‘వారికి దేవుడే శిక్ష విధించాడు’

7 Dec, 2019 15:46 IST|Sakshi

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

సాక్షి, విజయవాడ: ‘దిశ’ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం పట్ల డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి హర్షం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ..మహిళలపై దారుణాలకు పాల్పడే వారికి దేవుడే శిక్ష విధిస్తాడని..ఈ ఎన్‌కౌంటర్‌ ద్వారా న్యాయం జరిగిందన్నారు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళల రక్షణకు చర్యలు చేపట్టారని వెల్లడించారు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలోనే ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ క్రైమ్’ అనే కార్యక్రమం చేపట్టామని, దేశంలో ఎక్కడా లేని ప్రయోగం ఏపీలోనే జరిగిందన్నారు. ప్రతి గ్రామంలో ఒక మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేశారని చెప్పారు. మద్యానికి బానిసై కర్కశంగా నలుగురు నిందితులు.. ‘దిశ’పై ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. ఇలాంటి దారుణాలను నియంత్రించడానికి విడతల వారీగా మద్యపాన నిషేధానికి వైఎస్‌ జగన్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. పాఠశాలల్లో విద్యార్థినిలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేవిధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. ఆడపిల్లలకు సెల్ఫ్‌ డిఫెన్స్‌ చాలా అవసరమని పుష్ఫ శ్రీవాణి సూచించారు.

చట్టాలను కఠినతరం చేయాలి..
మహిళల రక్షణకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళల రక్షణ, భద్రతకు నూతన చట్టం తెచ్చేలా సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. చట్టాలను కఠినతరం చేయాలని కోరారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కొత్త చట్టం తీసుకువచ్చే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని  వెల్లడించారు. 
(చదవండి: మహిళలపై దాడులు.. కేంద్రం కీలక ఆదేశాలు

మరిన్ని వార్తలు