‘టీడీపీ వెబ్ సమీక్షల పార్టీగానే మిగిలిపోతుంది’

30 May, 2020 17:08 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపడుతున్న పథకాలు ఇతర రాష్ట్రాలను ఏపీ వైపు చూసేలా ఉన్నాయని వైఎస్సార్‌సీపీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్‌ దేవినేని అవినాష్‌ అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా సీఎం జగన్ ఏడాది పాలనలో ఎనలేని అభివృద్ధి జరిగిందని తెలిపారు. పార్టీలకు అతీతంగా అన్ని వర్గాలను అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ జగన్‌ది అని కొనియాడారు. కృష్ణ లంక వాసుల చిరకాల వాంఛ తీర్చేందుకు రూ. 120 కోట్లు కేటాయించిన గొప్ప వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని అన్నారు. సీఎం ఆశీస్సులతో రిటైనింగ్ వాల్ పూర్తయితే వరద కష్టాలు తీరిపోతాయని తెలిపారు. నియోజకవర్గంలో పది కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని దేవినేని అవినాష్‌ పేర్కొన్నారు. (లంచాల మాట లేని ప్రభుత్వ పాలన: సీఎం జగన్‌)

సీఎం జగన్‌ ఏడాదిలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తామని దేవినేని అవినాష్‌ అన్నారు. ఐదేళ్లల్లో టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ అభివృద్ధి పనులు చేస్తుంటే టీడీపీ మోకాలడ్డు పెడుతోందని దుయ్యబట్టారు. టీడీపీ కుట్రలు, కుతంత్రాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కరోనా కష్ట కాలంలో పేదలకు ఎలాంటి కష్టం కలగకుండా చేసి పాలనాదక్షతను సీఎం వైఎస్‌ జగన్‌ చాటుకున్నారని తెలిపారు. కరోనా సమయంలో పారిపోయిన టీడీపీ జూమ్ యాప్ కాన్ఫరెన్స్‌లకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో టీడీపీ వెబ్ సమీక్షల పార్టీగానే మిగిలిపోతుందని మండిపడ్డారు. జగన్ నేతృత్వంలో పాలన దివంగత వైఎస్సార్‌ పాలనను మరిపించేలా ఉందన్నారు.  అందరూ ఆస్తులను వారసత్వంగా తీసుకొంటే వైఎస్ జగన్ తండ్రి ఆశయాలను లక్ష్యంగా చేసుకొన్నారని దేవినేని అవినాష్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు