నీళ్లు నమిలిన ఏపీ మంత్రి

21 Sep, 2017 04:12 IST|Sakshi
నీళ్లు నమిలిన మంత్రి దేవినేని

సాక్షి, విజయవాడ: కృష్ణా నదిలో, కరకట్ట (గట్టు) లోపల అక్రమ నిర్మాణాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నీళ్లు నమిలారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందంటూ సమాధానం దాటవేశారు. ఆక్రమణదారులకు తక్షణం నోటీసులు జారీ చేసి.. వాటిని పూర్తి స్థాయిలో తొలగించేలా చర్యలు తీసుకోవాలని, నివేదిక కూడా సమర్పించాలని గతంలో ఆయన డిమాండ్‌ చేసిన విషయాన్ని గుర్తు చేయగా.. జవాబు చెప్పకుండా విలేకరుల సమావేశం ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కాగా, 2014 డిసెంబర్‌ 31న జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృష్ణా నదిలో పరిశీలనకు బోటులో వెళ్లి.. నదికి ఇరువైపులా కరకట్టల లోపల ఆక్రమణలు ఉన్నాయని, చివరకు కృష్ణమ్మను కూడా వదల్లేదని, ఇంతకన్నా దుర్మార్గం మరొకటి ఉంటుందా అని మీడియా ఎదుట తారస్థాయిలో ఏకరువు పెట్టారు. ఆ మరుసటి రోజు (2015 జనవరి 1న) ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. కృష్ణా నదిలో ఆక్రమణలు దారుణమని, కాంగ్రెస్‌ వాళ్లు దేన్నీ వదిలిపెట్టరని, ఆక్రమణదారులను తాను వదిలిపెట్టే ప్రసక్తే లేదని తీవ్రంగా హెచ్చరించారు. తర్వాత ఆయనే ఉండవల్లిలోని కృష్ణానది ఒడ్డున ఉన్న లింగమనేని ఎస్టేట్‌లో మకాం పెట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది కరకట్ట లోపలవున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని కోరుతూ దాఖలైన పిల్‌పై మంగళవారం విచారణ జరిపిన ఉమ్మడి హైకోర్టు 57 మందికి నోటీసులు జారీ చేసింది.