తీరని శోకం

26 Sep, 2015 02:43 IST|Sakshi
తీరని శోకం

బాపట్ల : ఈత సరదా రెండు నిండు ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరు సముద్రంలో గల్లంతవగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అల్లారుముద్దుగా పెంచుకుంటూ.. ఉన్నత చదువులు చదివిస్తున్న ఆయా కుటుంబాల్లో ఈ ఘటన విషాదాన్ని నింపింది. సూర్యలంక తీరంలో శుక్రవారం మృత్యుఘోష వినిపించింది. తోటి విద్యార్థులు చనిపోయారనే వార్తతో వారు చదివే కళాశాలలో విషాదం అలముకుంది. సహ విద్యార్థులు బాపట్లకు చేరుకుని బోరున విలపించారు.

 కళాశాల సెలవు కావటంతో వడ్లమూడి విజ్ఞాన్ కళాశాలకు చెందిన 12 మంది విద్యార్థులు గుంటూరు నుంచి బస్సులో బాపట్లకు చేరుకున్నారు. అక్కడినుంచి ఆటోలో సూర్యలంక బీచ్‌కి వచ్చారు. ఉదయం 11గంటలకు సముద్రం వద్ద అల్పహారం తీసుకుని సముద్రంలో స్నానాలు చేసేందుకు దిగారు. అందరూ స్నానాలు చేసేచోట కాకుండా కొద్దిగా దూరంగా వెళ్లి స్నానాలు చేసేందుకు ఆరుగురు విద్యార్థులు ప్రయత్నించారు. మిగిలినవారు ఒడ్డున ఉన్నారు. 

స్నానాలు ఆచరించేందుకు మొదటిగా మద్దిర మహేష్‌రెడ్డి, తిరిచేటి జయదేవ్, గుడివాడ కృష్ణప్రసాద్, ఆళ్ల ప్రసాద్‌రెడ్డి, ఆదిత్య, మణికంఠ సముద్రంలోకి దిగారు. వీరిలో మహేశ్‌రెడ్డి లోతులోకి వెళ్లడంతో గల్లంతువుతున్నట్లు గమనించిన విద్యార్థులు అతడిని రక్షించే యత్నం చేశారు. ఆదిత్య అనే విద్యార్థిని కూడా అలలు లోనికి లాగేస్తుండగా గమనించిన మణికంఠ అతనిని బలవంతంగా బయటకు తెచ్చేందుకు యత్నించాడు. అలల ధాటికి నలుగురు గల్లంతయ్యారు. వారిలో గుడివాడ కృష్ణప్రసాద్(19) మృతదేహం నీళ్లపై తేలింది. నీటిలో మునుగుతున్న మద్దిర మహేష్‌రెడ్డి(19) రక్షించే ప్రయత్నం చేసి అంబులెన్స్‌లో బాపట్ల ఏరియా హాస్పటల్‌కు తరలిస్తుండగా మృతి చెందాడు. మిగిలిన ఆళ్ళ శ్రీనివాసరెడ్డి, తిరిచేటి జయదేవ్ సముద్రంలో గల్లంతయ్యారు. వీరికోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 విద్యార్థుల కుటుంబాల్లో విషాదం..
 మృతుల్లో మద్దిర మహేష్‌రెడ్డి నల్గొండ జిల్లా మేళ్ళచెరువు మండలం, దొండపాడు గ్రామం. తండ్రి చిన్నారంగారెడ్డికి ఒక్కగానొక్క కుమారుడు. వారి బంధువులకు సంబంధించిన అమ్మాయి బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతూ ఘటనాస్థలానికి వచ్చి అతడు చనిపోయినట్లు సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు అందించారు. తిరిచేటి జయదేవ్ గుంటూరులోని శ్రీనివాసనగర్‌కాలనీకి చెందిన కిరీటిరావు కుమారుడు, తండ్రి ఆర్టీసీ కండక్టరు, తల్లి కె.మేరికుసుమకుమారి ఫారెస్ట్ రేంజ్ అధికారిగా పనిచేస్తున్నారు. కొటప్పకొండకు వెళ్ళుతున్నామని చెప్పిన జయదేవ్ వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

చెరుకుపల్లి మండలం రామభొట్లవారిపాలెంకు చెందిన గుడివాడ మోహనరావుకు ఏకైక కుమారుడు కృష్ణప్రసాద్. ఎరువుల వ్యాపారం చేస్తున్న మోహనరావు కుమారుడిని ఇంజినీరింగ్, కుమార్తెను ఇంటర్ చదివిస్తున్నాడు. కొల్లిపర మండలం కొత్తపాలేనికి చెందిన రామిరెడ్డి, రజనీల కుమారుడు ఆళ్ళ శ్రీనివాసరెడ్డి సముద్రంలో గల్లంతయ్యారు. వ్యవసాయం చేస్తూనే కుమారుడిని ఉన్నత చదువులు చదివించుకోవాలనే ఆశలు గల్లంతవగా ఆయా కుటుంబాల్లో విషాదం నింపింది.

 సమీక్షించిన అధికారులు..
 జిల్లా రూరల్ ఎస్పీ నారాయణనాయక్, ఎమ్మెల్యే కోన రఘుపతి, విజ్ఞాన్‌కళాశాల రిజిస్ట్రార్ ఎం.ఎస్.రఘునాధన్, ప్రిన్సిపాల్ మధుసూదనరావు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సముద్రంలో గజ ఈతగాళ్లను పెట్టి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
 
 ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం..
  బాపట్లటౌన్:  సూర్యలంక తీరంలో విద్యార్థులు మద్యం సేవించి సముద్రంలోకి దిగడం వల్లే ఘోరం జరిగిందని జిల్లా రూరల్ ఎస్పీ కె.ఎన్.నారాయణ్ నాయక్ తెలిపారు.  తీరంలో ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ హుటాహుటిన శుక్రవారం సాయంత్రం సూర్యలంక సముద్రతీరానికి చేరుకున్నారు. అక్కడి నుంచి మెరైన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకొని స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. అనంతరం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కృష్ణప్రసాద్, మహేష్‌రెడ్డి మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి వాళ్ల కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు. మూడు ప్రాంతాల్లో మూడు వాచ్‌టవర్లను ఏర్పాటుచేసి నిఘా పెంచుతామన్నారు. మద్యం సేవించి తీరంలోకి వెళ్లే అవకాశం లేకుండా తీరంవెంబడి రోజూ డ్రంక్‌అండ్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. ఇన్‌చార్జి డీఎస్పీ జీవీ రమణ  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు