భూ వివరాల్లో చాలా తేడాలున్నాయి: పిల్లి సుభాష్‌

9 Dec, 2019 14:22 IST|Sakshi

సాక్షి, అమరావతి: వెబ్‌ల్యాండ్‌ లెక్కలకు ఆర్‌ఎస్‌ఆర్‌ లెక్కలకు భూ వివరాల్లో చాలా తేడాలు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. సోమవారం శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. గతంలో గ్రామాల్లో మునసబులు, కరణాల కాలంలో రెవెన్యూ రికార్డులు కచ్చితంగా ఉండేవని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో రికార్డుల్లో తేడాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇక తమ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో భూ సర్వేలు నిర్వహిస్తుందని, రెవెన్యూ రికార్డులన్నింటినీ ప్రక్షాళన చేసి, జూన్‌ నుంచి జమాబంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా రవాణా శాఖ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో లాగా ఆర్టీసీ బస్సులను, టాక్సీలను తమ ప్రభుత్వం వాడుకోవటం లేదని, అలాంటి అవసరం తమ ప్రభుత్వానికి లేదని టీడీపీని విమర్శించారు. దాదాపు 2,24,160 మంది ఆటో కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున చెల్లించామని పేర్కొన్నారు. రాజకీయాలు పూర్తిగా దిగజారాయని, రాజకీయ అవసరాల కోసం కాకి బట్టలను అడిగి తెచ్చి బురద జల్లే ప్రయత్నం చేయొద్దని హితవు పలికారు. అలాగే గత ప్రభుత్వంలో రవాణా శాఖలో ఏం జరిగందో అందరికి తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు.

ఇక వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. గత తెలుగుదేశం ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, వారి పట్ల టీడీపీకి చిత్తశుద్ది లేదని మండిపడ్డారు. రుణమాఫీ చేయకపోవడం మా చేతకానితనమని టీడీపీ సభ్యులు ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్లీనరీలో రైతు భరోసా పథకాన్ని ప్రకటించగా రైతుల ఇబ్బందులు చూసి 4 సంవత్సరాల పథకాన్ని 5 సంవత్సరాలకు పెంచారని ఆయన వివరించారు. రైతులకు ఇచ్చే సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500లకు పెంచామని పేర్కొన్నారు. రైతుల పేరుతో రాజకీయం చేయొద్దని, రైతులకు రాజకీయాలతో ముడిపెట్టొద్దని మంత్రి హితవు పలికారు.

మరిన్ని వార్తలు