చిప్పాడ భూదందాలో మరో వికెట్‌

17 Oct, 2017 16:59 IST|Sakshi

డిప్యూటీ తహసీల్దార్‌ రాజాశ్రీధర్‌ అరెస్డు

14 రోజుల రిమాండ్‌కు తరలింపు

అజ్ఞాతంలోనే నంబూరి నారాయణరాజు కుటుంబం

కొనసాగుతున్న మన్సాస్‌ భూముల కేసు

అర్జీలు, ఎన్‌వోసీలపై పూర్తి కాని సిట్‌ విచారణ

గడుపు పొడిగింపుపై ఎదురుచూపులు

సాక్షి, విశాఖపట్నం: రికార్డులు టాంపర్‌ చేసి..వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జారాయుళ్ల పరం చేసిన భీమిలి మాజీ డిప్యూటీ తహసీల్దార్, ప్రస్తుత ఏపీఐఐసీ డీటీ జి.రాజాశ్రీధర్‌ను భీమిలి పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. క్రైం నెం.151/17 కింద అరెస్ట్‌ చేసి ఏసీబీ కోర్టు ముందు హాజరుపర్చగా 14 రోజుల రిమాండ్‌ విధించారు. భీమిలి మండలం చిప్పాడ గ్రామంలోని సర్వే నెం.184/6, 184/8, 163/1సీ, 159/3, 94లలో సుమారు 156.95 ఎకరాల మన్సాస్‌ ట్రస్ట్, ప్రభుత్వ భూములకు అప్పటి తహసీల్దార్‌ బీటీవీ రామారావుతో కలిసి నంబూరి నారాయణరాజు కుటుంబ సభ్యుల పేరిట పట్టాదార్‌ పాస్‌పుస్తకాల జారీలో డీటీ రాజా శ్రీధర్‌ కీలకంగా వ్యవహరించారు. దాంతోపాటే రామారావు తన మామ పేరిట 1.58 ఎకరాలకు, రాజా శ్రీధర్‌ తన అత్త ఎన్‌.కళావతి పేరిట 1.39 ఎకరాల ప్రభుత్వ భూమికి  స్వయంగా పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు, టైటిల్‌ డీడ్స్‌ కూడా జారీ చేసేశారు.

 నంబూరితో కలిసి పాత రికార్డుల్లో కొన్నింటిని ధ్వంసం చేయడం. మరికొన్నింటిని టాంపరింగ్‌ చేయడంలో కూడా రామారావు, రాజా శ్రీధర్‌లే కీలక సూత్రదారులుగా పోలీసులు గుర్తించారు. స్టాంప్‌ డ్యూటీని అడ్డుకోవడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు కూడా నష్టం కల్గించారు. ఇప్పటికే ఈ కేసులో బీటీవీ రామారావును అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఐదు రోజుల పాటు సిట్‌ కస్టడీలో తీసుకొని రామారావును విచారించింది. అప్పట్లో రామారావుతో పాటు ఇదే మండలంలో పనిచేసి పలు అక్రమాలకు పాల్పడిన రాజా శ్రీధర్‌ను సోమవారం అరెస్ట్‌ చేశారు.

250 అర్జీలు పరిష్కారం
కాగా ఇప్పటి వరకు తమ పరిధిలోకి వచ్చిన 337 అర్జీల్లో 250 అర్జీలను పరిష్కరించినట్టు సిట్‌ వర్గాలు ప్రకటించాయి. సిట్‌ పరిధిలోకి రాని వాటిలో 1700 అర్జీలను పరిగణనలోకి తీసుకుని ఆయా శాఖలు, మండలాలకు రిఫర్‌ చేయగా.. ఇప్పటి వరకు 1230 అర్జీలకు సంబంధించి సిట్‌కు రిపోర్టులు వచ్చాయి. వీటిలో 645 అర్జీలను పూర్తిస్థాయిలో పరిష్కరించినట్టు సిట్‌ ప్రకటించింది.  66 ఎన్‌వోసీల్లో ఇప్పటివరకు 12 ఎన్‌వోసీలపైనే దర్యాప్తు పూర్తిచేశారు. మిగిలిన వాటిలో సగానికిపైగా దర్యాప్తు కొలిక్కి వచ్చినప్పటికీ నేరతీవ్రతపై ప్రాధమికంగా సిట్‌ నిర్ధారణకు రాలేకపోతోంది. నాలుగైదు దశాబ్దాల నాటి రికార్డులను లోతుగా అధ్యయనం చేయాల్సి రావడంతో ఆశించినంత వేగంగా దర్యాప్తు జరగడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగానే  కనీసం మరో నెల రోజులపాటు గడువు పొడిగించాలని ప్రభుత్వానికి సిట్‌ చీఫ్‌ లేఖ రాసినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పొడిగించిన గడువు అధికారికంగా ఈ నెల 20వ తేదీతో ముగియనుంది. దర్యాప్తు ప్రారంభమైన తేదీని పరిగణనలోకి తీసుకుంటే 28వ తేదీ వరకు ఉంది. ఈలోగా ఎన్‌వోసీలపై దర్యాప్తు కొలిక్కి వచ్చే అవకాశాలు లేనందున మరికొంత గడువు కావాలని కోరినట్టు చెబుతున్నారు.

ఇంకా దొరకని నంబూరి ఆచూకీ
కాగా ఈ కేసులో చిప్పాడ గ్రామంలోని సర్వే నెం. 184/8లో 58 ఎకరాలు, సర్వే నెం.163/1సీలో ఎకరా మన్సాస్‌ భూములను నంబూరి నారాయణరాజు తన కుటుంబ సభ్యుల పేరిట పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందారు. అలాగే అన్నవరం గ్రామ సర్వే నెం.78లో 30 ఎకరాలు, సర్వే నెం.159/3లో 7.95 ఎకరాలు, సర్వే నెం.94లో 26 ఎకరాలను తమ పేరిట రాయించుకున్న నారాయణరాజు కుటుంబం మొత్తం పరారీలోనే ఉంది. వీరి ఆచూకీ తెలపాలంటూ ఈ నెల మూడో తేదీన పోలీసులు  ప్రకటన కూడా జారీ చేశారు. కాగా అదే రోజు నారాయణరాజు హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ పొందడంతో కావాలనే పోలీసులు ఆచూకీ నాటకం ఆడారన్న విమర్శలు విన్పించాయి.

మరిన్ని వార్తలు