పచ్చని చేలో చిచ్చు

31 Jul, 2014 03:31 IST|Sakshi

చిలకలూరిపేట రూరల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కౌలుకు చేస్తున్న పంటపొలాలను దేవాదాయ శాఖ అధికారులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్న సంఘటన బుధవారం చిలకలూరిపేట రూరల్ మండలంలో జరిగింది. పోలీసులను రక్షణగా తెచ్చుకుని ట్రాక్టర్లతో భూములను ధ్వంసం చేశారు. 9.40 ఎకరాల్లో పత్తి మొలకలను నాశనం చేశారు. అడ్డొచ్చిన రైతులను పక్కకూ లాగి పొలాలను కలియదున్నేశారు. ఖరీఫ్ పెట్టుబడులను మట్టిపాలు చేశారు.  తెలుగుదేశం పార్టీ నేతల ఆదేశాల మేరకే అధికారులు పత్తి మొలకలు వచ్చిన పొలాలను ధ్వంసం చేశారని గంగన్నపాలెం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు పొలాలు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు దక్కకుండా చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. వివరాలు ఇలా వున్నాయి..
మండలంలోని కోమటినేనివారిపాలెం వజ్జావారి చెరువు మాన్యం భూమి  గోవిందపురం గ్రామంలో 9.40 ఎకరాలు ఉంది. ఆ భూమిని 1991 నుంచి గంగన్నపాలెంకు చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మన్నవ శేషగిరిరావు, మన్నవ మాణిక్యాలరావు కౌలుకు తీసుకుని సాగు చేసుకుంటున్నారు.
 ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మాణిక్యాలరావు భార్య నళిని గంగన్న పాలెంగ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఇది అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగ్రహానికి కారణమైంది.
 ఎలాగైనా తమ అధికార ప్రతాపం చూపించాలనుకున్న టీడీపీ  నేతలు పావులు కదిపారు.
 రెండు దశాబ్దాలుగా ఆ ఇద్దరు రైతులు సాగు చేసుకుంటున్న దేవుని మాన్యం భూములపై వారి కళ్లు పడ్డాయి. ఆ భూమిని వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు కాకుండా తమ పార్టీ వారికి కౌలుకు ఇప్పించే విధంగా తెరవెనుక మంత్రాంగం నడిపారు.
 కౌలు గడువు పొడిగించాలని రైతులు శేషగిరిరావు, మాణిక్యాలరావులు పెట్టుకున్న అర్జీలను దేవాదాయ శాఖ కార్యాలయ గదుల్లోనే తొక్కిపెట్టారు. కౌలు గడువు పొడిగిస్తున్నట్టు కానీ, వేరే రైతులకు ఇస్తున్నట్టుగానీ తెలియజేయకుండా అధికారులు మౌనం పాటించారు.
 ఎప్పటిలానే ఈ ఏడాది కూడా భూమిని తమకే కౌలుకు ఇస్తారని భావించిన రైతులు ఇద్దరూ ఖరీఫ్ సాగుకు ఉపక్రమించారు.
 దుక్కులు దున్ని కూలీల సాయంతో పత్తి విత్తులు నాటారు. ఎకరాకు రూ.20 వేల వంతున 9.40 ఎకరాలకు దాదాపు రూ.1.90 లక్షలు వ్యయం చేశారు.
 పత్తి మొలకలు వచ్చిన దశలో ఒక్కసారిగా బుధవారం దేవాదాయ శాఖ అధికారులు పోలీసులను వెంటేసుకుని ఆ పొలంపై విరుచుకుపడ్డారు.
 పొలాన్ని ధ్వంసం చేశారు..
 వైఎస్సార్ సీపీ కార్యకర్తలు శేషగిరిరావు, మాణిక్యాలరావులు కౌలు చేస్తున్న వజ్జావారి చెరువు మాన్యం భూముల్లోకి  దేవాదాయశాఖ అధికారులు, పోలీసులు ట్రాక్టర్లతో ప్రవేశించారని తెలుసుకున్న గ్రామస్తులు అక్కడకు చేరుకున్నారు. అక్కడవున్న దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేశ్వరరెడ్డి, సిబ్బంది, పోలీసులను నిలదీశారు. కౌలుకు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యంగా పొలాల్లోకి ప్రవేశించడం ఏంటని ప్రశ్నించారు.
 దీనిపై అస్టిటెంట్ కమిషనర్ రైతులకు వింతవాదన వినిపించారు. కౌలు కాలపరిమితి పూర్తయిందనీ, భూమిని స్వాధీనం చేయాలని ఖరాఖండిగా పేర్కొన్నారు.
 దీనిపై ఆగ్రహించిన కౌలురైతులు, గ్రామస్తులు భూమిని దున్నేందుకు తీసుకువచ్చిన ట్రాక్టర్లకు అడ్డుగా బైఠాయించారు.
 రూరల్ ఎస్‌ఐలు  ఎస్.జగదీష్, వెంకటేశ్వరరాజు తమ సిబ్బందితో రైతులను అక్కడి నుంచి పక్కకు లాగివేయడంతో ట్రాక్టర్లతో పొలాన్ని కలియదున్నారు. పత్తి మొలకలను ఎందుకు కాకుండా చేశారు.
 మాపై కక్ష కట్టారు...
 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు మాపై  కక్ష కట్టారు. ఎప్పటి నుంచో భూమిని సాగు చేసుకుంటున్నా ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడే ఎందుకిలా.. పత్తి విత్తనాలు నాటిన పొలంలో మొలకలు వచ్చాయి. ఈ సమయంలో వాటిని దున్ని నష్టం కలిగించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కౌలు నుంచి ఎలా తప్పిస్తారు. అధికారులు ఏక పక్షంగా వ్యవహరించటం ఎంత వరకు న్యాయం. పత్తి సాగుకు అయిన ఖర్చును వెంటనే చెల్లించాలని లేని పక్షంలో సమస్య పరిష్కరించే వరకు రోడ్డెక్కి పోరాడతాం.
 - మన్నవ మాణిక్యాలరావు, కౌలు రైతు.

మరిన్ని వార్తలు