తండ్రి, తనయులు చిత్తయ్యారు

16 May, 2014 19:42 IST|Sakshi
తండ్రి, తనయులు చిత్తయ్యారు

కృష్ణాజిల్లా రాజకీయాల్లో తండ్రికొడుకులు పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన మాజీమంత్రి దేవినేని నెహ్రూ, ఆయన తనయుడు దేవినేని అవినాష్లు ఓటమి చవిచూశారు. విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా తండ్రి దేవినేని నెహ్రూ పోటీ చేయగా, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా తనయుడు దేవినేని అవినాష్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. వారిద్దరూ టీడీపీ అభ్యర్థుల చేతిలో పరాజయం పొందారు.

1983లో టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వద్ద రాజకీయ ఓనమాలు దిద్దిన దేవినేని నెహ్రూ టిడిపి తరపున 1983, 85, 89, 94 అసెంబ్లీ ఎన్నికల్లో కంకిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1995లో ఎన్టీఆర్ చనిపోయాక కొంతకాలం లక్ష్మీపార్వతి పార్టీలో ఉండి ఆ తర్వాత 1996లో కాంగ్రెస్‌లో చేరి అప్పటి నుంచి పార్టీలో ముఖ్యనేతగా కొనసాగుతున్నారు. 1999లో కాంగ్రెస్ టికెట్‌పై కంకిపాడు నుంచి పోటీ చేసిన నెహ్రూ టీడీపీ అభ్యర్థి యలమంచిలి నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. 2004లో తిరిగి అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన నెహ్రూ 2009లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి 170 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు.

ఇక లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసిన అవినాష్  యువజన కాంగ్రెస్ కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరించి రాహుల్‌గాంధీ దృష్టిని ఆకర్షించారు. అనంతరం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో దేవినేని నెహ్రూ ఢిల్లీలో చక్రం తిప్పి తన తనయుడికి ఎంపీ టికెట్‌ ఇప్పించుకున్నారు. అయితే టీడీపీ ప్రభంజనానికి తండ్రి, తనయులు చిత్తయ్యారు.

మరిన్ని వార్తలు