ఎన్నికలు ఉన్నందునే నంద్యాల అభివృద్ధి

23 Jul, 2017 02:06 IST|Sakshi
ఎన్నికలు ఉన్నందునే నంద్యాల అభివృద్ధి

ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: నంద్యాలలో ఉప ఎన్నికలు ఉన్నందునే ఇక్కడ మరింతగా దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఎన్నికల సభ కాదంటూనే పార్టీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని పక్కన ఉంచుకుని ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు.

శనివారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో రోడ్డు విస్తరణ పనులను పరిశీలించడంతో పాటు ఎస్‌ఆర్‌బీసీ కాలనీ వద్ద అందరికీ ఇళ్ల పథకం కింద గృహ సముదాయానికి భూమిపూజ చేశారు. అంతకుముందు ఎస్పీజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. అభివృద్ధి పనులు గమనించి తమ పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. నంద్యాలను స్మార్ట్‌ సిటీగా అభివృద్ధి చేస్తామని హామీనిచ్చారు.  

అర్హులందరికీ పథకాలు
నంద్యాల నియోజకవర్గంలో అర్హులైన అందరికీ రేషన్‌ కార్డులు, పెన్షన్లు మంజూరు చేస్తున్నామని సీఎం చెప్పారు. ఉప ఎన్నిక నేపథ్యంలోనే అభివృద్ధి పనులు చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. ఇల్లు లేని పేదలకు 13 వేల ఇళ్లు నిర్మించేందుకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. అభివృద్ధిని చూసి తమ పార్టీని ఆదరించాలన్నారు. ఇది ఎన్నికల సభ కాదంటూనే.. పదేపదే తమ పార్టీని ఆదరించాలం టూ సీఎం విన్నవించ డం, పార్టీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డిని పక్కన ఉంచుకుని ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించడంపై స్థానికులు మండిపడుతున్నారు.

సీఎంకు నిరసన సెగ
శంకుస్థాపన సందర్భంగా స్థానికులు  ‘సీఎం డౌన్‌ డౌన్‌’ అంటూ నిరసన వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా ఉంటున్న తమను ఖాళీ చేయించి ఇతరులకు గృహాలు కట్టించడమేంటని నిలదీశారు. అయితే.. సీఎం వారి సమస్యలు వినకుండానే వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు