బినామీకి 'బడా నజరానా'

19 Nov, 2018 04:42 IST|Sakshi

పోలవరం ప్రాజెక్టు పనుల్లోనూ మంత్రి దేవినేని ఉమా చేతివాటం

నోటిమాటపై రూ.285.92 కోట్ల విలువైన పనులు సూర్య కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగింత

ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్‌

ఆర్థిక శాఖ అడ్డుచెబితే కేబినెట్‌ తీర్మానం ద్వారా ఆమోదముద్ర వేసేలా వ్యూహం

గతంలోనూ ఇలాగే భారీగా బినామీ కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టిన వైనం

ఇందులో దేవినేనికి భారీ ప్రయోజనం చేకూరిందంటున్న అధికారవర్గాలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తన బినామీకి బడా నజరానా ఇచ్చారు. పోలవరం జలాశయం నుంచి ఎడమ కాలువకు నీటిని సరఫరా చేసే పనుల్లో (లెప్ట్‌ సైడ్‌ కనెక్టివిటీ) మిగిలిపోయిన రూ.90.01 కోట్ల విలువైన పనుల అంచనా వ్యయాన్ని రూ.285.92 కోట్లకు పెంచేసి, వాటిని సూర్య కన్‌స్ట్రక్షన్స్‌కు నోటిమాటపై కట్టబెట్టేశారు. దీని ద్వారా రూ.195.91 కోట్ల లబ్ధికి ఎత్తులు వేసినట్లు స్పష్టమవుతోంది. సర్కార్‌ నుంచి ఎలాంటి అనుమతి లేకున్నా మంత్రి దేవినేని దన్నుతో కాంట్రాక్టర్‌ పనులు కూడా ప్రారంభించేయడం గమనార్హం..! ఈ వ్యవహారంలో మంత్రి దేవినేనికి భారీ ప్రయోజనం చేకూరినట్లు అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది.

పోలవరం జలాశయం నుంచి ఎడమ కాలువను అనుసంధానం చేస్తూ నీటిని సరఫరా చేసే పనులను (65వ ప్యాకేజీ) 2005లో రూ.103.91 కోట్లకు యూనిటీ ఇన్‌ఫ్రా అనే సంస్థ దక్కించుకుంది. ఇందులో రూ.13.92 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ పూర్తి చేసింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో దివాలా పిటిషన్‌ దాఖలు చేసింది. దాంతో ఆంధ్రప్రదేశ్‌ డీటైల్డ్‌  స్టాండర్డ్‌ స్పెసిఫికేషన్స్‌లో ఆ సంస్థపై వేటు వేయాలన్న పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ ప్రతిపాదనపై స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది. నిబంధనల ప్రకారం మిగిలిపోయిన పనులను టెండర్లు ద్వారా కొత్త కాంట్రాక్టర్‌కు అప్పగించాలి.

అంచనా పెంచేసి.. నోటిమాటపై..
లెఫ్ట్‌ సైడ్‌ కనెక్టివిటీ పనుల్లో మిగిలిపోయిన 90.01 కోట్ల విలువైన పనులను తమకు అప్పగిస్తే.. పాత ధరలకే పూర్తి చేస్తామని ఆర్‌ఎస్సార్‌ ఇన్‌ఫ్రా, సూర్య కన్‌స్ట్రక్షన్స్‌ ముందుకొచ్చాయని పోలవరం చీఫ్‌ ఇంజనీర్‌ జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. ఇదే సమయంలో ఆ పనులు తన బినామీకి చెందిన సూర్య కన్‌స్ట్రక్షన్‌కు నామినేషన్‌ పద్దతిలో అప్పగించాలని మంత్రి దేవినేని ఒత్తిడి తెచ్చినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. పైగా అంచనా వ్యయాన్ని పెంచేయాలని ఒత్తిడి తెచ్చారు. జీవో 22 ప్రకారం ధరల సర్దుబాటును వర్తింపజేస్తే మిగిలిపోయిన పనుల విలువ రూ.126.38 కోట్లకు మించదని అధికారవర్గాలు తేల్చాయి. అయితే అంచనా వ్యయాన్ని పెంచాలంటూ మంత్రి ఒత్తిడి తెచ్చారు. దాంతో పోలవరం అధికారులు 2017–18 (స్టాండర్డ్‌ షెడ్యూల్డ్‌ రేట్స్‌) ప్రకారం రూ.285.92 కోట్లకు పెంచేశారు. వాటికి పాత ధరల ముసుగేసి తన బినామీకి నామినేషన్‌ పద్ధతిలో అప్పగించాలని మంత్రి దేవినేని అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అధికారులు జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపారు. ప్రస్తుతం అవి ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నాయి. అయితే దన్నుతో సూర్య కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ వారం క్రితమే పనులను ప్రారంభించేసింది.

కేబినెట్‌ తీర్మానంతో సక్రమం..:
నామినేషన్‌ పద్ధతిలో రూ.285.92 కోట్ల విలువైన పనులను కాంట్రాక్టర్‌కు అప్పగించడానికి ఆర్థిక శాఖ అంగీకరించే అవకాశాలు లేవు. దాంతో అక్రమంగా అప్పగించిన ఈ పనులను యథాప్రకారం కేబినెట్‌లో తీర్మానం ద్వారా సక్రమం చేసుకునేందుకు మంత్రి దేవినేని ఇప్పటికే వ్యూహం సిద్ధం చేశారు. కృష్ణా పుష్కరాల సమయంలో ఇదే కాంట్రాక్టర్‌కు రూ.52.47 కోట్ల విలువైన పనులను నామినేషన్‌పై అప్పగించి.. కేబినెట్‌తో ఆమోదముద్ర వేయించుకున్నారు. పోలవరం ఎడమ కాలువలో ఒకటో ప్యాకేజీ కింద రూ.92.14 కోట్ల విలువైన పనులను ఇదే రీతిలో కట్టబెట్టారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ నిధులు రూ.42.97 కోట్లు మళ్లించి విజయవాడలో తన క్యాంపు కార్యాలయం పనులను నామినేషన్‌పై అదే కాంట్రాక్టర్‌కు అప్పగించడం గమనార్హం. 

మరిన్ని వార్తలు