‘ముద్రగడ పాదయాత్రను అడ్డుకుంటాం’

9 Jul, 2017 19:32 IST|Sakshi
‘ముద్రగడ పాదయాత్రను అడ్డుకుంటాం’

నాంపల్లి(హైదరాబాద్‌సిటీ): కాపులను బీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం చేయనున్న పాదయాత్రను అడ్డుకుంటామని ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డేరంగుల ఉదయ్‌ కిరణ్‌ హెచ్చరించారు. ఆదివారం నాంపల్లిలోని ఓ హోటల్‌లో ఏపీ బీసీ సంఘం అత్యవసర సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన డేరంగుల ఉదయ్‌ కిరణ్‌ ప్రసంగిస్తూ...  కాపుల హక్కుల సాధన కోసం ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తే తమకేమి ఇబ్బంది లేదన్నారు. కానీ బీసీ జాబితాలో కాపులను చేర్చాలని కోరితే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు.

ముద్రగడ పద్మనాభం ఎక్కడ పాదయాత్రను ప్రారంభించినా బీసీ సంఘాలన్నీ సంఘటితంగా ప్రతిఘటిస్తాయని తెలిపారు. కాబట్టి పాదయాత్రను విరమించుకోవాలని కోరారు. లేదంటే ముద్రగడ పద్మనాభం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. గత ఏడాది జనవరిలో ముద్రగడ చేసిన ఆందోళనలను ప్రజలు ఇంకా మరిచిపోలేదని అన్నారు. రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పటించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా రాష్ట్ర ప్రజలను భయాందోళనకు గురి చేశారని వివరించారు. ఈ ఘటనకు కారణమైన ముద్రగడ పద్మనాభంపై కేసు నమోదు చేశారే తప్ప చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అటు కాపులను, ఇటు బీసీలను మభ్యపెడుతున్నారే తప్ప ఏ ఒక్కరికి స్పష్టమైన వైఖరిని ప్రకటించడం లేదని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ద్వంద వైఖరితో పరిపాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని గుర్తు చేశారు. బాబుపాలనలో ప్రజా సంక్షేమం పడకేసిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామిని నెరవేర్చలేదని, చంద్రబాబు అబద్దాలను ప్రజలు మళ్లీ నమ్మే స్థితిలో లేరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడి కామాచార్యులు, ప్రధాన కార్యదర్శి ఏరూరు రంగస్వామి, వడ్డెర సేన రాష్ట్ర కార్యదర్శి మనోజ్‌ కుమార్, కార్యవర్గ సభ్యులు జగదీష్, రాఘవన్, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు