‘ప్రత్యేక’ నిర్లక్ష్యం

8 Jul, 2016 16:02 IST|Sakshi
 ఖర్చుకాని వెనకబడిన ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధి నిధులు 
 రెండేళ్ల వ్యవధిలో రూ. 100కోట్లు విడుదల 
 ఇంతవరకు చేసిన ఖర్చు రూ. కోటి 50లక్షలు 
 పూర్తిగా వినియోగించామంటూ కేంద్రానికి తప్పుడు నివేదికలు 
 వాస్తవాలు పరిశీలిస్తే మన పరువు గంగపాలు
 
అభివృద్ధి పనులు జరగడం లేదంటే... నిధుల కొరతేమోనని అంతా భావించడం పరిపాటి. నిధులున్నా పనులు చేపట్టకపోతే ఏమంటారు...? కచ్చితంగా నిర్లక్ష్యమే కదా... అదే ప్రస్తుతం విజయనగరం జిల్లాకు శాపంగా మారింది. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక అభివృద్ధికోసం నిధులు కేటాయిస్తోంది. అందులో జిల్లాకు ఏటా రూ. 50కోట్లు వస్తున్నాయి. కానీ మన పరిస్థితి దేవుడు వరమిచ్చినా... పూజారి వరమివ్వనట్టు తయారైంది. ఇప్పటివరకూ కేవలం రూ. 5.02కోట్లే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. అందులో ఖర్చుచేసిందెంతో తెలుసా... రూ. 1.50కోట్లే. రెండేళ్లలో మనకోసం వచ్చిన రూ. వందకోట్లు సంగతేమిటో పాలకులే సమాధానం చెప్పాలి.
 
విజయనగరం : రాష్ట్ర విభజన నేపథ్యంలో రాష్ట్రంలోని ఏడు జిల్లాలను కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలుగా గుర్తించింది. అందులో విజయనగరం ఒకటి. ఒక్కో జిల్లాకు ఏటా రూ. 50 కోట్లు చొప్పున ఐదేళ్ల పాటు ఇవ్వాలని నిర్ణయించింది. అందులో భాగంగా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే(2014-2015) రూ. 50కోట్లు విడుదల చేసింది. ఆ నిధులు సకాలంలో ఖర్చు కాలేదు. స్పష్టమైన విధివిధానాల్లేవన్న సాకు చూపి రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ వచ్చింది.    ఇంతలోనే టీడీపీ నేతల కన్ను ఆ నిధులపై పడింది. అభివృద్ధి పనుల కింద వాటిని దక్కించుకుంటే పెద్ద ఎత్తున పర్సంటేజీల రూపంలో నొక్కేయొచ్చన్న ఆలోచనతో రంగంలోకి దిగారు.
 
వాటిని తమకే కేటాయించాలని అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఒత్తిళ్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఖర్చు చేసేందుకు అధికారులు సాహసించలేదు.  ఇంతలో 2015-2016కు సంబంధించి రెం డో విడతగా రూ. 50కోట్లు విడుదలయ్యాయి. ఈ లెక్క న రూ. 100కోట్లు జిల్లాకొచ్చినట్టయింది. విద్య, వైద్యం,తాగునీరు తదితర మౌలిక సౌకర్యాలకోసం ఈ నిధులు ఖర్చుచేయాలని కేంద్రం స్పష్టంగా పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం తమ అజెండాను కార్యాచరణలోకి తెచ్చి వ్యవసాయ శాఖ, ఉద్యానవనశాఖ, పశు సంవర్థక శాఖ, మత్స్యశాఖ, పట్టు పరిశ్రమ శాఖ, ఇరిగేషన్ తదితర శాఖలకు కేటాయించి ఖర్చు పెట్టాలని ఆదేశాలిచ్చింది.
 
