మద్యనిషేధం.. మహిళలకు కానుక

7 Sep, 2019 10:03 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. చిత్రంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు అంబటి, ముస్తఫా, గోపిరెడ్డి, బొల్లా , రజని, శ్రీదేవి, ఎమ్మెల్సీ జంగా, కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌

దశల వారీగా  మద్య నిషేధాన్ని పూర్తిగా అమలుచేసి తీరుతాం

సారా తయారీకి సహకరించే వారిపై వేటు వేయండి

సమీక్షలో డెప్యూటీ సీఎం నారాయణ స్వామి 

సాక్షి, గుంటూరు: ‘మద్యపాన నిషేధం మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన కానుక. దశలవారీగా అమలు చేయాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. జిల్లాలో ఎక్కడా బెల్టు షాపులు కనిపించకూడదు’ అని డెప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. గుంటూరులోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం హోమంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు, జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, జిల్లా యంత్రాంగంతో కలిపి నారాయణస్వామి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు, బెల్ట్‌షాపులు, సారా, గంజాయి, డ్రగ్స్‌ నిషేధం తదితర విషయాలను డెప్యూటీ సీఎం చర్చించారు. ఇకపై జిల్లాలో బెల్ట్‌షాపులు ఎక్కడా ఉండకూడదని, ఎక్కడైనా ఉన్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్‌ సిబ్బందిని హెచ్చరించారు.

ఈ విషయంలో జిల్లా ప్రజాప్రతినిధులు యంత్రాంగం, ఎక్సైజ్‌ సిబ్బందితో సహకరించాలని కోరారు. ఎక్సైజ్‌ డీసీ ఆదిశేషు మాట్లాడుతూ బాపట్ల, మాచర్ల, వినుకొండ ప్రాంతాల్లో సారా తయారీని అరికట్టామని, వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్‌ అధికారులను గ్రామాల్లోకి తీసుకెళ్లి ఆయా శాఖల ద్వారా ప్రజల జీవనోపాధికి అవసరమైన రుణాలు ఇప్పించేందుకు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గ్రామ వలంటీర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ బొల్లాపల్లి మండలంలో సారా తయారీ కనిపించకూడదని, దీనికి సంబంధించి ఎక్సైజ్‌ అధికారులు క్లారిటీగా ఉండాలని సూచించారు. డెప్యూటీ సీఎం నారాయణస్వామి మట్లాడుతూ కూలీలపై కేసులు కాకుండా సారా తయారు చేస్తున్న, వారికి సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో బెల్టు షాపులు, సారా లేకుండా చేసేందుకు ప్రజాప్రతినిధులు తమ వంతు సహకరం అందిస్తున్నారని ఎక్సైజ్‌ అధికారులు, సిబ్బంది పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ప్రతి ఇల్లూ బాగుండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్య నిషేధం అమలుకు చర్యలు చేపట్టారని, అందరు మనసు పెడితే ఇది పెద్ద కష్టం కాదని అన్నారు. ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ సారా తయారీ, బెల్ట్‌షాపులు లేకుండా కఠినంగా వ్యవహరించాలని కోరారు. మద్యం విక్రయాలు వీలైనంత తక్కువగా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంగళగిరి ఎమ్మెల్యే  ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, ముస్తాఫా, నంబూరి శంకర్రావు, విడదల రజిని, ఉండవల్లి శ్రీదేవి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మద్యం నిషేధంపై పలు సూచనలు చేశారు.
పెడ దారిన యువత
పలు ఇంజినీరింగ్‌ కాలేజీలు, యూనివర్సిటీల్లో విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌ వంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి తమ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని హోమంత్రి సుచరిత, కలెక్టర్‌ ఐ.శ్యామూల్‌ఆనందకుమార్‌ అన్నారు. సంబంధిత అధికారులు తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హాస్టళ్లలో తనిఖీలు చేస్తున్నామని, మత్తుకు బానిసలుగా మారిన విద్యార్థుల్లో మార్పు తెచ్చేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎక్సైజ్‌ అధికారులు చెప్పారు. సిబ్బంది కొరత ఉందని హోమంత్రి దృష్టికి ఎక్సైజ్‌ అధికారులు తీసుకెళ్లగా, హోంగార్డులను కేటాయిస్తానని ఆమె హామీ ఇచ్చారు.

ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు ప్రక్రియను జాయింట్‌ కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ వివరించారు. మద్యంతో చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు నిషేధానికి సహరించా లని డెప్యూటీ సీఎం నారాయణస్వామి కోరారు. ఈ సమావేశంలో వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, ట్రైనీ కలెక్టర్‌ మౌర్య నారపురెడ్డి, గుంటూరు ఆర్డీఓ భాస్కరరెడ్డి, ఎక్సైజ్‌ డీసీ ఎం.ఆదిశేషు, ఏసీ కె.శ్రీనివాసులు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌  ఎస్‌.రవికుమార్, బాలకృష్ణ, మహేష్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. హోమంత్రి సుచరిత, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, విడదల రజనీ తొలుత డెప్యూటీ సీఎం నారాయణ స్వామికి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

మరిన్ని వార్తలు