మరికాసేపట్లో బన్ని ఉత్సవం

22 Oct, 2015 22:21 IST|Sakshi
మరికాసేపట్లో బన్ని ఉత్సవం

కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు కర్రల సమరం ప్రారంభం కానుంది. ప్రతి ఏటా విజయ దశమి రాత్రి నిర్విహించే ఈ ఉత్సవాన్ని నిలువ రించేందుకు పోలీసులు భారీగా మోహరించారు. మరో వైపు మండలంలోని నెరణికి, నెరణికి తాండా, కొత్తపల్లి, సులువాయి, విరుపాపురం, అరికేర, కురుకుంద, ముద్దనగేరి, ఆలూరు గ్రామాల ప్రజలు దేవరగట్టు ఉత్సవాల్లో పాల్గొనేందుకు సిద్దమయ్యారు.

 దసరా రోజు రాత్రంతా మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం, బన్ని ఉత్సవం, భవిష్యవాణి కార్యక్రమాన్ని నిర్వహించడం ఇక్కడ తరతరాల ఆచారం. కాగా.. మాలమల్లేశ్వర స్వామి విగ్రహాన్ని దక్కించుకునేందుకు ప్రజలు కర్రలతో కొట్టుకుంటారు. గత ఏడాది బన్ని ఉత్సవంలో నెరణికి గ్రామానికి చెందిన పదకొండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. గతంలో పాతకక్షలతో ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు దేవరగట్టు బన్ని ఉత్సవాన్ని వేదికగా చేసుకునేవారు. పరిస్థితి గతంతో పోలిస్తే కొంత మెరుగైనా రక్త చరిత్ర మాత్రం పునరావృతమవుతూనే ఉంది.
 
బన్ని ఉత్సవంలో హింసను నివారించేందుకు అధికార యంత్రాంగం శాశ్వత చర్యలు తీసుకోవడంలో విఫలమైందనే వాదనలు ఉన్నాయి. ఏటా ఉత్సవానికి పది రోజుల ముందు పోలీసులు, అధికారులు గ్రామ సమావేశాల పేరిట హడావుడి చేయడమే కాని.. ఉత్సవాన్ని నిలువ రించే కార్యక్రమం మాత్రం శూన్యం.

బన్ని ఉత్సవం రోజున వెయ్యికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి... చెక్ పోస్టులు పెడతారు. ఉత్సవం ప్రారంభమయ్యే సమయానికి పోలీసులు మాయమవుతారు. ఇనుప రింగులు చుట్టిన కర్రలతో ప్రత్యక్షమై జనం బన్నీ ఉత్సవంలో పాల్గొంటారు. ఎప్పటిలాగే రక్తం చిందటం యథావిదిగా జరిగిపోతుంది.  
 
దేవరగట్టు బన్ని ఉత్సవాలపై నాలుగేళ్ల క్రితం మానవ హక్కుల కమిషన్ స్పందించింది. నివేదిక ఇవ్వాలనీ ఆదేశించింది.  అయినా అమలు శూన్యం.
 

మరిన్ని వార్తలు