వైద్య పరీక్షల ఫీజు వివరాలు ప్రదర్శించాల్సిందే

21 Sep, 2014 03:31 IST|Sakshi
  • ఆర్టీఐ కమిషనర్ ఎం.విజయనిర్మల
  • విజయవాడ : రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్య పరీక్షలకు సంబంధించిన ఫీజుల వివరాలను తప్పకుండా ప్రదర్శించాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ ఎం.విజయనిర్మల సూచించారు. స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. సమాచార హక్కు చట్టం అమలుతీరు, చట్టం ద్వారా  పరిష్కరించిన సమస్యలు, ఇతర అంశాలపై  వివరించారు. సెక్షన్ 4(1)బికి సంబంధించి సమాచారాన్ని అన్ని కార్యాలయాలు తెలుగులోనే ప్రదర్శించాలన్నారు. దరఖాస్తుదారుని కోరిక మేరకు అంగ్లంలో ఉన్న తక్కువ పేజీల సమాచారాన్ని తెలుగులోకి అనువదించి అందజేయాల్సి ఉందని చెప్పారు.  ఆరోగ్యశాఖకు సంబంధించి ఎక్కువ దరఖాస్తులు అందుతున్నాయన్నారు.  
     
    63 వేలకు పైగా దరఖాస్తులు..
     
    రాష్ట్ర చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, వారి పరిధిలోని ఎనిమిది మంది కమిషనర్లకు 2005 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థనలు, ఫిర్యాదులు, ఇతర విషయాలకు సంబంధించి 63,018 దరఖాస్తులు అందగా, వాటిలో ఈ నెల 18వ తేదీ నాటికి 49,932 సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. ఇంకా మిగిలిన 13,086 దరఖాస్తుల పరిష్కారానికి త్వరితగతిన కృషి చేస్తామన్నారు.   తన పరిధిలోని వ్యవసాయం, ఆరోగ్యం, కో-ఆపరేటివ్, అటవీ, మార్కెటింగ్, గిరిజన సంక్షేమ శాఖలకు సంబంధించి 13 జిల్లాల అభ్యర్థనలు, ఫిర్యాదులను స్వీకరించేందుకు వారంలో మూడు రోజులు    విజయవాడలోనే  ఉంటానని ఆమె తెలిపారు.  
     

మరిన్ని వార్తలు