 తాజాగా మంజూరు చేసిన పనులు 
జిల్లాలోని 18 ప్రభుత్వ శాఖల పరిధిలో రూ. 61.88కోట్ల విలువైన 397అభివృద్ధి పనులకు మంజూరు ఇచ్చారు. గురజాడ కళాభారతి ఆధునికీకరణకు రూ. 25లక్షలు, జిల్లాలోని ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీల అభివృద్ధి పనులకు రూ. 60లక్షలు, పార్వతీపురంలో భూసార పరీక్ష కేంద్రం ఏర్పాటుకు రూ. 10లక్షలు, దాసన్నపేట, రామభద్రపురం, పార్వతీపురంలో మినీ కోల్డ్ స్టోరేజీ కేంద్రాల ఏర్పాటుకు రూ. 36లక్షలు, కొత్తవలస, నాతవలస, చీపురుపల్లి, రామభద్రపురం, పార్వతీపురంలో హైవే బజార్లకోసం రూ. 60లక్షలు, నియోజకవర్గానికొక కస్టమ్స్ హైరింగ్ సెంటర్ కోసం రూ.82.65లక్షలు, 100 చెరువుల్లో చేప పిల్లల పెంపకానికి రూ. 32.82లక్షలు, ఏజెన్సీ పరిధిలో గల 252 గిరిజన రైతుల కోసం వ్యవసాయ బోర్‌వెల్స్ వేసేందుకు రూ. 201లక్షలు, కురుపాం, కొమరాడ మండలాల్లోని 90మంది రైతులకు సోలార్ పంపు సెట్లతో నడిచే వ్యవసాయ బోర్లు కోసం రూ. 58లక్షలు మంజూరు చేశారు. జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రూ. 22.50లక్షలు, ట్రైబల్ వేల్ఫేర్ రోడ్ల కోసం రూ. 1809.60లక్షలు, డ్వామా పరిధిలో నాలుగు భూగర్బజల సర్వే పరికరాల కోసం రూ. 1.80లక్షలు, 5హెచ్‌పీ సామర్ధ్యం గల 101సోలార్ పంపు సెట్ల కోసం రూ. 450లక్షలు, బలిజిపేట నుంచి పెద్దింపేట రోడ్డు వరకు బ్రిడ్జి నిర్మాణానికి రూ. 550లక్షలు, గెద్దలుప్పి, బగ్గందొరవలస మధ్య సువర్ణముఖి నదిపై ఎత్తై బ్రిడ్జి నిర్మాణానికి రూ. 450లక్షలతో పాటు మరికొన్ని పనులు మంజూరు చేశారు. తీర ప్రాంత సౌకర్యాల కేంద్రాలకు రూ. 4.4కోట్లతో పడవలు, వలలు మంజూరు తదితర పనులకు కేటాయించారు. ఇవిగాక మరికొన్ని పనులున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం మంజూరు దశలోనే ఉన్నాయి. ఈ పనుల  మంజూరు వెనుకా రాజకీయ లబ్ధి ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేతైనేమి రెండేళ్లకు విడతల వారీగా రూ. 100కోట్లు వస్తే ఇంతవరకు రూ. 5.02కోట్లు మాత్రమే మంజూరు చేసింది. ఇందులో రూ. కోటి 50లక్షల వరకు ఖర్చు చేయగలిగిందని తెలిసింది. 
 
ఖర్చు పెట్టకపోయినా కేంద్రానికి యూసీలు
తొలి విడత రూ. 50కోట్లు విడుదలై రెండేళ్లైనా పట్టించుకోని ప్రభుత్వ ఉన్నతాధికారులు తాజాగా విడుదలైన రూ. 50కోట్లుతో కలిపి రూ. 100కోట్లకు యుద్ధ ప్రాతిపదికన యూసీలివ్వాలని ఆ మధ్య జిల్లా అధికారులను ఆదేశించారు. ఇప్పుడిప్పుడే పనులు మంజూరు చేస్తున్నామని... ఇంకా పనులు మొదలుపెట్టనే లేదనీ, అలాంటప్పుడు విడుదలైన రూ. 100కోట్లకు యూసీలు ఎలా ఇవ్వగలమని అధికారులు చేతులెత్తేశారు. కానీ ప్రభుత్వం మాత్రం విడుదలైన రూ. 100కోట్లు ఖర్చు పెట్టినట్టు కేంద్రానికి నివేదికలిచ్చినట్టు తెలిసింది. దీనిపై నీతి అయోగ్ ఇప్పటికే మండిపడ్డట్టు సమాచారం. ఇప్పుడా పనులన్నింటినీ తనిఖీ చేస్తామని కూడా హెచ్చరించినట్టు తెలిసింది. వారన్నట్టుగా కేంద్ర బృందాలు జిల్లాకొస్తే కాగితాల్లో మంజూరు తప్ప పనులు ఎక్కడా కన్పించవు. వారొస్తే మన ప్రభుత్వం చిత్తశుద్ధి బయటపడనుంది. 
మరిన్ని వార్తలు