గిరిజన అభివృద్ధికి రూ.60.76 కోట్లు

17 Dec, 2019 11:58 IST|Sakshi

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

సాక్షి, అమరావతి:  శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఐటిడిఏ పరిధిలో కొత్తూరులో గిరిజన యువతకు ఉపాధి కల్పన కోసం ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి తెలిపారు. మంగళవారం శాసన సభలో గిరిజన ఉత్పత్తులు, గిరిజన సమస్యలు, జీసీసీలపై సభ్యులు అడిగిన  ప్రశ్నలకు ఆమె సమాధానం ఇచ్చారు. అటవీశాఖ అధికారులతో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు అటవీ అధికారులకు, గిరిజనులకు మధ్య త్వరలో సమన్వయ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి సబ్‌ప్లాన్‌ కింద రూ.60.76  కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. సీతంపేటలో ఆంధ్రా బ్యాంకు, స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా భవనాలు జీసీసీకు సంబంధించిన పార్కు స్ధలంలో ఉన్నాయా అని సభ్యుల అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆ భూమి జీసీసీకి సంబంధించినది కాదని మంత్రి పుష్ప శ్రీవాణి స్పష్టం చేశారు. 

ఆక్రమణలకు గురి కాలేదు..
సీతంపేట ఐటిడిఏ పరిధిలో కొత్తూరు గ్రామ పరిధిలో 1210 చదరపు గజాలు ఖాళీ స్థలం ఒకటి మాత్రమే ఉందని, దానిలో స్ధానిక గిరిజన యువతకు ఉపాధి కల్పన కోసం కావాల్సిన శిక్షణా తరగతులకు సంబంధించి ట్రైనింగ్‌ సెంటర్‌ ఏర్పాటుకు ప్రతిపాదించామన్నారు. జీసీసీకు సంబంధించిన శాశ్వత స్ధలాలు ఎక్కడా ఆక్రమణకు గురికాలేదని స్పష్టం చేశారు.  కొన్ని చోట్ల రోడ్డు పక్కన చిన్న, చిన్న స్ధలాల్లో షాపులు పెట్టుకున్నారన్నారు. 5 అటవీ ఫల ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వం మద్ధతు ధర ప్రకటించిందన్నారు. ఇంకా కొన్ని అటవీ ఉత్పత్తులకు మద్ధతు ధర కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున మరికొన్ని ప్రతిపాదనలు కూడా పంపించామని పేర్కొన్నారు.

యానాదుల సమస్యల పరిష్కారానికి చర్యలు..
గిరిజన ప్రాంతాల్లో శాశ్వత నిర్మాణాల కోసం 2019-20 ట్రైబల్‌ సబ్‌ ప్లాన్‌ కింద కొన్ని నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించామన్నారు. దీనికి సంబంధించి నిధుల కేటాయింపు మంజూరు కావాల్సి ఉందని సభకు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల్లో  శిథిలావస్థలో  ఉన్న భవనాలు మరమ్మత్తులు కోసం ప్రతిపాదనలు చేస్తామన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో సమస్యల పరిష్కరించడంతో పాటు, యానాదుల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరిన్ని వార్తలు