనలో పలుశాఖల అధికారులతో పాటు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎస్‌ఎంఆర్‌ పెదబాబు, బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, నూకపెయ్యి సుధీర్‌బాబు తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు