రాజకీయాలంటే భయమేస్తోంది-మండలి బుద్ధప్రసాద్

25 Jan, 2016 19:23 IST|Sakshi

-నేటి పార్టీలకు సిద్ధాంతాలు లేవు
-రాజకీయాలంటే భయమేస్తోంది
-ఉపసభాపతి బుద్ధప్రసాద్ ఆవేదన


అవనిగడ్డ(కృష్ణా జిల్లా) : కులాలు, మతాల వారీగా ప్రజలను విభజిస్తూ సమాజాన్ని కలుషితం చేస్తున్న నేటి రాజకీయాలంటే భయమేస్తోందని ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లా అవనిగడ్డ తహశీల్దార్ కార్యాలయం రచ్చబండపై సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. ఒకప్పుడు రాజకీయ పార్టీలకు సిద్ధాంతాలు ఉండేవని, కార్యకర్తలు నిబద్ధతతో పనిచేసేవారని చెప్పారు. నేడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందన్నారు.

కులమతాలను ప్రోత్సహించకుండా రాజకీయాలు లేవని, అన్ని పార్టీలూ వీటిని ప్రోత్సహిస్తూ అశాంతికి కారణమవుతున్నాయని చెప్పారు. ఒకప్పుడు అభివృద్ధి, పనిచేసే నాయకుడిని చూసి ప్రజలు ఓటేసేవారని, నేడు డబ్బులు పంచకపోతే ఓటేసే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేటి పార్టీలకు సిద్ధాంతాలు లేవని, అధికారమే పరమావధిగా ఎదుటి పార్టీలను దూషించడానికే ప్రాధాన్యతనిస్తున్నాయని అన్నారు.

రాజకీయాలు పూర్తిగా కలుషితమైపోయాయని, ప్రజల బాగోగులను పట్టించుకునే తీరిక లేదని చెప్పారు. ఓటర్లను ఎలా బుట్టలో వేసుకోవాలా అనే ఆలోచనలతోనే పనిచేస్తున్నాయని, మారిన ఈ రాజకీయాలంటేనే భయమేస్తోందని తెలిపారు. యువతపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని, జాతిని జాగృతం చేసేలా మంచి వ్యక్తులను ఎన్నికల్లో ఎన్నుకోవాలని యువతకు సూచించారు. తహశీల్దార్ వెన్నెల శ్రీను అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఖాదర్ బాషా, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు