‘గిరిజనులకు అన్యాయం జరగనివ్వం’

25 Apr, 2020 17:13 IST|Sakshi

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

సాక్షి, అమరావతి: గిరిజన ప్రాంతాలకు సంబంధించిన జీవో నంబర్‌ 3ను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో గిరిజనులకు న్యాయం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై ఏపీ ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహాలను కోరిందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తీర్పుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా వాకబు చేశారని పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జరిగే ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో స్థానిక గిరిజనులకే అన్ని ఉద్యోగాలు వచ్చేలా 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కొనసాగుతున్న 2000 సంవత్సరంలో అప్పటి గవర్నర్ జీవో నెంబర్.3 ను జారీ చేశారన్నారు.
(‘ఆయన చెప్పిందే నిజమైంది’)

అయితే ఈ జీవో ఆధారంగా ఏజెన్సీ ఏరియాలోని టీచర్ల నియామకాల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఆక్షేపిస్తూ కొంత మంది సుప్రీం కోర్టును ఆశ్రయించగా, 100 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని వాఖ్యానిస్తూ సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం జీవో నెంబర్.3ను కొట్టి వేసిందని వివరించారు. ఈ తీర్పు నేపథ్యంలో గిరిజనులకు న్యాయం జరిగేలా ఏ చర్యలు తీసుకోవాలనే విషయంగా న్యాయ కోవిదులను సంప్రదిస్తున్నామని చెప్పారు. సుప్రీం తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉందని, ఆ వివరాలు వచ్చాక న్యాయ నిపుణులతో చర్చించి, వారు  సూచించిన విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వివరించారు. ప్రభుత్వం ఏజెన్సీ గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తుందని పుష్ప శ్రీవాణి హామీ ఇచ్చారు.
(‘సున్నా వడ్డీ’తో మా కుటుంబాల్లో వెలుగు)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు