దేవాదాయశాఖ ఉద్యోగుల బదిలీలు

25 Aug, 2014 01:48 IST|Sakshi

ద్వారకాతిరుమల : రాష్ట్రంలో దేవాదాయశాఖ ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధమౌతోంది. దీంతో చినవెంకన్న దేవస్థానంలో పలువురు ఉద్యోగులకు వచ్చే నెలలో స్థానచలనం కలగనుంది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయశాఖ అన్ని ప్రధాన ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలను కోరుతూ ఆయా దేవస్థానాల ఈవోలను కమీషనర్ ఇప్పటికే ఆదేశించారు.  రాష్ట్రంలోని ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గ, సింహాచలం అప్పన్న, అన్నవరం రమా సహిత సత్యనారాయణస్వామి, కాణిపాకం విఘ్నేశ్వరుడు, భద్రాచలం శ్రీరాముడు, శ్రీశైలం మల్లికార్జునస్వామి, యాదిగిరిగుట్ట, శ్రీకాళహస్తి, పెనుగంచిప్రోలు, విశాఖపట్నం కనకమహాలక్ష్మి దేవస్థానం వంటి ప్రధాన దేవస్థానాల్లో మూడేళ్ల సర్వీసు పూర్తయిన రికార్డు అసిస్టెంట్ స్థాయి నుంచి ఏఈవో స్థాయి వరకు బదిలీలకు రంగం సిద్ధమైంది. పాలనా సిబ్బందితో పాటు ఇంజినీరింగ్ విభాగ సిబ్బందికి కూడా ఈసారి స్థానచలనం తప్పదని తెలుస్తోంది. అభియోగాలున్న ఉద్యోగులపై బదిలీల్లో ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. ఈనెల 19న జారి అయిన జీవో 175 ను అనుసరించి వచ్చే నెల 1 నుంచి 30 వరకు ఈ బదిలీల ప్రక్రియను చేపట్టేందుకు దేవాదాయశాఖ రంగం సిద్ధం చేస్తోంది.
 

మరిన్ని వార్తలు