వైఎస్సార్‌సీపీ మైనార్టీలకు అండగా నిలుస్తుంది: అంజాద్‌ బాషా

18 Dec, 2019 14:35 IST|Sakshi

సాక్షి, కర్నూలు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముస్లింల పక్షాన నిలుస్తుందని డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా భరోసా ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముస్లిం, మైనార్టీలకు ఎన్నో సంక్షేమ పథకాలను అందించారని గుర్తు చేశారు. బుధవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మైనార్టీలకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముస్లింను డిప్యూటీ సీఎం చేశారన్నారు. గత ఎన్నికల్లో అయిదుగురు ముస్లింలకు టికెట్‌ ఇచ్చారని, హిందూపురంలో ఇక్బాల్‌ ఒడినా.. ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని పేర్కొన్నారు. బడ్జెట్‌ సమావేశాల్లో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, హమారా సమావేశాల్లో మైనార్టీలపై దేశ ద్రోహం కేసు పెడితే సీఎం జగన్‌ వాటిని ఎత్తివేశారని గుర్తుచేశారు.

అలాగే హజ్‌ యాత్రకు వెళ్లే హాజీలకు రూ.60 వేల రూపాయలు అందించేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. మౌజమ్‌లకు మార్చి 1 నుంచి రూ. 15 వేల గౌరవ వేతనం ఇ‍్వబోతున్నామని, వక్ఫ్‌ భూములు కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఎన్నార్సీపై ఆందోళనను సీఎం దృష్టికి తీసుకెళ్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ ముస్లింలకు అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. ఏ అన్యాయం జరిగినా తాము వ్యతిరేకిస్తామని, పోరాటంలో ముందుంటామని పేర్కొన్నారు. దీనిపై రాజ్యసభ, లోక్‌సభలోనూ పోరాడుతామన్నారు.

మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు
ఆంధ్రరాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బాగుండాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరుకుంటారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ ఖాన్‌ తెలిపారు. ముస్లిం సోదరుల ఆందోళనలు సీఎం దృష్టికి తీసుకెళ్లామని, ఏ ఒక్క ముస్లిం, మైనార్టీలకు ఇబ్బంది కలిగినా తాము ముందుంటామన్నారు. గతంలో వైఎస్సార్‌ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా గుర్తు చేశారు. ఈ బిల్లు ఏపీ రాష్ట్రానికి వర్తించదని, వైఎస్సార్‌ సీపీ మైనార్టీలకు అండగా ఉంటుందని మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్‌ బాషా తెలిపారు.

మరిన్ని వార్తలు