‘లోన్‌’లొటారం!

22 Aug, 2019 07:05 IST|Sakshi

సాక్షి, తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి) : ఐడీబీఐ స్కాం వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్రతోపాటు ప్రభుత్వ శాఖల సిబ్బందిపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కిసాన్‌ క్యాష్‌ క్రెడిట్‌ స్కీమ్‌(కేసీసీ)లో భాగంగా చేపల చెరువుల పేరిట  2009 నుంచి 2011 వరకు జిల్లాలోని మూడు ప్రాంతాలకు చెందిన ఐదుగురు వ్యక్తులు సుమారు రూ.1100 కోట్లను రుణంగా పొందిన వ్యవహారం ఇప్పుడు జిల్లాలో సంచలనంగా మారింది. అక్రమార్కుల గుండెల్లో వణుకుపుట్టిస్తోంది. బ్యాంకు అధికారుల ఆశీస్సులతో రుణగ్రహీతలు చేపల చెరువులను తవ్వకుండానే రుణాలను తీసుకున్నారు.  అప్పట్లో ఈ వ్యవహారం అంతా గప్‌చుప్‌గా జరిగినా సీబీఐ రంగ ప్రవేశంతో స్కాంలో వాస్తవాలు బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. బ్యాంకు ఉన్నతాధికారులు కూడా అంతర్గత క్రమ శిక్షణ చర్యల్లో భాగంగా కొంతమందిపై చర్యలు తీసుకోడానికి నోటీసులు ఇచ్చినట్టు సమాచారం. పర్యవసానంగా వివరణలు నమోదు చేసి, క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేసినట్టు ఒక స్కెచ్‌ ప్రకారం వ్యవహారం నడుపుతున్నట్టుగా గత మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ప్రభుత్వ శాఖల సిబ్బందిపైనా దర్యాప్తు!
కేవలం బ్యాంకు అధికారులనే కాకుండా అసలు చేపల చెరువులు లేకుండానే చెరువులను సృష్టించడం, చెరువులలో చేపలు చనిపోకుండానే చనిపోయినట్టు, నష్టం జరిగినట్టుగా రికార్డులు సృష్టించడంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మత్స్యశాఖ అ«ధికారుల పాత్రపైనా సీబీఐ దర్యాప్తు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. రెండు రోజుల క్రితం జిల్లాకు చెందిన కొందరు ఐడీబీఐ కిసాన్‌ క్యాష్‌ క్రెడిట్‌ స్కీమ్‌లో స్కామ్‌కు సంబంధించి తమ దగ్గర  ఉన్న సమాచారాన్ని విశాఖ పట్టణంలో సీబీఐ అధికారులకు అందించే ప్రయత్నం చేశారు. వి«ధి నిర్వహణలో , దాడుల్లో ఉన్న సీబీఐ అధికారులను కలవడానికి అవకాశం ఉండదని, నేరుగా ఉన్నతాధికారులకే సమాచారం అందించాలనే మార్గదర్శకాలు ఉన్న నేపథ్యంలో వారికే వాస్తవ విషయాలను అందించడానికి కొందరు సిద్ధపడుతున్నారు.  

మూడు శాఖల పాత్రపై అనుమానం  
ఐడీబీఐ కేసీసీ స్కీమ్‌ కింద అడ్డగోలుగా వ్యవహరించిన బ్యాంకు అధికారుల పాత్రతోపాటు, ఈ స్కీమ్‌ అమలు చేసిన సమయంలో జిల్లాలో చేపల చెరువుల అనుమతులు, రిజిస్ట్రేషన్లు, వంటి వ్యవహారాలను పరిశీలించి అనుమతులు మంజూరు చేసిన రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌శాఖ, మత్స్యశాఖ అధికారుల పాత్రపై కేంద్ర ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో లోతైన దర్యాప్తు జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. 
 చేపల చెరువులకు హామీలుగా చూపించిన భూముల విలువను ఎక్కువగా చూపిస్తూ, సర్టిఫికెట్‌లు ఇవ్వడంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు అవతవకలకు పాల్పడినట్టు సమాచారం. చేపల చెరువులు లేకున్నా, ఉన్నట్టుగా సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో మత్స్యశాఖ అధికారులు ఆ సమయంలో భారీస్థాయిలో ముడుపులు తీసుకున్నారనే అభియోగాలున్నాయి. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరం సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. 

ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక ఆధారంగా చర్యలు 
బ్యాంకుల నుంచి చేపల చెరువుల కోసం రుణాలు పొందే సమయంలో హామీగా చూపించిన స్థలాలలో కొందరి సంతకాలు ఫోర్జరీ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో ఈ స్కీం స్కాం వ్యవహారంలో ఫోర్జరీ సంతకాల ఎపిసోడ్‌ కూడా ఉంది. సంతకాలు అసలువా, ఫోర్జరీ చేశారా అనే విషయంపై ఫోరెన్సిక్‌ సైన్సు ల్యాబ్‌ ( ఎఫ్‌ఎస్‌ఎల్‌) నివేదికలను ఇక్కడి పోలీసులు తెప్పించుకున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్టుగా మొత్తం వ్యవహారం ఫోర్జరీతో పాటుగా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

ఈడీ దృష్టికి విషయం 
స్కాం గురించి గతంలోనే ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్‌కు ఫిర్యాదులు వెళ్లాయి. రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకూ వెళ్లాయి. అంతేకాకుండా విశాఖపట్నంలోని డెట్‌ రికవరీ ట్రిబ్యునల్‌(డీఆర్‌టీ)కి కూడా వెళ్లాయి. కొంతమందికి  డీఆర్‌టీ నోటీసులు ఇచ్చింది. నోటీసులలో పేర్లు ఉన్నవారు ఆ నోటీసులను అందుకోకుండానే అందుకున్నట్టుగా, వీటి కోసం కొందరు న్యాయవాదులకు వకాల్తా ఇచ్చినట్టు తప్పుడు రిపోర్టులు డీఆర్‌టీకి పంపినట్టు సమాచారం. డీఆర్‌టీ విచారణలో ఈ వ్యవహారం బయటపడటంతో రాజీ  మార్గాలు కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా ఐడీబీఐ స్కాం వ్యవహారంలో వాస్తవాలు బయటకు వస్తున్నాయి. సరిగ్గా ఇదేసమయంలో సీబీఐ కూడా తనిఖీల వాస్తవాలను బయటపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో అప్పట్లో ఈ విషయంలో క్రియాశీలక భూమిక పోషించిన  వివిధ శాఖల అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. 

మరిన్ని వార్తలు