దేవినేనీ.. ఇదేం పని!

16 Nov, 2018 13:30 IST|Sakshi
కొండపల్లిలో చింపిచేయించిన వైఎస్సార్‌ సీపీ పోస్టర్లు గొల్లపూడి వద్ద జాతీయ రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు

విపక్షం.. లేదని చూపడమే లక్ష్యంగా మంత్రి ఫ్లెక్సీల రాజకీయం

ప్రతిపక్షపార్టీ ఫ్లెక్సీలు కనిపిస్తే పంచాయితీ, అధికారులపై చిందులు

అధికారులతో దగ్గరుండీ వైఎస్సార్‌ సీపీ పోస్టర్లు తొలగిస్తున్న మంత్రి అనుచరులు

మంత్రి ఇలాఖాలో అడుగడుగునా ఆయన ఫ్లెక్సీలే

ప్రభుత్వ ఖజానాతో సొంత ప్రచారం!

అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షం ఊసే లేకుండా చేయాలన్న లక్ష్యమో.. లేక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పట్ల రోజురోజుకీ ప్రజల్లో పెరుగుతోన్న ఆదరణకు భయమేస్తోందో.. మొత్తానికి జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతల్లో వణుకు మొదలైంది. ముఖ్యంగా భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా తన నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీ లేదని చూపడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఫ్లెక్సీల రాజకీయానికి తెరతీశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు చెందిన ఫ్లెక్సీ గానీ, హోర్డింగ్‌ గానీ కనిపించిందా.. అధికారులపై శివాలెత్తిపోతున్నారు. విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.

సాక్షి, అమరావతిబ్యూరో : అత్త సొమ్ము అల్లుడి దానం అంటే ఇదే.. మైలవరం నియోజకవర్గంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వ సొమ్మును యథేచ్ఛగా సొంత ప్రచారానికి దుర్వినియోగం చేస్తున్నారు. అదేమంటే.. ఇది ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మాత్రమేనని.. ఇందులో మంత్రి చేసుకుంటున్న సొంత ప్రచారం ఏదీ లేదని ఆయన అనుచరులు బుకాయిస్తున్నారు. సరే.. ప్రభుత్వ పథకాల కోసమే నియోజకవర్గంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారనుకున్నా.. ఆయా శాఖల మంత్రుల ఫోటోలు ఆ ఫ్లెక్సీల్లో ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లేని పరిస్థితి. కేవలం ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు లోకేష్, మంత్రి దేవినేని ఉమాకు ముఖచిత్రాలు మినహా ఎవ్వరి ఫోటోలకు ఫ్లెక్సీలో చోటు లేకపోవడం గమనార్హం. వీటన్నింటిని ఏర్పాటు చేసిన యాడ్స్‌ కంపెనీకి నెలనెలా ప్రభుత్వమే లక్షలాది రూపాయలు చెల్లిస్తోంది.

ప్రతిపక్ష నేతల ఫ్లెక్సీలు కనిపిస్తే శివాలే..
తెలుగుదేశం అధినేత వైఖరితో అధికారపార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యం.. అదే సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు ఆదరిస్తుండటంతో మంత్రి దేవినేని ఉమా నియోజకవర్గంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న ప్రతిపక్షనేతపై కత్తికట్టారు. ఎక్కడా వారికి సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు  కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు అధికార యంత్రాంగాన్ని పావుగా వాడేసుకుంటున్నారు. పొరపాటున ఆయన పర్యటిస్తున్న ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు కనిపిస్తే అధికారులపై ఆయన శివాలెత్తిపోతున్నారు.

అధికారులే దగ్గరుండీ..
దీంతో మంత్రికి జడిసి పంచాయతీ, మున్సిపాలిటీ, పోలీసు అధికారులు దగ్గరుండీ ప్రతిపక్ష నేతల ఫ్లెక్సీలు తొలగించేస్తున్నారు. మైలవరం, ఇబ్రహీంపట్నం పోలీసులకు ఈ పని నిత్యకృత్యంగా మారిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇటీవల వెలగలేరు గ్రామంలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేయగా.. దానిని దగ్గరుండి పోలీసులు తొలగించడం జరిగింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు కడితే వారిపై రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరిస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా..
జాతీయ రహదారులపై ఎలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి వీల్లేదు. ఎన్‌హెచ్‌ఐ నిబంధనల మేరకు ఏ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు పెట్టినా నేరమే. పైగా ఎవరైనా ఏర్పాటు చేసినా వాటిని ఎన్‌హెచ్‌ఐ సిబ్బంది ఎప్పటికప్పుడు తొలగించేస్తారు. పదేపదే ఎవరైనా కావాలని పెడితే.. వారికి నోటీసులు జారీ చేసి చర్యలకు ఉపక్రమిస్తారు. అయితే హైదరాబాద్, జి.కొండూరు జాతీయ రహదారుల్లోని సెంటర్‌ మీడియన్‌పై ఏర్పాటు చేసిన విద్యుత్తు స్తంభాలపై దాదాపు 25 కిలోమీటర్ల మేర ప్రభుత్వ సొమ్ముతో ఫ్లెక్సీలు పెట్టారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిసినా ఎన్‌హెచ్‌ఐ అధికారులు అధికారపార్టీకి వత్తాసు పలుకుతున్నారు. అదేసమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఫ్లెక్సీలు ఎక్కడైనా ఉంటే రాత్రిరాత్రే వచ్చి వాటిని తొలగించేస్తున్నారు.

‘మంత్రి ఉమాకు ఓటమి భయం పట్టుకుంది’  
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): రాష్ట్రమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఓటమిభయం పట్టుకుందని వైఎస్సార్‌ సీపీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర నాయకుడు కాండ్రకొండ పెద్ద గురవయ్య అన్నారు. కొండపల్లిలో వైఎస్సార్‌ సీపీ బ్యానర్లు తొలగించటమే కాకుండా గోడలకు అంటించిన వాల్‌పోస్టర్లు కూడా అధికారులతో చించివేయించటం చూస్తుంటే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. కొండపల్లి పార్టీ కార్యాలయంలో  వాల్‌పోస్టర్లు చించివేయటంపై గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి మంత్రి చేష్టలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచి కాండ్రకొండ చినగురవయ్య, షేక్‌ షిలార్‌దాదా, అడపా దుర్గా ప్రసాద్, పల్లపోతు నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు, జాషువారాజు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు